





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవారాధన); శకునములను విశ్వసించుట ‘షిర్క్’; శకునములను విశ్వసించుట ‘షిర్క్’ అని మూడు సార్లు అన్నారు. మరియు మనలో ప్రతి ఒక్కరూ దానిని ఎంతో కొంత అనుభవించిన వారమే; అయితే సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తనపై ఉంచిన భరోసా ద్వారా దానిని తొలగిస్తాడు.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శకునములను విశ్వసించుట గురించి హెచ్చరించినారు – అది ఏదైనా విషయం విన్నపుడు గానీ, లేక దేనినైనా చూచినపుడు గానీ ఏదో చెడు జరగబోతుందని, దానిని దుశ్శకునంగా, కీడు జరుగబోతుందనడానికి సూచనగా, చిహ్నముగా విశ్వసించడం – అది ఏదైనా పక్షిని చూసినపుడు గానీ, లేక ఏదైనా జంతువును చూసినపుడు గానీ, లేక అంగవైకల్యము కలిగిన (ఏదైనా లోపము కలిగిన) వ్యక్తులు ఎవరైనా ఎదురైనపుడు గానీ దానిని దుశ్శకునంగా విశ్వసించడం. హదీసులో కేవలం పక్షి శకునం గురించి మాత్రమే పేర్కొనబడింది, ఎందుకంటే ‘జాహిలియ్యహ్ కాలములో’ (ఇస్లాంకు ముందున్న అఙ్ఞాన కాలములో) పక్షి శకునం బాగా ప్రసిద్ధి చెందినది. ఆ రోజులలో ఏదైనా పని తలపెట్టడానికి ముందు; అంటే ఉదాహరణకు: ఏదైనా దూర ప్రయాణంపై బయలుదేరడానికి ముందు, లేక ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడానికి ముందు లేక అటువంటి ఏ విషయంపై అయినా – ముందుగా ఒక పక్షిని గాలిలోనికి ఎగురవేసేవారు. ఒకవేళ ఆ పక్షి కుడి వైపునకు ఎగిరి వెళితే అతడు దానిని మంచి శకునంగా విశ్వసించేవాడు, తాను మొదలు పెట్టాలనుకున్న కార్యాన్ని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఆ పక్షి ఎడమ వైపునకు ఎగిరి వెళితే అతడు దానిని దుశ్శకునంగా భావించే వాడు. తాను మొదలుపెట్టాలనుకున్న కార్యాన్ని మొదలుపెట్టకుండా వదిలివేసేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ‘షిర్క్’ (బహుదైవారాధన) అన్నారు. నిశ్చయంగా ఆ విధంగా విశ్వసించడం షిర్క్ (బహుదైవారాధన) అవుతుంది. ఎందుకంటే అల్లాహ్ తప్ప మరింకెవరూ లేక మరింకేదీ శుభాన్ని కలుగజేయలేరు, మరియు అల్లాహ్ తప్ప మరింకెవరూ లేక మరింకేదీ కీడును, చెడును దూరం చేయలేరు – ఆయన (అల్లాహ్) తనకెవరూ సాటి లేని, భాగస్వాములు లేని, తనకెవరూ సమానులు లేని అద్వితీయుడు, ఏకైకుడు. ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు “ఒక ముస్లిం హృదయంలో (కొన్ని సందర్భాలలో) ఏదైనా విషయానికి సంబంధించి దుశ్శకునం లాంటి భావన ఉత్పన్నం అవుతుంది. అయితే అల్లాహ్ పై సంపూర్ణంగా భరోసా ఉంచడం ద్వారా దానిని అతడు దానిని (అ భావనను) దూరం చేయాలి; దానితో పాటు ఆచరణలో కూడా దానిని అమలుచేయాలి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అష్’షిఖ్'ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను బనూ ఆమిర్ తెగ ప్రతినిధి బృందముతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలవడానికి బయలుదేరి వెళ్ళాను. అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”
అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:కొంతమంది వ్యక్తుల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినది. వారు ఆయన దగ్గరికి వెళ్ళినపుడు వారు ఆయనను ప్రస్తుతించారు. వాటిలో కొన్ని మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడలేదు. వారు ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా!) నీవు మా నాయకుడవు, సార్వభౌముడవు” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “(కేవలం) అల్లాహ్ మాత్రమే సార్వభౌముడు” ఆయన తన సృష్టి మొత్తముపై సంపూర్ణ సార్వభౌమత్వము గలవాడు. వారందరూ ఆయన దాసులు. దానికి వారు ఇలా అన్నారు: “నీవు ఘనతలో మా అందరిలో ఉత్తముడవు; స్థానములో, గౌరవములో మరియు వైశిష్ట్యములో మా అందరిలో అత్యుత్తముడవు.” “నీవు మహనీయతలో సమున్నతమైనవాడవు, మా అందరిలో ఔదార్యములో, విశిష్టతలో, స్థానములో ఉత్తముడవు.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తాము సాధారణంగా మాట్లాడుకునే విధంగానే మాట్లాడమని, ప్రయాసపడి గొప్పగొప్ప మాటలు పలుక రాదని; ఉన్న దానిని ఎక్కువ చేసి చెప్పుట, ముఖస్తుతి చేయుట వలన షైతాను వలలో పడరాదని, అది (ఇస్లాం లో) నిషిద్ధమైన బహుదైవారాధనకు, మరియు దానికి చేరువచేసే సాధనాలకు దారి తీస్తుందని - వారికి మార్గదర్శకం చేసారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అఖబా’ దినము ఉదయమున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై కూర్చుని (నాతో) “కొన్ని గులకరాళ్ళు ఏరి ఇవ్వు” అన్నారు. నేను ఆయనకు ఏడు గులకరాళ్ళు ఏరి ఇచ్చాను. అవి విసరడానికి అనువుగా ఉన్న గులకరాళ్ళు. వాటిని తన చేతిలో అటూ ఇటూ కదుపుతూ ఆయన ఇలా అన్నారు: “వీటిని పోలిన వాటిని (గులకరాళ్ళను) మీరు (అఖబా పై) విసరండి.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ప్రజలారా! ధర్మములో హద్దులు మీరకండి. నిశ్చయంగా ధర్మములో హద్దులు మీరినందుకే మీ పూర్వికులు నాశనం అయినారు.”
ఇబ్న్ మాజహ్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో - అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా హజ్జతుల్ విదాలో ‘యౌమున్నహర్’ దినమున (ఖుర్బానీ ఇచ్చే దినమున), జమరాతుల్ అఖబ పై గులకరాళ్ళు విసురు ఉదయము తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నానని తెలియజేస్తున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమారాత్ పై విసరడానికి తన కొరకు గులకరాళ్ళు ఏరి ఇవ్వమని ఆయనను ఆదేశించినారు. అపుడు ఆయన ఏడు గులకరాళ్ళు ఏరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇచ్చినారు. వాటిలో ఒకటి పెద్ద శనగ గింజంత, లేక బాదం గింజంత ఉన్నది. దానిని తన అరచేతిలో అటూఇటూ కదుపుతూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ పరిమాణములో ఉన్న దానిని (గులకరాయిని) విసరండి.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ధర్మానికి సంబంధించిన విషయాలలో అతివాద ప్రవృత్తిని లేక కాఠిన్యాన్ని కలిగి ఉండరాదని, ధర్మములో విధించబడిన హద్దులు మీర కూడదని హెచ్చరించినారు, ఎందుకంటే పూర్వము గతించిన జాతులు, ధర్మము విషయములో హద్దులు మీరడం, అతిగా వ్యవహరించడం, మరియు కాఠిన్యాన్ని అవలంబించడం కారణంగా నాశనం చేయబడినాయని తెలియజేసినారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జాహిలియ్యహ్’ కాలానికి (ఇస్లాం పూర్వ అనఙ్ఞానపు కాలానికి) చెందిన కొన్ని విషయాలకు వ్యతిరేకంగా, మరియు వారికి హెచ్చరికలాగా ఇందులో వివరిస్తున్నారు. ఒక ప్రకటనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటున్నారు “ప్రతి విషయమూ అల్లాహ్ చేతిలో ఉంది, ఆయన ఆఙ్ఞ మరియు శాసనం ద్వారా తప్ప ఏమీ జరుగదు”. జాహిలియ్యహ్ కాలమునాటి కొన్ని విషయాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో పేర్కొన్నారు. అవి: మొదటిది: జాహిలియా ప్రజలు ఏ వ్యాధి అయినా దానంతట అది స్వయంగా ఇతరులకు సంక్రమిస్తుందని భావించేవారు; కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తుడై ఉన్న వ్యక్తి నుండి ఇతరులకు ఆ వ్యాధి తనంతట తనే వ్యాపిస్తుంది అనే నమ్మకాన్ని నిషేధించారు; అల్లాహ్’యే సమస్త విశ్వాన్ని నియంత్రించేవాడు; ఆయనే అనారోగ్యాన్ని పంపుతాడు, మరియు దానిని తొలగించేవాడు కూడా ఆయనే, ఇది అల్లాహ్ యొక్క సంకల్పం మరియు ఆయన పూర్వ నిర్దిష్టము ద్వారా తప్ప జరగదు. రెండవది: జాహిలియ్యహ్ కాలములో ప్రజలు ఏదైనా దూర ప్రయాణముపై గానీ, లేక ఏదైనా వ్యాపారము నిమిత్తము గానీ బయలుదేరడానికి ముందు పక్షులను గాలిలోనికి ఎగురవేసేవారు. ఆ పక్షి కుడివైపునకు మళ్ళితే అది మంచి శకునం అని సంతోషించేవారు. ఒకవేళ అది ఎడమ వైపునకు మళ్లితే అది చెడు శకునంగా భావించి ఆ పనిని చేయకుండా వదిలివేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పక్షులతో శకునం, అపశకునం అనే భావనను నిషేధించినారు. అదంతా మూఢ విశ్వాసము అన్నారు. మూడవది: జాహిలియ్యహ్ కాలములో ప్రజలు – ఒకవేళ గుడ్లగూబ ఎవరి ఇంటిపైన గానీ కూర్చుంటే ఆ ఇంటి వారిపై ఏదో ఒక ఆపద వచ్చి పడుతుందని భావించే వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూఢవిశ్వాసాన్ని కూడా నిషేధించినారు. నాలుగవది: ఇస్లామీయ నెలలలో (చాంద్రమాన మాసములలో) రెండవ మాసమైన ‘సఫర్’ మాసము పట్ల ప్రజలలో ప్రబలి ఉన్న మూఢనమ్మకాలను కూడా నిషేధించినారు. సఫర్ మాసము ఒక పాము వంటిదని, అది మనుషులు మరియు పశువుల కడుపులలో నివసిస్తూ ఉంటుందని. అది ‘గజ్జి’ కన్నా వేగంగా ఇతరులకు సంక్రమిస్తుందని భావించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడనమ్మకాన్ని కూడా నిషేధించినారు. ఐదవది: కుష్ఠురోగి నుండి, ఏవిధంగానైతే ఒక సింహము నుండి దూరంగా ఉంటామో ఆ విధంగా దూరంగా ఉండమని ఆదేశించినారు. ఇది ఎందుకంటే స్వయం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకొనుటకు గానూ, తగినంత రక్షణ తీసుకొనుటకు గానూ, మరియు అల్లాహ్ ఆదేశించిన ఆచరణలు ఆచరించమని. కుష్ఠు వ్యాధి మనిషి అంగాలను క్రమంగా తినివేస్తుంది.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి) లేదు, అలాగే ఏ “తియరహ్” (అపశకునము) లేదు; అయితే “అల్ ఫా’ల్” ను (మంచి శకునాన్ని) నేను ఇష్టపడతాను”. ఆయన వద్ద ఉన్న వారు ప్రశ్నించారు “అల్ ఫా’ల్” అంటే ఏమిటి?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఒక మంచి మాట” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఇస్లాంకు పూర్వ అజ్ఞాన యుగంలో ప్రజలు, అల్లాహ్ ఆదేశం తో నిమిత్తం లేకుండా అంటువ్యాధి దానంతట అదే ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని విశ్వసించేవారు; అల్లాహ్ ఆదేశం లేకుండా ఇతరులకు వ్యాపిస్తుందని భావించడం తగదు అని అది అసత్యము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. మరియు ‘అత్’తియరహ్’ (దుశ్శకునం), అంటే ఏదైనా ధ్వని వినడం, లేదా ఏదైనా ఎదురుకావడం లేదా దేనినైనా చూడడం వలన అయిష్టమైనది ఏదైనా జరుగవచ్చునని విశ్వసించడం – ఉదాహరణకు ఏవైనా పక్షులు, లేదా జంతువులు, లేదా ఏదైనా అంగవైకల్యం కలిగిన వారు ఎదురుకావడం మొ.; అలాగే ప్రత్యేకమైన అంకెలను దుశ్శకునంగా విశ్వసించడం, ప్రత్యేక దినములను దుశ్శకునపు దినాలుగా విశ్వసించడం లేదా ఇటువంటి ఇంకా ఏదైనా. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ‘తియరహ్’ ను (పక్షిని) ప్రస్తావించినారు. ఎందుకంటే ఇది ఇస్లాం పూర్వ అజ్ఞాన యుగంలో ప్రజల మధ్య బాగా ప్రసిద్ధి చెందిన ఒక ఆచారంగా ఉండింది. దానికి మూలం ఏమిటంటే ఆ కలం లో ప్రజలు ఏదైనా పని తలపెట్టాలని సంకల్పించినపుడు, అంటే ఉదాహరణకు ఏదైనా దూరప్రయాణానికి సంకల్పించినా లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి సంకల్పించినా లేక ఇంకేదైనా పనికి సంకల్పించినా ముందుగా ఒక పక్షిని గాలిలోనికి ఎగురవేసేవారు. ఆ పక్షి కుడివైపునకు మళ్ళితే అది మంచి శకునంగా సంకల్పించిన పనిని మొదలుపెట్టేవారు, ఎడమ వైపునకు మళ్ళితే చెడు శకునంగా భావించి తలపెట్టిన పనిని మొదలుపెట్టకుండా వాయిదా వేసుకునేవారు లేదా దానిని విడిచి పెట్టేసే వారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను ‘అల్ ఫా’ల్’ (మంచి శకునాన్ని) ఇష్టపడతానని చెప్పారు, ఇది ఒక వ్యక్తికి ఒక మంచి మాట, ఒక మంచి వార్త విన్నపుడు అతనికి కలిగే ఆనందము, సంతోషము, హర్షము మొదలైనవి. అది ఒక దాసునికి తన ప్రభువుపై మంచి అపేక్ష కలిగి ఉండేలా చేస్తుంది.
అల్ బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మదీనా వాసులలో అన్సారుల పట్ల ప్రేమను కలిగి ఉండుట అన్నది సంపూర్ణమైన విశ్వాసానికి నిదర్శనం. ఇది ఎందుకంటే (అత్యంత కష్ట కాలములో) వారు ముందడుగు వేసి ఇస్లాంకు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సహాయంగా, మద్దతుగా నిలబడినారు, (మదీనాకు వలస వచ్చిన) ముస్లిములకు శ్రమకోర్చి ఆశ్రయం కల్పించారు, వారికి ధన సహాయం చేసినారు, మరియు అల్లాహ్ మార్గములో ప్రాణలను సైతం అర్పించినారు. వారిని ద్వేషించడం కపటత్వానికి నిదర్శనం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే అన్సారులను ప్రేమిస్తాడో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే అన్సారులను ద్వేషిస్తాడో, అల్లాహ్ వారిని ద్వేషిస్తాడు – అని వివరించారు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఈ విధంగా హితబోధ చేసినారు: తమ శక్తి సామర్థ్యాల మేరకు - అల్లాహ్ పట్ల నిజాయితీతో, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి, సున్నత్ ను అనుసరిస్తూ సదాచరణలు చేయాలని, ఆచరణలలో హద్దుమీరడం గానీ, లేదా నిర్లక్ష్యం గానీ ఉండరాదని, వాటి ద్వారా నిర్దేశించబడిన మంచిని సాధించే సంకల్పముతో ఆచరించాలని, ఆ విధంగా వారి ఆచరణలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాగలవని, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం వారిపై అవతరించడానికి కారణం అవుతుందని హితబోధ చేసినారు. తరువాత వారికి మీలో ఎవరూ కేవలం తమ ఆచరణల ఆధారంగా (తీర్పుదినమునాడు) రక్షించబడరని, అందుకు అల్లాహ్ యొక్క కరుణ, అనుగ్రహం కూడా అవసరమని తెలియజేసినారు. సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను “మీరు కూడా రక్షించబడరా ఓ రసూలుల్లాహ్! మీ ఆచరణలు ఎంతో ఉత్తమమైనవి అయినప్పటికీ?” అని ప్రశ్నించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, నేను కూడా, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం నన్ను కప్పివేస్తే తప్ప.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు. వారు తమ తరువాత వచ్చిన వారితో తొలగించబడ్డారు. మరియు వారు (తరువాత వచ్చినవారు) చేయని పనులను గురించి మాట్లాడతారు మరియు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. ఎవరైతే వారితో తన చేతితో పోరాడుతాడో అతడు విశ్వాసి. ఎవరైతే వారితో తన నాలుకతో పోరాడుతాడో అతడు విశ్వాసి, మరియు ఎవరైతే వారితో తన హృదయంతో పోరాడుతాడొ అతడు విశ్వాసి. ఇక దీనికి మించి ఆవ గింజంత విశ్వాసం కూడా లేదు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన జాతివారి నుండి ఎంపిక చేయబడిన శిష్యులు, సహాయకులు, సహచరులు, నిజాయితీ గల ముజాహిదీన్లు కలిగి లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఏ జాతికీ అల్లాహ్ ప్రవక్తను పంపలేదు. అటువంటి శిష్యులు వారి తరువాత వారి ప్రతినిధులుగా (ఖలీఫాలుగా) కాగలిగిన అన్ని అర్హతలూ కలిగి ఉండేవారు. వారు ఆ ప్రవక్త యొక్క సున్నత్’ను అనుసరిస్తారు మరియు ఆయన ఆదేశాలను శిరసావహిస్తారు. ఆ సలఫ్ సాలిహీన్’ల (ధార్మీకులైన పూర్వీకుల) తరువాత మంచివారు కాని వ్యక్తులు వచ్చారు. వారు తాము చేయని పనులను గురించి చెబుతారు మరియు వారు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. కాబట్టి వారితో తన చేతితో పోరాడేవాడు విశ్వాసి, తన నాలుకతో వారితో పోరాడేవాడు విశ్వాసి, మరియు తన హృదయంతో వారితో పోరాడేవాడు విశ్వాసి. అంతకు మించిన విశ్వాసం లేదు, కనీసం ఆవగింజంత కూడా లేదు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నాకంటే ముందు ఎవరికీ ప్రసాదించబడని ఐదు (ప్రత్యేకతలు) నాకు ప్రసాదించబడినాయి. నాకు ఒక నెల ప్రయాణం దూరం నుండి (శత్రువులలో) భయోత్పాతం ద్వారా విజయం ప్రసాదించబడింది; భూమి నాకు మస్జిదుగానూ మరియు శుద్ధి పొందే స్థలంగానూ చేయబడింది. కనుక నా ఉమ్మత్’కు చెందిన వ్యక్తి నమాజు సమయం అయినపుడు అతడు సమయానికి నమాజు ఆచరించాలి, యుద్ధములో గెలువబడిన సంపద (యుద్ధప్రాప్తి) నా కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది, నాకు పూర్వం ఎవరికీ అది ధర్మసమ్మతం కానప్పటికీ; (తీర్పు దినమునాడు) సిఫారసు చేసే అవకాశం నాకు ప్రసాదించబడింది; ప్రవక్తలు, సందేశహరులు ప్రత్యేకంగా తమ జాతివారి కొరకు మాత్రమే పంపబడేవారు, మరియు నేను ప్రజలందరి కొరకు (అల్లాహ్ యొక్క) సందేశహరునిగా పంపబడినాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా తనకు పూర్వం ఏ ప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలను అల్లాహ్ తనకు ప్రసాదించినాడు. మొదటిది: నాకు మరియు వారికి మధ్య ఒక నెల ప్రయాణమంత దూరం ఉన్నప్పటికీ, (నా గురించి) శత్రువుల హృదయాలలో జనించే భయోత్పాతం ద్వారా నాకు సహాయం చేయబడింది. రెండవది: భూమి మనకు మస్జిదుగా (ప్రార్థనా స్థలంగా) చేయబడింది, దాని కారణంగా మనం ఎక్కడ ఉన్నా నమాజు చేయవచ్చు మరియు భూమి, నీరు లభ్యం కానప్పుడు ధూళితో శుద్ధి చేసే సాధనంగా కూడా చేయబడింది. మూడవది: యుద్ధ ప్రాప్తి, అంటే అవిశ్వాసులతో జరిగే యుద్ధములలో గెలిచే సంపద, మన కొరకు ధర్మసమ్మతం చేయబడింది. ముస్లిములు అటువంటి సంపదను తీసుకోవచ్చును. నాలుగవది: పునరుత్థాన దినమునాడు భయోత్పాతంలో కొట్టుమిట్టాడుతు నిలుచుని ఉన్న ప్రజలకు ఊరటనిచ్చేలా గొప్ప సిఫారసు చేసే అవకాశం ప్రసాదించబడింది. ఐదవది: నేను సృష్టితాలన్నింటి కొరకు, మానవులకొరకు మరియు జిన్నుల కొరకు (అల్లాహ్ యొక్క సందేశహరునిగా) పంపబడినాను. నాకు పూర్వం పంపబడిన ప్రవక్తలు ప్రత్యేకించి వారి వారి జాతుల కొరకు పంపబడినారు.