





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని: “ఆ ఘడియ కొరకు నీవు ఏ ఏ సత్కార్యాలు ఆచరించి సిద్ధపరుచుకున్నావు?” అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వ్యక్తి : "నేను అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తున్నాను; అది తప్ప ప్రళయ ఘడియ కోసం నేను ఏ గొప్ప ఆచరణలను సిద్ధం చేసుకోలేదు" అన్నాడు; మరియు దీనిని గమనించినట్లయితే అతడు హృదయపు ఆరాధనలను, శరీరక ఆరాధనలను లేదా ఆర్థిక పరమైన ఆరాధనలను, లేక ఇతర ఏ ఆరాధనలను ప్రస్తావించలేదు; ఎందుకంటే అవన్నీ ప్రేమ యొక్క శాఖలు మరియు అవన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. నిజమైన ప్రేమ ఆ వ్యక్తిని ధర్మబద్ధమైన పనులలో కష్టపడటానికి ప్రేరేపిస్తుంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, స్వర్గములో నీవు వారితో ఉంటావు.” ఈ శుభవార్త పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు అమితంగా సంతోషపడినారు. అనస్ రదియల్లాహు అన్హు – తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా లను ప్రేమిస్తున్నానని; దాని కారణంగా, వారి అంత గొప్పగొప్ప ఆచరణలు ఆచరించలేకపోయినా, స్వర్గములో వారితో పాటు ఉంటాననే ఆశాభావమును వ్యక్తపరిచినారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు. అయితే అతడు దేనినైతే స్వర్గం అని అంటాడో (వాస్తవానికి) అది నరకం. కనుక నూహ్ అలైహిస్సలాం తన జాతి జనులను ఏ విధంగానైతే హెచ్చరించినాడో నేనూ ఆ విధంగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహబాలకు దజ్జాల్’ను గురించి, అతని లక్షణాలను గురించి, అతనికి సంబంధించిన చిహ్నాలను గురించి – తన కంటే ముందు వచ్చిన ఏ ప్రవక్తా కూడా తన జాతి జనులకు చెప్పని విషయాలను వివరిస్తున్నారు. ఉదాహరణకు: అతడు ఒంటి కన్ను వాడు. మరియు కంటికి స్వర్గము మరియు నరకముల వలే కనిపించే, స్వర్గము మరియు నరకములను పోలిన వాటిని తయారు చేసి, సర్వోన్నతుడైన అల్లాహ్ దజ్జాల్ తో పంపిస్తాడు. కానీ అతడి స్వర్గము, వాస్తవానికి నరకం, అలాగే అతడి నరకం వాస్తవానికి స్వర్గం అయి ఉంటాయి. ఎవరైతే అతడిని (విశ్వసించి) అనుసరిస్తారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది భగభగ మండే అగ్ని అయి ఉంటుంది; అలాగే ఎవరైతే అతడిని (విశ్వసించరో) అనుసరించడానికి నిరాకరిస్తారో, అతనికి అవిధేయత చూపుతారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని నరకములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది మంచి స్వర్గం అయి ఉంటుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు సృష్టించే అరాచకత్వాన్ని గురించి, అతడి పరీక్షల గురించి, నూహ్ అలైహిస్సలాం తన ప్రజలను హెచ్చరించిన విధంగా హెచ్చరించినారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక వ్యక్తి తన ప్రవర్తన మరియు అలవాట్లలో తన సన్నిహిత స్నేహితుడిని మరియు సన్నిహిత సహచరుడిని పోలి ఉంటాడు. స్నేహం, నైతికతను, ప్రవర్తనను మరియు చర్యలను ప్రభావితం చేస్తుంది. అందుకని మంచి స్నేహితుడిని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు; ఎందుకంటే మంచి మిత్రుడు తన స్నేహితుడిని విశ్వాసం వైపునకు, సన్మార్గం వైపునకు మంచి మరియు శుభం వైపునకు నడిపిస్తాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసిని మంచి పనులను చేయడం వేగవంతం చేయమని మరియు మంచి పనులు చేయడం అసాధ్యమయ్యే పరిస్థితులు రాకముందే వాటిని వీలైనంత ఎక్కువగా చేయమని ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అతనిలో సందేహాలను రేకెత్తిస్తాయి, వాటి నుండి అతడి ధ్యానాన్ని మళ్ళిస్తాయి. అతని స్థితి ఎలా ఉంటుందంటే దట్టమైన చీకటి లాగా ఉంటుంది. అటువంటి స్థితిలో సత్యమూ, అసత్యమూ కలగాపులగం అయిపోయి, ప్రజలకు వాటి మధ్య భేదాన్ని కనుగొనుట కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల తీవ్రత కారణంగా వ్యక్తి పూర్తిగా అయోమయ పరిస్థితిలో పడిపోయి ఈ లోకంలోని తాత్కాలిక ఆనందాల కోసం తన ధర్మాన్ని వదిలి వేసి, ఉదయం విశ్వాసిగా ఉన్న అతడు, సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు, మరియు సాయంత్రం విశ్వాసిగా ఉన్న అతడు ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు.
జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులైన స్థితిలో నా వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు”. జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “అపుడు నేను “ఓ రసూలుల్లాహ్! మనలో దైవభక్తి గల వ్యక్తులు ఉండగా కూడా మనం నశించిపోతామా?" అన్నాను. ఆయన ఇలా అన్నారు: "అవును, దుష్టత్వం ప్రబలినప్పుడు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అంటూ భీతిల్లిన స్థితిలో, భయకంపితులై, జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా వద్దకు వచ్చారు. భయకంపితులై ఉన్న స్థితిలో “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అనడం ‘ఏదో చెడు జరుగబోతుంది’, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను ఆశ్రయించడం, మరియు ఆయనను మొరపెట్టుకోవడం తప్ప దాని నుండి తప్పించుకునే అవకాశం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వచ్చి పడబోయే అరిష్టమునుండి ఈ అరబ్బులకు వినాశం గాను, ఈ రోజు య’జూజ్ మరియు మ’జూజ్ ల అడ్డుగోడలో ఇంత రంధ్రం చేయబడింది, అది దుల్’ఖర్నైన్ నిర్మించిన అడ్డుగోడ..” అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి బొటనవ్రేలును, దానికి ప్రక్కనే ఉన్న చూపుడు వ్రేలును కలిపి గుండ్రంగా, వృత్తాకారంగా చేసి చూపించారు. జైనబ్ రదియల్లాహు అన్హా “మన మధ్య సజ్జనులు, ధర్మపరాయణులు ఉండగా అల్లాహ్ వినాశనం వచ్చి పడేలా ఎలా చేస్తాడు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆమెతో ఇలా అన్నారు: "అశ్లీలత, దుర్మార్గం, పాపాలు, వ్యభిచారం, మద్యపానం మరియు ఇతర విషయాల రూపంలో చెడు పెరుగుతుంటే, వినాశనంపై వచ్చి పడుతుంది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపరుస్తున్నారు : కష్టాలు వచ్చి మీద పడడం, వాటి ద్వారా అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను, పురుషులను పరీక్షించడం – ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి విడదీయలేని విషయాలు. వాటి ద్వారా అల్లాహ్ స్వయంగా వారిని పరీక్షిస్తాడు – ఉదాహరణకు: స్త్రీలను, పురుషులను వారి ఆరోగ్యం విషయంలో, వారి శరీరం విషయంలో రుగ్మతలకు గురి చేసి; అలాగే సంతానం విషయంలో పరీక్షిస్తాడు, ఉదాహరణకు: సంతానాన్ని వ్యాధిగ్రస్తులను చేసి, వారిని మరణింపజేసి, లేదా వారిని తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా చేసి, లేదా ఇంకా వేరే విధానాలలో; అలాగే వారి సంపదల విషయంలోనూ పరీక్షిస్తాడు, ఉదాహరణకు: పేదరికానికి గురి చేసి, లేదా వ్యాపారంలో నష్టాలకు గురి చేసి, లేదా పేద జీవన పరిస్థితులలో మరియు జీవనోపాధిలో ఇబ్బందులకు గురి చేసి పరీక్షిస్తాడు; ఇలా అల్లాహ్ ఆ పరీక్షల ద్వారా వారి పాపాలు మరియు అతిక్రమణలు అన్నింటినీ పరిహరించే వరకు చేస్తాడు; ఆ విధంగా అతను అల్లాహ్ను కలిసినప్పుడు, అతను చేసిన పాపాలన్నింటి నుండీ మరియు అతిక్రమణలన్నింటి నుండీ శుద్ధి చేయబడిన స్థితిలో వారు అల్లాహ్ ను కలుసుకుంటారు.
హుదైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”
అబూ దావూద్, అన్నసాయీ అల్ కుబ్రాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఒక ముస్లిం తన సంభాషణలో ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనరాదని నిషేధించినారు. లేక ‘అల్లాహ్ మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అనడం (కూడా నిషేధమే). ఎందుకంటే అల్లాహ్ యొక్క చిత్తము మరియు ఆయన సంకల్పము – ఇవి రెండూ శుద్ధమైనవి మరియు పరిపూర్ణత కలిగినవి. వాటిలో ఆయనతో ఎవరూ భాగస్వాములు కాలేరు. ఆ రకమైన వాక్యములో, వ్యాకరణ నియమాల ప్రకారం “వావ్ 'و' ” అనే అరబీ అక్షరం ‘సముచ్చయము’ గా పని చేస్తుంది. దానితో ‘అల్లాహ్ తో పాటు మరొకరు కూడా ఆయన సమానులు’ అనే అర్థం వస్తుంది. అలా కాక ‘అల్లాహ్ కోరిన విధంగా ఆ తరువాత ఫలాన వారు కోరిన విధంగా’ అనవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘మరియు’ అనే పదానికి బదులు ‘ఆ తరువాత’ అనే పదంతో దాసుని ఇష్టాన్ని అల్లాహ్ యొక్క ఇష్టానికి క్రింద, దానికి అనుయాయిగా చేస్తున్నారు. ఎందుకంటే వాక్యములో “ఆ తరువాత” అనే పదం వాక్యములో ఉన్న పదాలను తేలికగా వ్యాఖ్యానించడానికి దోహదపడుతుంది.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు) – ఎంతగా అంటే, ఒకవేళ వారు ఏదైనా ఉడుము రంధ్రములోనికి దూరితే, అందులోనూ మీరు వారిని అనుసరిస్తారు”; మేము “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! (మాకంటే పూర్వం గతించిన వారంటే ఎవరు?) యూదులూ మరియు క్రైస్తవులా?” అని ప్రశ్నించాము. దానికి ఆయన “మరి వారు కాక ఇంకెవరు?” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానంతరం తన జాతిలోని (ఉమ్మత్ లోని) కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నారు. వీరు యూదులు మరియు క్రైస్తవుల విశ్వాసాలు, ఆచారాలు, ఆచరణలు, మరియు సంప్రదాయాలలో వారి మార్గాన్ని, అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు; ఎంతగా అంటే వారు (యూదులు, క్రైస్తవులు) ఒకవేళ ఏదైనా ఉడుం రంధ్రములోనికి దూరితే, వీరు కూడా వాళ్ళ వెనుక అందులోనికి దూరతారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి - దానిని అనుసరించిన వారి పాపములను పోలినంత పాపము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పాపములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్ట పరిచినారు – ఎవరైతే ప్రజలకు సత్యమార్గము వైపునకు మరియు శుభము గల మార్గము వైపునకు, తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పుణ్యాన్ని పోలినంత పుణ్యము అతనికి కూడా లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పుణ్యములో కొద్దిగా కూడా తగ్గించబడదు. ఎవరైతే ప్రజలకు అసత్య మార్గము వైపునకు మరియు మార్గభ్రష్టత్వము వైపునకు, చెడు మరియు పాపము కలిగిన మార్గము వైపునకు లేదా షరియత్ అనుమతి లేని దాని వైపునకు (హరామ్ వైపునకు) తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, ప్రజలకు మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ భారము అతనిపై ఉంటుంది అలాగే ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పాపాన్ని పోలినంత పాపము అతనికి లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పాపములలో కొద్దిగా కూడా తగ్గించబడదు.