





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ మర్తద్ అల్ ఘనవియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులపై కూర్చోవడాన్ని నిషేధించినారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధుల ఎదురుగా నమాజు చేయడాన్ని, ఖిబ్లా వైపునకు సమాధి ఉండేలా నమాజు ఆచరించడాన్ని నిషేధించినారు. ఎందుకంటే అది ‘షిర్క్’ (బహుదైవారాధనకు) దారితీసే కారణాలలో ఒకటి కనుక.
ఉమ్ముల్ ము'మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా – తాను అబిసీనియాలో ఉన్నపుడు మారియా అని పిలువబడే ఒక చర్చిని చూసిన విషయాన్ని, అందులో విగ్రహాలు, చిత్రపటాలు, వివిధ రకాల అలంకరణలు చూసిన విషయాన్ని, వాటిని చూసి తాను అబ్బురపడిన విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాలు, చిత్రపటాలు అక్కడ చర్చిలో పెట్టి ఉండడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారిలో ఒక నీతిమంతుడు మరణిస్తే, వారు అతని సమాధిపై ఒక ఆరాధనాలయాన్ని (మస్జిదును) నిర్మించి, అందులో ప్రార్థనలు చేస్తారు. వారు అతని విగ్రహాన్ని, చిత్రపటాన్ని అందులో ఉంచుతారు. తరువాత ఆయన ఇలా విశదపరిచినారు: అలా చేసేవాడు అల్లాహ్ దృష్టిలో సృష్టిలోకెల్లా అత్యంత నీచుడు. ఎందుకంటే అతని ఆ ఆచరణ సర్వోన్నతుడైన అల్లాహ్ తో షిర్క్ చేయడానికి దారి తీస్తుంది (అంటే అల్లాహ్ కు సాటిగా, సమానులుగా వేరే వారిని నిలబెట్టుట).
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుదైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం యొక్క మిగతా విషయాలు ఆ నిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఈ మూలస్తంభాలలో మొదటిది: “షహాదతైన్” (రెండు సాక్ష్యాపు వాక్యాలు ఉచ్చరించుట). “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు” అని సాక్ష్యము పలుకుట, మరియు “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క సందేశహరుడు” అని సాక్ష్యం పలుకుట. ఈ రెండూ కలిసి ఒకే మూలస్తంభము; ఇవి ఒకదాని నుండి మరొకటి విడదీయరానివి. దాసుడు ఈ సాక్ష్యపు వాక్యాలు ఉచ్చరిస్తాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, మరియు కేవలం ఆయన మాత్రమే ఆరాధనలకు నిజమైన అర్హుడని, ఆయన తప్ప మరింకెవ్వరూ అర్హులు కారని గుర్తిస్తున్నాడు మరియు అంగీకరిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా అతడు, తాను ఉచ్చరించిన సాక్ష్యాపు వాక్యాలకు అనుగుణంగా ఆచరిస్తాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశాన్ని విశ్వసిస్తాడు మరియు ఆయనను అనుసరిస్తాడు. మూలస్తంభాలలో రెండవది: సలాహ్’ను స్థాపించుట. అంటే దినము మరియు రాత్రిలో విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను, వాటి నిర్ధారిత వేళల్లో, వాటికి సంబంధించిన నియమాలు, విధులు మరియు విధానాలను అనుసరిస్తూ ఆచరించుట; ఈ ఐదు: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు. మూడవ మూలస్థంభము: జకాతును విధిగా చెల్లించుట. ఇది ఒక ఆర్థికపరమైన ఆరాధన. షరియత్ లో నిర్ధారించబడిన ఒక స్థాయికి చేరిన సంపదపై జకాతు చెల్లించుట విధి. మరియు అట్టి జకాతు దానికి తగిన అర్హులకు ఇవ్వబడుతుంది. నాలుగ మూలస్థంభము: “హజ్జ్”. అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా మక్కా నగరంలోని కాబా గృహాన్ని దర్శించి అక్కడ దానికి సంబంధించిన విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు. ఐదవ మూల స్థంభము: రమదాన్ నెల ఉపవాసములు పాటించుట: ఉపవాసము అంటే – అల్లాహ్’ను ఆరాధించే సంకల్పముతో, ఉషోదయం నుండి మొదలుకుని సూర్యాస్తమయం వరకు తినుట, త్రాగుట మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయాన్నుండి దూరంగా ఉండుట.
అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నిషేధించిన ప్రతి చెడును, ప్రతి ఒక్కరూ తన సమర్థతను బట్టి ఆపాలి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అతడు ఏదైనా చెడును చూసినట్లయితే, అతడు దానిని చేతితో ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంటే (అంటే దానిని చేతితో అడ్డుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే) అతడు తప్పనిసరిగా అలా చేయాలి. ఒకవేళ అతడు చేతితో ఆ చెడును ఆపలేకపోతే, అతడు ఆ పనిని తన నాలుకతో ఆపాలి. (నాలుకతో ఆపడం అంటే) ఆ చెడును చేస్తున్న వానికి అతడు చేస్తున్నది చెడు అని, తద్వారా అతడు కలుగజేస్తున్న కీడును గురించి అతడికి వివరించాలి, అతడికి మంచి వైపునకు మార్గ దర్శనం చేయాలి. ఒకవేళ అతనిలో అంత సమర్థత కూడా లేనట్లయితే, అపుడు కనీసం అతడు తన మనసులోనైనా ఆ జరుగుతున్న చెడును అసహ్యించుకుని, దానిని అడ్డుకోగలిగే సమర్థత గనక తనకు ఉండి ఉంటే దానిని తప్పనిసరిగా అడ్డుకుంటాను అని సంకల్పం చేసుకోవాలి. చెడును అడ్డుకుని, దానిని మార్చగలిగే సామర్థ్యపు స్థాయిలలో, మనసు యొక్క స్థాయి అత్యంత బలహీనమైన స్థాయి.
ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ఇలా అడిగాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము అజ్ఞాన కాలములో (ఇస్లాం స్వీకరించుటకు పూర్వపు జీవితంలో) చేసిన పనులకు (తీర్పు దినము నాడు) జవాబుదారులుగా పట్టుకోబడతామా? ” దానికి ఆయన “ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంలో ప్రవేశించుట యొక్క ఘనతను గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇస్లాం స్వీకరించి, ఒక మంచి ముస్లింగా మారుతాడో, మరియు తన ధర్మాన్ని నిష్కల్మశంగా, చిత్తశుధ్ధితో నిజాయితీగా అనుసరిస్తాడో, అతడు జాహిలియ్యహ్ కాలములో చేసిన పాపపు పనులకు జవాబుదారుడుగా నిలబెట్టబడడు. మరియు ఎవరైతే ఇస్లాంకు నష్టం కలిగించడానికి కపటుడిగా ఇస్లాంలో ప్రవేశిస్తాడో లేదా ఇస్లాంలో ప్రవేశించిన తరువాత ధర్మభ్రష్టునిగా మారుతాడో (ఇస్లాం ధర్మానికి వ్యతిరేకిగా మారుతాడో) అటువంటి వాడు అవిశ్వాసిగా చేసిన పనులకు మరియు ఇస్లాంలో ప్రవేశించి చేసిన చెడు పనులకు గాను విచారించబడతాడు మరియు శిక్షించబడతాడు.
అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే), వీటిల్లో ఏ ఒక్క దానిలోనూ ఏమీ ఎక్కువ చేయకపోయినా (ఎక్కువ ఏమీ ఆచరించకపోయినా) నేను స్వర్గం లోనికి ప్రవేశించగలనా?” దానికి ఆయన “అవును, ప్రవేశించగలవు” అన్నారు. దానికి అతడు “అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే ఏ ఒక్క విషయమూ ఎక్కువ చేయను (ఎక్కువ ఆచరించను)” అన్నాడు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైనా కేవలం విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను మాత్రమే ఆచరిస్తాడో, వేరే స్వచ్ఛంద నమాజులు ఎక్కువగా ఆచరించడో, అలాగే విధిగా ఆచరించవలసిన రమదాన్ నెల ఉపవాసములను మాత్రమే ఆచరిస్తూ, ఇతర స్వచ్ఛంద ఉపవాసములను ఆచరించడో, హలాల్ విషయాలను హలాల్ విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటిని ఆచరిస్తూ, హరాం విషయాలను హరాం విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటికి దూరంగా ఉంటాడో, అతడు స్వర్గము లోని ప్రవేశిస్తాడు.
అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు తెలియజేస్తున్నారు: భౌతిక పరిశుద్ధత వుదూ మరియు గుసుల్ ఆచరించుట ద్వారా లభించును. నమాజు కొరకు వుదూ చేసి ఉండుట ఒక షరతు. ‘అల్-హందులిల్లాహ్’ అని పలుకుట అంటే ‘సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కే చెందుతాయి’ అని పలుకుట మరియు అల్లాహ్ ను అత్యంత పరిపూర్ణమైన గుణగణాలతో, లక్షణాలతో కీర్తించుట – తీర్పు దినము నాడు సత్కర్మల త్రాసులో తూచబడుతుంది మరియు అది సత్కర్మల త్రాసును నింపివేస్తుంది. మరియు ‘సుబ్’హానల్లాహి వల్’హందులిల్లాహి’ (అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు ఆయనకే చెందుతాయి) అని ఈ రెండు పదాలను కలిపి ఉచ్ఛరించుట భూమ్యాకాశాల మధ్యన ఉన్న అంతటినీ నింపివేస్తుంది. అలాగే ‘నమాజు కాంతి’, అంటే అది అతని హృదయములో కాంతి, అతని ముఖములో కాంతి, అతని సమాధిలో కాంతి అలాగే తీర్పు దినమున అది అతని కొరకు కాంతి అని అర్థము. ఇంకా ‘దానము చేయుట ఒక సాక్ష్యము’ అంటే దానము చేయుట అనే గుణము ఇస్లాంలో అతని విశ్వాసములో అతనియొక్క నిజాయితీ, నిష్కపటత్వము లకు నిదర్శనం. ఈ గుణము కపట విశ్వాసిలో కనపడదు. ఎందుకంటే దానగుణమును అలవర్చుకునే వారికి ఇస్లాం చేసే వాగ్దానములలో కపట విశ్వాసికి నమ్మకం ఉండదు. మరియు ‘సహనము వెలుగు’ – అంటే దైనందిన జీవితములో ఎదురయ్యే చింత, వేదన, వ్యాకులత, కోపము, విద్వేషము, శత్రుత్వము మొదలైన వాటి నుండి తనను తాను ఆపుకొనుట, సహనము వహించుట. వెలుగు అనేది , సూర్యకాంతి వలే తనతో పాటు మంటను వేడినీ తీసుకుని వస్తుంది. సహనం వహించుట అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే అందులో స్వయంతో పోరాటం, స్వీయ ఆత్మతో పోరాటం ఉంటాయి. ఆత్మ ఉత్తేజ పరిచే కోరికల నుండి తనను తాను బందీ చేసుకోవలసి ఉంటుంది. అందుకనే సహనం వహించే వ్యక్తి ఎప్పుడూ వెలుగును కలిగి ఉంటాడు, మార్గదర్శనం కలిగి ఉంటాడు, మరియు ఎల్లప్పుడూ సత్యము పై ఉంటాడు. అలాగే అతడు అల్లాహ్ యొక్క విధేయతకు సంబంధించిన విషయాలలో సహనం కలిగి ఉంటాడు. అల్లాహ్ యొక్క అవిధేయతకు దారి తీసే విషయాల పట్ల సహనం కలిగి ఉంటాడు. విధిలిఖితం, పూర్వనిర్దిష్టం వలన కలిగే కష్టాలు, బాధల పట్ల సహనం కలిగి ఉంటాడు. మరియు ఖుర్’ఆన్ నీ పక్షమున ఒక సాక్షి, దానిని అనుదినము పఠిస్తూ దానిపై ఆచరిస్తూ ఉన్నట్లయితే; అలాగే ఖుర్’ఆన్ నీకు వ్యతిరేకంగా ఒక సాక్షి, ఒకవేళ దాని పారాయణం చేయకుండా మరియు దానిపై ఆచరించకుండా వదిలి వేసినట్లయితే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు ప్రతిరోజూ ఉదయమే తమ నిద్రల నుండి లేస్తారు, ఉరుకులు పరుగులతో తమతమ ఇళ్ళను వదిలి తమతమ పనల కొరకు బయలుదేరుతారు అని తెలియజెసారు. వారిలో కొంతమంది అల్లాహ్ యొక్క విధేయతలో నిజాయితీ కలిగి ఉంటారు, ఆయన విధేయతలో పటిష్ఠంగా నిలబదతారు. వారు తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకుంటారు. మరి కొందరు సత్యమార్గము నుండి వైదొలగి అల్లాహ్ యొక్క అవిధేయతలో పడిపోతారు, తమను తాము నాశనం చేసుకుని నరకాగ్నిలో పడిపోతారు.
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు “ఓ ము’ఆద్! నీకు తెలుసా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో, అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు.” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఈ శుభ వార్తను ప్రజలకు వినిపించవచ్చా?” అని అడిగాను. ఆయన “వారికీ శుభవార్తను వినిపించకు. అలా చేస్తే, వారు కేవలం దీని పైనే ఆధారపడి పోతారు” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఎవరినీ, దేనీనీ ఆయనకు సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే ఎవరైతే ‘అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని విశ్వసిస్తారో మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించరో, అటువంటి వారిని అల్లాహ్ శిక్షించడు. అపుడు ము’ఆద్ రజియల్లాహు అన్హు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శుభవార్తను ప్రజలకు వినిపించవద్దా. వారు (అల్లాహ్ యొక్క) ఈ అనుగ్రహం పట్ల ఆనంద పడతారు, సంతోషపడతారు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు కేవలం దీనిపైనే ఎక్కడ ఆధార పడతారోనని భయపడి, ఆయనను వారించారు.
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు".
ముస్లిం నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి రెండు లక్షణాలను గురించి అడుగుతాడు – ఒకవేళ అవి గానీ ప్రజలలో ఉంటే, అవి వారిని అనివార్యంగా స్వర్గములోనికి లేదా నరకము లోనికి ప్రవేశింపజేస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: అనివార్యంగా ఒక వ్యక్తిని స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఏకైకుడైన అల్లాహ్ కు ఎవరినీ లేక దేనిని సాటి కల్పించకుండా, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించే లక్షణం. ఆ లక్షణం కలిగిన వ్యక్తి అదే స్థితిలో మరణించినట్లయితే, అతడు స్వర్గములోనికి అనివార్యంగా ప్రవేశించబడతాడు. అలాగే అనివార్యంగా ఒక వ్యక్తిని నరకములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఒక వ్యక్తి అల్లాహ్ తో పాటు మరొకరిని కూడా ఆరాధిస్తూ, ఆయన ఏకత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన దైవత్వములో, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలలో, లక్షణాలలో ఇతరులను భాగస్వాములుగా చేసే లక్షణం. ఎవరైతే అలా చేస్తూ (షిర్క్ చేస్తున్న స్థితిలో) చనిపోతాడో, అతడు అనివార్యంగా నరకం లోనికి ప్రవేశపెట్టబడతాడు.