





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
హారిథా ఇబ్న్ వహ్బ్ అల్ ఖుజాఈ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “వినండి! మీకు స్వర్గవాసుల గురించి తెలియజేయనా? ప్రజలు తక్కువగా చూసే ప్రతి బలహీనమైన, పేద మరియు అంతగా ఎవరికీ తెలియని వ్యక్తి; అతడు గనుక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అన్నట్లయితే, అల్లాహ్ దానిని నెరవేరుస్తాడు. వినండి! మీకు నరకవాసుల గురించి తెలియజేయనా? మదమెక్కిన ప్రతి క్రూరుడు, మూర్ఖుడు, పిసినారి మరియు గర్విష్టి నరకంలో ప్రవేశిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గవాసుల మరియు నరకవాసుల కొన్ని లక్షణాలను తెలియజేసినారు. స్వర్గవాసులలో ఎక్కువగా ఎవరు ఉంటారంటే: “బలహీనులు మరియు వినయవిధేయతలతో ఉండే ప్రతి ఒక్కరూ”; అంటే దాని అర్థం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయుడై, వినమ్రుడై, ఆయన ముందు తనను తాను అల్పునిగా భావించుకునే వ్యక్తి; ఎంతగా అంటే కొంతమంది ప్రజలు అతణ్ణి బలహీనుడిగా భావిస్తారు మరియు అతడిని తృణీకరిస్తారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు వినమ్రుడై ఉండే అటువంటి వ్యక్తి, అల్లాహ్ నుండి ఆయన ఔదార్యాన్ని ఆశిస్తూ, ఒకవేళ అల్లాహ్ పేరున ఏదైనా ప్రమాణం చేస్తే అల్లాహ్ అతడి ప్రమాణాన్ని నెరవేరుస్తాడు, అతడు వేడుకున్న అతని అభ్యర్థనకు, అతడి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నరకవాసులలో ఎక్కువ మంది ఎవరు అంటే: “ఉతుల్” అంటే అనాగరికంగా, మొరటుగా, కఠినంగా వ్యవహరించేవాడు, మరియు తీవ్రంగా కలహాలు, తగాదాలు పెట్టుకునే వ్యక్తి; “ఫాహిష్” అంటే అసభ్యంగా, అసహ్యకరంగా ప్రవర్తించేవాడు, అశ్లీల కార్యాలకు పాల్బడేవాడు, మంచికి ఎప్పుడూ విధేయత చూపనివాడు; “జవాజ్” అంటే గర్విష్ఠుడు, తిండిపోతు, దుర్మార్గుడు, పెద్ద శరీరము గలవాడు, తన నడకలో గర్వముతో, నిక్కుతూ, నీల్గుతూ నడిచేవాడు; “ముస్తక్బిర్” అంటే సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు ఇతరులను తక్కువగా చూసేవాడు; అహంకారి.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినారు: నేను నా దాసుని పట్ల ఆ విధంగానే ఉంటాను, ఏ విధంగానైతే అతడు నన్ను తలపోస్తాడో; కనుక నా దాసుడు, క్షమాభిక్ష యొక్క ఆశ మరియు ఆపేక్షల ద్వారా నా పట్ల ఏ విధమైన భావం కలిగి ఉంటాడో నేను అతడిని ఆ విధంగా ఆదరిస్తాను, అతడు నా నుంచి మంచి లేక మరో విధంగా ఏదైనా ఆశించి నట్లతే నేను అతనిపట్ల అది చేస్తాను. అతను నన్ను స్మరించినట్లయితే నేను అతనితో దయ, విజయం, మార్గదర్శకత్వం, సంరక్షణ మరియు మద్దతులతో అతనితో ఉంటాను. ఒకవేళ అతడు ఒంటరిగా ఉన్నపుడు, తన మనసులో, తన ఏకాంతములో నన్ను స్మరించినట్లయితే నేను అతడిని నాలో నేను గుర్తు చేస్తాను. ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో నన్ను స్మరించినట్లయితే, నేను అతడిని అంత కంటే ఎక్కువ సంఖ్యగల సమావేశములో, వారి కంటే ఉత్తములైన వారి సమావేశములో అతడిని నేను ప్రస్తావిస్తాను. ఒకవేళ అతడు ఒక జానెడంత అల్లాహ్’కు చేరువగా వచ్చినట్లయితే, అల్లాహ్ అతడిని ఉన్నతం చేస్తాడు, తద్వారా అల్లాహ్ అతనికి ఒక మూరెడు చేరువ అవుతాడు. ఒకవేళ అతడు అల్లాహ్’కు ఒక మూరెడు చేరువ అయితే, అల్లాహ్ అతనికి ఒక బారెడు చేరువ అవుతాడు. ఒకవేళ అతడు అల్లాహ్ వైపునకు నడుచుకుంటూ వచ్చినట్లయితే, అల్లాహ్ అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాడు. దాసుడు తన ప్రభువుకు విధేయత ద్వారా, మరియు (చెడును వదిలి) ఆయన వైపునకు మరలుట ద్వారా ఆయనకు చేరువ అయితే, అతడు ఆచరించిన దానికి సమానంగా, ప్రతిఫలంగా అల్లాహ్ అతనికి తన సాన్నిహిత్యాన్ని వృద్ధిచేస్తాడు. తన ప్రభువైన అల్లాహ్ పట్ల దాసుని యొక్క దాస్యము ఎంత పరిపూర్ణంగా ఉంటుందో, అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కి అంత దగ్గరగా ఉంటాడు. అల్లాహ్ ఏదైనా ప్రసాదించుట మరియు దాని ప్రతిఫలం దాసుని ఆచరణ మరియు అతని శ్రమకంటే గొప్పవి. ఫలితంగా అల్లాహ్’నుండి లభించే ప్రతిఫలం నాణ్యత మరియు పరిమాణం పరంగా అతని ఆచరణ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఒక విశ్వాసి అల్లాహ్ పట్ల మంచి ఆపేక్ష కలిగి ఉంటాడు, మంచి పనులు చేయడంలో మునిగిపోతాడు, వాటిని మరింత వేగవంతం చేస్తాడు, అల్లాహ్’ను కలుసుకునే వరకు అతడు ఆవిధంగా చేస్తూనే ఉంటాడు.
తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నజ్ద్ ప్రాంతపు ప్రజల నుండి చెదిరిన జుట్టుతో ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతను ఉచ్ఛ స్వరంతో మాట్లాడడం మేము వినగలుగుతున్నాము, కాని అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చే సరికి, అతను ఇస్లాం గురించి అడుగుతున్నాడని స్పష్టమైంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా చెప్పారు: “దినము మరియు రాత్రిలో (విధిగా ఆచరించవలసిన) ఐదు సలాహ్’లు (నమాజులు) ఉన్నాయి”; దానికి అతడు “ఇవి గాక ఇంకేమైనా (నమాజులు) నాపై ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప. అలాగే (విధిగా ఆచరించవలసిన) రమదాన్ మాసపు ఉపవాసాలున్నాయి” అన్నారు. అతడు “ఇవిగాక నాపై ఇంకేమైనా (ఉపవాసాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జకాత్ గురించి తెలిపినారు. దానికి అతడు “ఇది గాక నాపై ఇంకేమైనా (దానాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలనుకుంటే తప్ప” అన్నారు. దానితో అతడు ఇలా అంటూ వెనుదిరిగినాడు “అల్లాహ్ సాక్షిగా, దీనిపై ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, దీని నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారునజ్ద్ నుండి ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చాడు, అతని జుట్టు అస్తవ్యస్తంగా ఉంది, అతని గొంతు బిగ్గరగా ఉంది, కానీ అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం ధర్మం యొక్క తప్పనిసరి విధుల గురించి (ఫరాయిద్ గురించి) అడిగాడు. ప్రవక్త అతనికి సలాహ్ గురించి చెప్పడంతో ప్రారంభించారు, మరియు అల్లాహ్ ప్రతి దినము మరియు రాత్రిలో అతని కొరకు ఐదు సలాహ్’లను తప్పనిసరి చేశాడని తెలియజేసారు. అతను ఇలా అడిగినాడు: నేను ఈ ఐదు సలాహ్’లు తప్ప మరేదైనా (సలాహ్) చేయాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అల్లాహ్ నీపై విధి గావించిన వాటిలో రమజాన్ మాసం ఉపవాసాలు కూడా ఉన్నాయి”. దానికి అతడు “రమజాన్ మాసపు ఉపవాసాలు గాక నేను ఇంకేమైనా ఉపవాసాలు పాటించవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛంద ఉపవాసాలు ఆచరిస్తే తప్ప” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ‘జకాత్’ గురించి ప్రస్తావించారు. ఆ వ్యక్తి “విధిగా చెల్లించవలసిన ఈ జకాతు గాక నేను ఇంకేమైనా దానములు చేయవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు. ఆ వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ విధి ఆచరణలను గురించి విన్న తర్వాత అతను వెనక్కి తిరిగి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై ప్రమాణం చేసాడు, అతను వాటికి దేనినీ జోడించకుండా లేదా వాటి నుండి ఏమీ తీసి వేయకుండా వాటికి కట్టుబడి ఉంటాడని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ వ్యక్తి తాను చేసిన ప్రమాణం గురించి నిజాయితీగా, సత్యవంతుడై ఉంటే, అతను విజయవంతమైన వారిలో ఉంటాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము ‘శుక్రవారము’. శుక్రవారమునాడే ఆదం అలైహిస్సలాం సృష్టించబడినారు; శుక్రవారమునాడే ఆయన స్వర్గములో ప్రవేశింపజేయబడినారు, శుక్రవారమునాడే ఆయన దాని నుండి బయటకు తీయబడినారు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.”
ముస్లిం నమోదు చేసినారు:సూర్యుడు ఉదయించే దినములలో అత్యంత ఉత్తమమైన దినము శుక్రవారము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. శుక్రవారము యొక్క ప్రత్యేకతలలో ఇవి కొన్ని: శుక్రవారము నాడు అల్లాహ్ ఆదం అలైహిస్సలాం ను సృష్ఠించినాడు; శుక్రవారం నాడే ఆయనను స్వర్గములో ప్రవేశింపజేసి నాడు; శుక్రవారము నాడే ఆయనను స్వర్గము నుండి బయటకు తీసి భూమి పైకి పంపినాడు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దీనిని విశదీకరిస్తున్నారు. ఏ విషయంలోనైనా ఒక ముస్లిం తన తోటి ముస్లింను కప్పి ఉంచితే, తీర్పుదినమున అల్లాహ్ అతడిని కప్పి ఉంచుతాడు - ఎలాగైతే ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం ఉంటుందో. అల్లాహ్ అతడిని కప్పి ఉంచుట అంటే అతడి తప్పులను, పాపాలను తీర్పుదినమున అక్కడ సమావేశపరచబడిన వారందరి ముందు వెల్లడించక పోవడం కావచ్చు; లేదా ఆ తప్పులకు, పాపాలకు అతడిని బాధ్యుడిని చేయకుండా, తీర్పుదినమున వాటిని అతనికి తెలియ పరచకుండా ఉండిపోవుట కావచ్చు.
అబూ ముస్లిం అల్ ఖౌలానీ ఉల్లేఖనం : “అతి ప్రియమైన మరియు విశ్వసనీయుడైన ఒక వ్యక్తి ఉన్నాడు – అతడు నాకు ప్రియమైన వాడు మరియు నేను అతడిని విశ్వసనీయునిగా భావిస్తాను – (అతడే) ఔఫ్ ఇబ్న్ మాలిక్ అల్ అష్’జఇ రజియల్లాహు అన్హు; ఆయన ఈ విధంగా పలికినారు: ఒకసారి మేము మొత్తం తొమ్మిది మంది లేక ఎనిమిది లేక ఏడుగురము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. నిజానికి మేము ఇటీవలనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ప్రమాణము చేసి ఉన్నాను. కనుక మేము - “ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. మేము మరలా - “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. దానికి ఆయన మళ్ళీ “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. అపుడు ఔఫ్ ఇబ్న్ మాలిక్ ఇలా అన్నారు: “మేము మా చేతులను ముందుకు చాచి, ఇలా అన్నాము “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ; మరి ఇపుడు ఏ విషయమై ప్రమాణం చేయాలి?” దానికి ఆయన “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించమని; ఐదు (ఫర్జ్) నమాజులను విధిగా ఆచరిస్తామని; (పాలకునికి) విధేయులుగా ఉంటామని;” తరువాత లోగొంతుతో “దేని కొరకూ ప్రజలను అర్థించము అని” అన్నారు. వాస్తవములో నేను ఇది చూసాను - (సహాబాలలో) కొంతమంది తమ చేతి నుండి కొరడా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత మంది సహచరులతో ఉన్నారు, అపుడు ఆయన తన చేతిపై విధేయతా ప్రతిజ్ఞ చేయమని మరియు కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేయమని వారిని మూడుసార్లు అడిగారు: మొదటిది: అల్లాహ్ ఆదేశించిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించము అని; రెండవది: పగలు మరియు రాత్రి కాలములో అల్లాహ్ విధిగావించిన ఐదు నమాజులను విధిగా ఆచరిస్తామని; మూడవది: ముస్లిములకు మంచి జరిగే విషయాలలో మరియు వారి అభ్యున్నతికి చెందిన విషయాలలో పాలకుని మాట వింటామని మరియు అతనికి విధేయులై ఉంటామని, నాలుగవది: తమ ప్రతి అవసరానికీ కేవలం అల్లాహ్ ను మాత్రమే అర్థిస్తామని, ప్రజలను దేని కొరకూ అర్థించము అని. ఈ మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోగొంతుకలో పలికినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహబాలు, వారు చేసిన విధేయతా ప్రమాణమును తు.చ. తప్పకుండా ఆచరించినారు. చివరికి ఈ హదీసు ఉల్లేఖకుడు ఈ విధంగా పలికినారు: కొంతమంది తమ చేతి నుండి కొరడా, చెర్నకోలా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు. వారు స్వయంగా తమ వాహనం పై నుండి (ఒంటె, గుర్రము, గాడిద మొ.) దిగి తీసుకునేవారు.”
బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు. ఇది ఖుర్’ఆన్ లో అల్లాహ్ వాక్కు యొక్క వివరణ: “యుథబ్బితు ల్లాహుల్లదీన ఆమనూ బిల్’ఖౌలి థ్థాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ దృఢంగా ఉంచుతాడు.”]
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుచనిపోయిన తరువాత విశ్వాసి సమాధిలో ప్రశ్నించబడతాడు; అతడిని ఇద్దరు దైవదూతలు ప్రశ్నిస్తారు. చాలా హదీసులలో పేర్కొనబడిన విధంగా వారి పేర్లు ‘మున్కర్’ మరియు ‘నకీర్’. అపుడు విశ్వాసి “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలల్లహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇది అల్లాహ్ (ఖుర్’ఆన్ లో) చేసిన దృఢమైన ప్రకటన: “యుసబ్బితు ల్లాహుల్లజీన ఆమనూ బిల్’ఖౌలిస్సాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలో మరియు పరలోకంలో దృఢంగా ఉంచుతాడు.”]
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాతు చెల్లించే వరకు ప్రజలతో పోరాడమని నేను ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు అలా చేస్తే వారు తమ రక్తాన్ని (ప్రాణాన్ని) మరియు తమ సంపదలను నా నుంచి రక్షించుకున్నట్లే; ఇస్లామీయ చట్టాల ద్వారా (మరణ శిక్ష విధించబడితే) తప్ప.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: అవిశ్వాసులు మరియు విగ్రహారాధకులతో - వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయన అద్వితీయుడూ, ఏకైకుడు అని ఆయనకు సాటి ఎవరూ లేరు అని; మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యము పలికి, ఆ పలికిన సాక్ష్యానికి అనుగుణంగా దినము మరియు రాత్రిలో (విధిగావించబడిన) ఐదు నమాజులను ఆచరిస్తూ, అర్హులైన వారికి జకాతు చెల్లించనంత వరకు – వారితో పోరాడమని ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు వీటిని ఆచరించినట్లయితే, ఇస్లాం వారి రక్తాన్ని (వారి ప్రాణాలను), వారి సంపదలను రక్షిస్తుంది. కనుక, ఇస్లాం ఆదేశాల ప్రకారం మరణ శిక్ష విధించబడే నేరం ఏదైనా చేస్తే తప్ప వారి ప్రాణాలను తీయడం నిషేధము. తరువాత తీర్పు దినమునాడు అల్లాహ్ వారి లెక్కా పత్రము తీసుకుంటాడు; ఎందుకంటే వారి అంతరంగములో ఏమి ఉన్నదో ఆయనకు తెలుసు గనుక.
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, అల్లాహ్ నా సమాజము (ఉమ్మతు) కోసం పొరపాటుగా చేసే పనులు, మతిమరుపుగా మరియు బలవంతంగా చేయబడిన పనులను క్షమించాడు."
ఇబ్న్ మాజహ్, బైహఖీ మరియు ఇతరులు నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నిశ్చయంగా, అల్లాహ్ తన సమాజాన్ని (ఉమ్మతును) మూడు విషయాలలో క్షమించాడు:" మొదటిది: పొరపాటు (అల్-ఖత'). ఇది వారి నుండి ఉద్దేశపూర్వకంగా కాకుండా సంభవించేది. అంటే, ఒక ముస్లిం ఒక పనిని ఉద్దేశించి చేసినప్పుడు, అతని పని అతను ఉద్దేశించిన దానికి భిన్నంగా సంభవించడం. "రెండవది: మతిమరుపు (అన్-నిస్యాన్). అంటే ఒక ముస్లిం ఒక విషయాన్ని గుర్తుంచుకున్నప్పటికీ, పని చేసేటప్పుడు దానిని మర్చిపోవడం. దీనిలో కూడా పాపం లేదు." "మూడవది: బలవంతం (అల్-ఇక్రాహ్). ఒక వ్యక్తి తన ఇష్టం లేకుండా, బలవంతంగా ఒక పనిని చేయవలసి వచ్చినప్పుడు, ఆ బలవంతాన్ని తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దానిపై అతనికి పాపం లేదా ఇబ్బంది ఉండదు." ఒక విషయం గమనించాలి, ఈ హదీథు ఒక దాసుడు మరియు అతని ప్రభువుకు మధ్య నిషేధించబడిన పనిని చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అయితే, తోటివారి విషయంలో మతిమరుపు వల్ల చేయవలసిన పనిని విడిచిపెడితే, అది క్షమించబడదు. అలాగే, పొరపాటుగా ఏదైనా నేరం జరిగితే, అది ప్రాణి యొక్క హక్కును తీసివేయదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పొరపాటున ఎవరినైనా చంపితే, అతను 'దియ్యత్' (రక్తధనం) చెల్లించాలి, లేదా పొరపాటున ఒక కారును ధ్వంసం చేస్తే, అతను నష్టపరిహారాన్ని భరించాలి.