





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కు “తషహ్హుద్” పఠించడాన్ని నేర్పించినారు. అది నమాజులో పఠించబడుతుంది. ఇబ్న్ మస్’ఊద్ యొక్క ధ్యాస అంతా తన వైపు ఉండేలా, ఆయన చేతిని తన రెండు చేతుల మధ్య తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు కు తషహ్హుద్ పఠించడాన్ని నేర్పించినారు. తషహ్హుద్’ను బోధించడం పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శ్రధ్ధ – వారు తషహ్హుద్ లోని ప్రతి పదమూ మరియు దాని అర్థాన్ని అదే విధంగా ఉద్దేశ్యించినారని ఏ విధంగానైతే వారు బోధించినారో – అనే విషయం అర్థమవుతున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అత్తహియ్యాతు లిల్లాహి” “అన్ని రకాల శుభ వచనాలు, శుభాకాంక్షలు, మరియు శుభాభివందనాలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకే.” “అత్తహియ్యాతు” అంటే పూజ్య భావాన్ని, గౌరవాన్ని, ఆరాధనను సూచించే అన్ని రకాల వచనాలు, పదాలు మరియు ఆచరణలు అని అర్థం. అవన్నీ కూడా కేవలం సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కు మాత్రమే అర్హమైనవి. “అస్సలవాతు” అంటే ఒక ముస్లిం ప్రతి దినము ఆచరించే నమాజులు అని అర్థము “సలాహ్” లేక “నమాజు” పేరిట సుపరిచితమైన ఆచరణ ఇది. ఇందులో విధిగా ఆచరించవలసిన నమాజులు (ఫర్జ్ నమాజులు), మరియు స్వచ్ఛందంగా ఆచరించవలసిన నమాజులు (నఫీలు నమాజులు) ఉన్నాయి. “అత్తయ్యిబాతు” – అంటే మంచి విషయాలన్నీ. అంటే – అన్ని మంచి మాటలు, మంచి పనులు, పరిపూర్ణతను సూచించే అన్ని మంచి గుణగణాలు. ఇవన్నీ కూడా కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అర్హమైనవి. “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అంటే “ఓ ప్రవక్తా! నీపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, మరియు ఆయన కరుణ ఉండుగాక” అని అర్థము. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అల్లాహ్’ను ప్రార్థించుట, ఆయనకు దుఆ చేయుట – ప్రతి దుఃఖము నుండి మరియు ప్రతి ఆపద మరియు హాని నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్షేమం కొరకు, అదే విధంగా అన్ని రకాల శుభాలలో ఆయనకు వృద్ధి కలగాలని, ప్రతి శుభము ఆయనకు సమృద్ధిగా లభించాలని దుఆ చేయుట. “అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్” “మాపై మరియు నీతిమంతులైన అల్లాహ్ దాసులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక” ఇది భూమ్యాకాశాలలో ఉన్న ధర్మపరాయణుడూ, నీతిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రతి దాసుని కొరకు చేయు దుఆ. “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్” అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను.” ఆ సాక్ష్యపు వాక్యాన్ని పలకడం అంటే – అది ఒక రకమైన ఒప్పుకోలు, స్వీకృతి – అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను మరియు దానిని స్వీకరిస్తున్నాను” అని. “వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” “మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అలాగే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు అనే విషయాన్ని మరియు ఆయన తెచ్చిన సందేశము అంతిమ సందేశము అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను మరియు స్వీకరిస్తున్నాను. నమాజులో ఈ విధంగా తషహ్హుద్ పలికిన తరువాత – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "నమాజు ఆచరిస్తున్న వాడు అతనికి నచ్చిన, లేక అతనికి ఇష్టమైన ఏ దుఆనైనా చేసుకోవచ్చు" అన్నారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారునమాజులో చివరి (రకాతులో) తషహ్హుద్ పూర్తి అయిన తరువాత, సలాముతో నమాజు ముగించుటకు ముందు నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ దుఆ చేసేవారు; మరియు మనలను కూడా ఆ నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరమని ఆదేశించినారు. మొదటిది: సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్) రెండవది: నరకాగ్ని శిక్ష నుండి (మిన్ అజాబిన్నార్). అది పునరుత్థానన దినమున జరుగుతుంది. మూడవది: ఈ జీవితపు సంక్షోభాలు, పరీక్షలనుండి – అంటే నిషేధిత వాంఛల నుండి, నిషేధిత విషయాల ఆకర్షణల నుండి రక్షణ, అలాగే తప్పుదారి పట్టించే సందేహాలనుండి రక్షణ; మరియు మరణము యొక్క పరీక్షల నుండి – అంటే, మరణ ఘడియ ఆసన్నమైనపుడు కలిగే మరణ వేదన నుండి రక్షణ, అలాగే ఇస్లాం నుండి మరియు సున్నత్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళే విషయాలనుండి రక్షణ, మరియు సమాధిలో దైవదూతల ప్రశ్నల నుండి రక్షణ. నాలుగవది: ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవం నుండి రక్షణ. మసీహిద్దజ్జాల్ ఉపద్రవం ఈ ప్రపంచపు అంతిమ ఘడియలలో సంభవిస్తుంది. ఈ ఉపద్రవం ద్వారా అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవాన్ని మిగతా వాటితో కలిపి కాకుండా ప్రత్యేకంగా పెర్కొన్నారు – కారణం ఈ ఉపద్రవం తీసుకువచ్చే మార్గభ్రష్ఠత్వం, అరాచకం చాలా పెద్దద్ది కావడమే.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కొరకు తక్బీర్ పలికిన తరువాత, సూరతుల్ ఫాతిహా పఠించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉండి, ఆ మధ్యలో కొన్ని దుఆలు చదివి నమాజు ప్రారంభించేవారు. వాటిలో ఆయన ఈ విధంగా పలికిన దుఆ కూడా ఒకటి. ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిల్’మాఇ వస్సల్జీ వల్ బరద్’ ఈ దుఆలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్’ను వేడుకుంటున్నారు – తనను తన పాపాల నుండి, వాటిలో మళ్ళీ ఎపుడు పడకుండా దూరం చేయమని, మరింకెప్పుడూ వాటితో తన కలయిక సాధ్యం కానంత దూరంగా; ఏ విధంగానైతే తూర్పు పడమరల మధ్య శాశ్వతంగా కలయిక ఉండదో ఆ విధంగా దూరం చేయమని; ఒకవేళ తాను అందులో పడిపోతే ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆవిధంగా తనను పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయమని; అలాగే ఆ పాపాల వేడి నుండి శీతలీకరణ మరియు శుధ్ధీకరణ కారకాలైన నీరు, మంచు మరియు వడగళ్ళతో తనను కడిగివేయమని.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా పలికినారు: “ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.” సహీహ్ ముస్లిం గ్రంథములో ఉన్న హదీసులో “వాటిలో మొదటిసారి మట్టితో కడగండి” అని నమోదు చేయబడి ఉన్నది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకవేళ ఏదైనా పాత్రలో కుక్క నాలుక పెడితే (ఆ పాత్రను నాకినా, లేక ఆ పాత్ర నుండి తిన్నా) ఆ పాత్రను ఏడు సార్లు కడగాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు. అందులో మొదటిసారి మట్టితో తోమాలని తరువాత ఆరుసార్లు నీటితో కడగాలని ఆదేశించినారు. తద్వారా ఆ పాత్ర దాని అశుద్ధత నుండి మరియు దాని హాని నుండి పూర్తిగా పరిశుభ్రమవుతుంది.
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుమూత్ర విసర్జన కొరకు గానీ, లేక మల విసర్జన కొరకు గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైన నియమిత ప్రదేశములో (మరుగుదొడ్డి, లేక బహిర్భూమిలో) ప్రవేశించడానికి సంకల్పించినట్లయితే ముందుగా (అల్లాహ్ వద్ద) ఆడ మరియు మగ షైతానుల నుండి అల్లాహ్ యొక్క సంరక్షణ కోరేవారు. అపకారము మరియు హాని కలుగజేసే “అల్-ఖుబుసి” మరియు “అల్-ఖబాఇసి” లను కూడా దుర్మార్గమైనవిగానూ మరియు మలినమైనవిగానూ వ్యాఖ్యానించడం జరిగింది.
సహ్ల్ ఇబ్న్ హునైఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరత్వాన్ని మరియు ఆయన మార్గంలో షహీదు కావడాన్ని కోరుకుంటాడో, మరియు అతడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు తన సంకల్పములో నిజాయితీగా మరియు విశ్వాసపాత్రంగా ఉంటే, అల్లాహ్ అతని సంకల్పశుద్ధి, నిజాయితీ కారణంగా అతనికి అమరవీరుల హోదాను ప్రసాదిస్తాడు - అతడు ధర్మయుధ్ధములో (జిహాదులో) కాకుండా తన ఇంటిలోని మంచముపై మరణించినా సరే.
ఉమ్ముల్ ము'మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) మైమూనహ్ బింత్ అల్ హారిస్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘గుస్ల్’ చేయుట కొరకు నేను అన్నీ సిద్ధం చేసి ఉంచాను. నేను ఒక వస్త్రాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు (తెరలాగా) అడ్డుగా ఉంచాను. ఆయన తన చేతులపై నీళ్ళు వొంపుకుని, చేతులను కడుక్కున్నారు. తరువాత తన కుడి చేతితో ఎడమ చేతిపై నీళ్ళు పోసుకుని తన మర్మస్థానన్ని కడుక్కున్నారు. తరువాత తన చేతిని భూమిపై కొట్టి, చేతిని నేలపై తరువాత కడుక్కున్నారు. తరువాత నోటిని పుక్కిలించినారు, ముక్కు లోనికి నీళ్ళు పోనిచ్చి ముక్కును శుభ్రపరుచుకున్నారు, మరియు ముఖాన్నీ, రెండు చేతులను (మోచేతుల వరకు) కడుక్కున్నారు. తరువాత తన తలపై నీటిని పోసుకున్నారు, తరువాత తన శరీరంపై పోసుకున్నారు (అలా గుస్ల్ చేసి), తరువాత ఒక అడుగు ప్రక్కకు జరిగి తన రెండు కాళ్ళను కడుక్కున్నారు. నేను వారికి (తుడుచుకునేందుకు) ఒక వస్త్రాన్ని ఇవ్వగా అయన దానిని తీసుకోలేదు. తన రెండు చేతులను విదిలిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) మైమూనహ్ రజియల్లాహు అన్హా జనాబత్ స్థితి నుండి పరిశుద్ధత పొందుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన గుస్ల్ విధానమును గురించి తెలియజేస్తున్నారు. (సంభోగము వలన గానీ లేక స్వప్నస్ఖలనం వలన గానీ మనిషి లోనయ్యే అశుద్ధస్థితిని ‘జనాబత్’ స్థితి అంటారు). ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేయుట కొరకు నీటిని తోడి పెట్టి, ఒక వస్త్రాన్ని పరదాలా ఏర్పాటు చేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా (గుస్ల్) ఆచరించినారు. మొదటిది: నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు ఆయన తన రెండు చేతులను కడుక్కున్నారు. రెండవది: కుడి చేతితో ఎడమ చేతిలోనికి నీళ్ళు తీసుకుని ఆ నీటితో, సంభోగపు చాయలు, అశుద్ధత, తొలిగిపోయేలా తన మర్మస్థానాన్ని శుభ్రపరుచుకున్నారు. మూడవది: తన చేతిని నేలపై చరిచి, నేలపై రుద్ది తరువాత ఆ చేతి నుండి మలినం దూరమై పోయేలా నీటితో కడుక్కున్నారు. నాలుగవది: నోటిలోనికి నీళ్ళు తీసుకుని, బాగా గరగరలాడిస్తూ అటూ ఇటూ తిప్పి ఆ నీటిని దూరంగా పుక్కిలించి ఊసినారు. తరువాత ఉచ్ఛ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని తీసుకుని ముక్కును శుభ్రపరుచుకుని చీదేసినారు. ఐదవది: ముఖాన్ని కడుక్కున్నారు, చేతులను మోచేతుల వరకు కడుక్కున్నారు. ఆరవది: తన తలపై నీళ్ళు పోసుకున్నారు. ఏడవది: తన మొత్తం శరీరంపై నీళ్ళు పోసుకున్నారు. ఎనిమిదవది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాను గుస్ల్ ఆచరించిన స్థలం నుండి పూర్తిగా ప్రక్కకు జరిగి అక్కడ, గుస్ల్ లో భాగంగా కడగని తన కాళ్ళను అక్కడ కడుక్కుని శుభ్రపరుచుకున్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుస్ల్ ఆచరించిన తరువాత శరీరాన్ని తుడుచుకొనుటకు గానూ మైమూనహ్ రజియల్లాహు అన్హా వారికి ఒక వస్త్రాన్ని తెచ్చి ఇచ్చినారు. కానీ వారు దానిని తీసుకోకుండా చేతులతో శరీరం నుండి నీటిని తుడిచి వేస్తూ, చేతులను విదిలించినారు.
విశ్వాసుల మాత (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు, తరువాత సలాహ్ కొరకు (నమాజు కొరకు) చేయు విధంగా వుదూ చేసేవారు, తరువాత సంపూర్ణంగా స్నానం చేసేవారు. వారు తన చేతి వేళ్ళను తల వెంట్రుకల లోనికి జొప్పించి (వెంట్రుకల క్రింది) చర్మమంతా తడిసినది అని సంతృప్తి చెందే దాకా తడి చేసేవారు, తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేసేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరమూ ఒకే నీటి తొట్టి నుండి, ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:జనాబత్ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయాలని సంకల్పించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా రెండు చేతులను కడుక్కోవడంతో ప్రారంభించేవారు. తరువాత నమాజు కొరకు చేసిన విధంగా వుదూ చేసేవారు, తరువాత తన శరీరముపై నీళ్ళు పోసుకునే వారు, తరువాత తడి చేతుల వేళ్ళను తన తల వెంట్రుకలలోనికి జొప్పించి తల వెంట్రుకల మొదళ్ళ వరకు నీళ్ళు చేరాయని, తల చర్మమంతా బాగా తడిసిందని తృప్తి చెందే వరకు వేళ్ళతో మర్దన చేసేవారు. తరువాత వారు తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత మిగతా శరీరమంతా నీళ్ళు పారించి స్నానం చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: ‘నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే నీటి తొట్టి నుండి ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి”. సహీహ్ బుఖారీలో ఇలా ఉంది “అతడు వుదూకు ముందు తన పురుషాంగాన్ని కడుక్కుని వుదూ చేయాలి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు కు తరుచూ చిక్కగా, తెల్లగా, జిగటగా ఉండే మదీ అనే ద్రవం ఆయన పురుషాంగం నుండి విడుదలవుతూ ఉండేది. ఆ ద్రవం సాధారణంగా లైంగిక పరమైన ఆలోచనల వలన గానీ లేక సంభోగానికి ముందుగానీ విడుదలవుతుంది. తరుచూ ఆ విధంగా విడుదలవుతున్న ఆ ద్రవం విషయం లో ఏమి చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె ఫాతిమా ఆయన భార్య కావడంతో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను దానిని గురించి ప్రశ్నించడానికి సిగ్గుగా ఉండేది. కనుక ఆయన మిఖ్దాద్ బిన్ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు ను, ఆ విషయాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా జవాబిచ్చారు: “అతడు పురుషాంగాన్ని కడుగుకుని వుజూ చేయాలి.”