





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత పొందు విషయానికి సంబంధించి కొన్ని నియమాలను వివరించారు. మొదటిది: ఎవరైనా వుజూ చేసినపుడు అతడు తన శ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని తీసుకోవాలి, మరియు శ్వాస ద్వారా ఆ నీటిని చీదివేయాలి. రెండవది: శరీరమునుండి హానికరమైన పదార్థాలు బయటకు వచ్చినపుడు, నీళ్ళు గాక మరింక దేనితోనైనా, అంటే ఉదాహరణకు – చిన్నచిన్న రాళ్లు మొదలైన వాటితో – శుభ్రపరుచుకోవాలనుకుంటే వాటిని బేసి సంఖ్యలో ఉపయోగించాలి. కనిష్టంగా మూడింటిని ఉపయోగించాలి, గరిష్టంగా ఆ హానికర్మైన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు, ఆ ప్రదేశము పూర్తిగా శుభ్రపడేంత వరకు అవసరమైనన్ని ఉపయోగించవచ్చు. మూడవది: ఎవరైతే రాత్రి నిద్ర నుండి మేల్కొంటారో, వారు ముందు రెండు చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు వుదూ చేయడానికి నీటి పాత్రలో చేయి పెట్టరాదు. ఎందుకంటే, అతడు ఎరుగడు రాత్రి అతని చేయి ఎక్కడెక్కడ గడిపిందో. కనుక అతని చేతులు అశుద్ధత నుండి సురక్షితంగా లేవు అన్నమాట. అటువంటి స్థితిలో చేసిన వుదూను షైతాను పనికి రానిదిగా చేస్తాడు; అలాగే మానవ జీవితానికి హానికరమైన పదార్థాలు నీటిలో కలిసేలా చేసి, ఆ నీటిని కలుషితం చేస్తాడు.
అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీలు సంతతిలో అరాచకత్వం ప్రబలడానికి వారి స్త్రీ లాలసే మొదటి కారణం అయినది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: ఈ ప్రపంచం రుచిలో మధురమైనది, మరియు చూడడానికి సుందరమైనది. కనుక దాని వలన ఒక వ్యక్తి తేలికగా ప్రలోభానికి గురి అవుతాడు, అందులో మునిగిపోతాడు, మరియు దానినే తన కొరకు అత్యంత విలువైనదిగా మార్చుకుంటాడు. అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితములో మనకంటే ముందు వచ్చిన వారికి మనలను వారసులుగా చేసినాడు – ఏ విధంగా వ్యవహరిస్తామో చూడడానికి; ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తామా లేక అవిధేయులుగానా? తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించినారు: జాగ్రత్త ఈ ప్రపంచపు సరంజామాతోనూ, మరియు దాని సౌందర్యముతోనూ మోసపోకండి; అది (ప్రపంచం) మిమ్ములను అల్లాహ్ ఆదేశించిన వాటిని వదిలేసి, ఆయన నిషేధించిన వాటిలో పడిపోవడానికి దారి తీస్తుంది. ఈ ప్రపంచపు ఆకర్షణలలో అన్నింటికన్నా పెద్దది స్త్రీలపట్ల ఆకర్షణ. ఇస్రాయీలు సంతతి పడిపోయిన మొదటి ఆకర్షణ అది.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా : ‘స్వచ్ఛందంగా ఆచరించే నమాజులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తాను పది రకాతుల నమాజులను గుర్తుంచుకున్నానని, వాటిని సునన్ అర్’రవాతిబ్ అంటారని’ వివరిస్తున్నారు. అవి: జుహ్ర్ సలాహ్ (నమాజు)కు ముందు రెండు రకాతులు, జుహ్ర్ నమాజు తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, ఇషా నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు. ఆవిధంగా అవి మొత్తం పది రకాతులు. అలాగే జుమా దినము నాడు (శుక్రవారము నాడు) జుమా నమాజు తరువాత రెండు రకాతులు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించేవారు.
హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా మిస్వాక్’ని ఉపయోగించేవారు, వారు దానిని గురించి ఆదేశించినారు కూడా, కొన్ని సందర్భాలలో తనకొరకు మిస్వాక్ ను తయారుగా ఉంచేలా జాగ్రత్త కూడా తీసుకునేవారు. అటువంటి సందర్భాలలో రాత్రి నిద్రనుండి లేచినపుడు ఒకటి; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిస్వాక్ తో తన పళ్ళను శుభ్రంగా రుద్ది శుభ్రపరుచుకునేవారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు” లేక “వేరే (ఇంకేదైనా) లక్షణంతో” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక భర్త తన భార్యను ద్వేషించరాదని, ఆమెను అసహ్యించుకొన రాదని నిషేధిస్తున్నారు. అలా చేయడం ఆమెపై హింసకు, ఆమెను వదిలివేయడానికి మరియు ఆమె నుండి ముఖం తిప్పేసుకోవడానికి దారి తీస్తుంది. మనిషి సహజంగా అసంపూర్ణుడు, ఒకవేళ అతను ఆమెలో ఒక చెడు లక్షణాన్ని ఇష్టపడకపోతే, అతను ఆమెలో మరొక మంచి లక్షణాన్ని కనుగొంటాడు; తన ప్రవృత్తికి సరిపోయే ఆ మంచి లక్షణంతో అతడు సంతృప్తి చెందుతాడు. తనకు నచ్చని ఆ చెడు లక్షణం పట్ల అతడు సహనం వహిస్తాడు. ఆ సహనం ఆమెను ద్వేషించడం నుండి, ఆమెను అసహ్యించుకోవడం నుండి ఆపుతుంది; ఆమెను వదిలి వేసేందుకు లేదా ఆమె నుండి దూరమయ్యేందుకు దారి తీసే పరిస్థితి రాకుండా చేస్తుంది.
అబూ అయూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుమలవిసర్జన ద్వారా గానీ లేక మూత్రవిసర్జన ద్వారా గానీ ఎవరు కాల కృత్యాలు తీర్చుకోవాలి అనుకున్నా, ఖిబ్లహ్ వైపునకు – అంటే కాబా గృహం ఉన్న వైపునకు – ముఖం చేయరాదని, లేక ఖిబ్లహ్ తన వెనుక ఉండేలా దాని వైపునకు వీపు కూడా చేయరాదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. అలా కాక మదీనా వారికి లాగా ఖిబ్లహ్ ఉన్నట్లయితే వారు తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ తిరిగి కాలకృత్యాలు తీర్చుకోవాలి. (మదీనా వాసులకు ఖిబ్లహ్ దక్షిణం వైపునకు ఉంటుంది). అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసినారు – తాము అష్’షాం దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు కాబా గృహం వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. వాళ్ళు తమ దిశను మార్చుకుని వాటిపై కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారు. అయినప్పటికీ వారు అల్లాహ్’ను క్షమాభిక్ష కోరుకునేవారు.
అబూ ఖతాదహ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని తీరుతెన్నులను, విధివిధానాలను వివరిస్తున్నారు. మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడిచేతితో పట్టుకొనరాదు అని నిషేధించినారు, కాలకృత్యములు తీర్చుకున్న తరువాత యోనిని గానీ లేక గుదమును గానీ కుడి చేతితో శుభ్రపరుచు కొనరాదు అని నిషేధించినారు; ఎందుకంటే కుడి చేయి మంచి పనులు చేయుట కొరకు తయారు చేయబడినది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ వ్యక్తి అయినా తాను ఏ పాత్ర నుంచి అయితే నీళ్ళు త్రాగుచున్నాడో, ఆ పాత్రలోనికి నోటితో ఉదరాదు అని నిషేధించినారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తీవ్రమైన హెచ్చరికను గురించి ఈ విధంగా విశదీకరిస్తున్నారు: ఎవరైతే (నమాజులో) తన ఇమాము కంటే ముందు తల పైకి ఎత్తుతాడో అల్లాహ్ అతడి తలను గాడిద తలగా మారుస్తాడు, లేక అతడి రూపాన్ని గాడిదకు మాదిరిగా మారుస్తాడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు; రుకూ కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకునపుడు మరియు రుకూ నుండి తల పైకి ఎత్తునపుడు అదే విధంగా పైకి ఎత్తేవారు. అపుడు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హంద్” అని పలికారు. అయితే సజ్దహ్’లో అలా చేసేవారు కాదు (చేతులను పైకి ఎత్తేవారు కాదు).”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మూడు చోట్ల తన రెండు చేతులను, భుజాల వరకు లేదా భుజాలకు ముందు వాటికి సమాంతరంగా, పైకి ఎత్తేవారు. భుజము అంటే భుజపు టెముక మరియు దండ ఎముక రెండు కలిసే స్థలము. మొదటి చోటు: నమాజు ప్రారంభించుటకు ముందు “అల్లాహు అక్బర్” (తక్బీరతుల్ ఇహ్రాం) అని పలుకునపుడు. రెండవది: రుకూ కొరకు “అల్లాహు అక్బర్” అని పలుకునపుడు. మూడవది: రుకూ స్థితి నుండి తలపైకి ఎత్తుతూ “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్” అని పలికినపుడు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దహ్ చేయుటకు ముందు కానీ, లేక సజ్దహ్ స్థితి నుండి తల పైకి ఎత్తునపుడు కానీ తన చేతులను పైకి ఎత్తలేదు.