





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు: మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడు అయిన అల్లాహ్ నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పంపబడిన దాని నుండి వారు ఇలా ఉల్లేఖించినారు: “నిశ్చయంగా అల్లాహ్ మంచి పనులను గురించి, మరియు చెడు పనులను గురించి నమోదు చేసినాడు. తరువాత దానిని గురించి ఇలా విశదీకరించినాడు – ఎవరైతే ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకుంటాడో, మరి ఏదైనా కారణం వలన దానిని చేయలేక పోతాడో, అల్లాహ్ తన వద్ద, అతడి కొరకు ఆ మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు మరియు ఎవరైతే మంచి పని చేయాలని నిర్ణయించుకుని, ఆ పనిని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు పది నుండి మొదలుకుని ఏడు వందల రెట్లు ఎక్కువగా మంచి పనులు చేసినట్లు, ఇంకా దానికంటే కూడా ఎక్కువగా చేసినట్లు వ్రాస్తాడు. మరియు ఎవరైతే ఏదైనా చెడు పని చేయాలని సంకల్పించు కుంటాడో మరియు దానిని చేయకుండా ఉండి పోతాడో, అల్లాహ్ తన వద్ద అతడి కొరకు ఒక మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు. మరియు ఎవరైతే చెడు పని చేయాలని సంకల్పించుకుని ఆ పని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు ఒక చెడు పని చేసినట్లుగా వ్రాస్తాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో – మంచి చెడుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ముందుగానే నిర్ణయించినాడని, వాటిని ఏవిధంగా గ్రంథస్థం చేయాలనే విషయాన్ని, (ప్రతి వ్యక్తితో పాటు ఎల్లప్పుడూ ఉండే) ఇద్దరు దైవ దూతలకు విశదీకరించినాడని – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే, ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, ఒకవేళ అతడు దానిని చేయలేకపోయినా అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు దానిని చేసినట్లయితే, పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు, ఇంకా ఎక్కువ రెట్లు మంచి పనులు చేసినట్లుగా వ్రాయబడుతుంది. అయితే, పుణ్యఫలం ఎక్కువరెట్లు వ్రాయబడుట మరియు దానికి మించిన ప్రయోజనము అనేది అతడి హృదయంలో ఉన్న సంకల్పము యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. మరియు ఎవరైతే, ఏదైనా చెడు పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, మరియు అతడు దానిని కేవలం అల్లాహ్ కొరకు చేయకుండా ఆగిపోయినట్లయితే, అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడై ఉండి, అతడు దాని కొరకు అవసరమైన వనరులు సమకూర్చుకొనకుండా ఉండిపోయినట్లయితే, అతడి కొరకు ఏమీ వ్రాయబడదు. ఒకవేళ అతడు అన్నీ సమకూర్చుకుని కూడా ఆ పని చేయలేక ఆగిపోయినట్లయితే, (ఆ విధంగా ఆగిపోవడానికి సంబంధించి) అతని మనసులో ఉన్న సంకల్పము ననుసరించి అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు ఆ చెడు పని చేసినట్లయితే, అతడి కొరకు ఒక చెడుపని చేసినట్లుగా వ్రాయబడుతుంది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని ఇలా విశదీకరిస్తున్నారు – పరమ పవిత్రుడు, మరమోన్నతుడు అయిన అల్లాహ్ తన దాసుల బాహ్య రూపాలను చూడడు, అవి అందమైనవా లేక అందవికారమైనవా, అవి పెద్ద శరీరాలా లేక చిన్న శరీరాలా, ఆరోగ్య వంతమైనవా లేక వ్యాధిగ్రస్థమైనవా అని. అలాగే అల్లాహ్ తన దాసుల సంపదలను చూడడు అవి కొద్దిపాటి సంపదలా లేక చాలా పెద్ద సంపదలా అని. మహోన్నతుడు, సర్వ శక్తి మంతుడు అయిన అల్లాహ్ తన దాసుల యొక్క ఈ విషయాల లెక్క చూడడు, సంపదలలోని తారతమ్యాలను, హెచ్చుతగ్గులను చూడడు. కానీ అల్లాహ్ వారి హృదయాలను చూస్తాడు. అందులో అల్లాహ్ పట్ల ఉన్న భయభక్తులను, విశ్వాసాన్ని చూస్తాడు. అందులోని సత్యాన్ని, మరియు స్వచ్ఛతను చూస్తాడు. లేక ఇతరులు చూసి మెచ్చుకోవాలని లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే సంకల్పం ఉన్నదా అని చూస్తాడు. వారి ఆచరణలను చూస్తాడు – అవి ధర్మబద్ధమైనవా లేక భ్రష్ఠ ఆచరణలా అని, వాటి ఆధారంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి, నిగనిగలాడే నల్లని తల వెంట్రుకలు కలిగిన ఒక వ్యక్తి మా ముందుకు వచ్చినాడు. దూరం నుండి ప్రయాణించి వస్తున్న జాడలేవీ అతనిపై లేవు, మాలో ఎవరూ కూడా అతడిని ఎరుగరు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అభిముఖంగా, తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి, తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి కూర్చున్నాడు. తరువాత అతడు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! నాకు ఇస్లాం అంటే ఏమిటో చెప్పు?” అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట” అని సమాధాన మిచ్చినారు. అది విని అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. మాకు ఆశ్చర్యం అనిపించింది – అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్న అడుగుతున్నాడు, మరియు ఆయన సత్యమే పలికినారని ధృవీకరిస్తున్నాడు కూడా. తరువాత అతడు “విశ్వాసము అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విశ్వాసము అంటే – నీవు అల్లాహ్’ను విశ్వసించుట, ఆయన దూతలను (దైవదూతలను) విశ్వసించుట, ఆయన గ్రంథాలను విశ్వసించుట, ఆయన సందేశహరులను విశ్వసించుట, అంతిమ దినమును విశ్వసించుట మరియు విధివ్రాతను, అందులోని మంచిని చెడును విశ్వసించుట” అని సమాధానమిచ్చినారు. దానికి అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. తరువాత అతడు “ఇహ్’సాన్ అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇహ్’సాన్ అంటే – నీవు అల్లాహ్’ను (నీ ఎదురుగా) చూస్తున్నట్లుగా ఆయనను అరాధించుట, నీవు ఆయనను చూడలేక పోయినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు (అని గమనించు)” అని సమాధాన మిచ్చినారు. తరువాత అతడు “ప్రళయ ఘడియను గురించి చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దానిని గురించి, ప్రశ్నించ బడుతున్న వాడు, ప్రశ్నిస్తున్న వాని కంటే ఎక్కువగా ఎరుగడు” అని సమాధాన మిచ్చినారు. అతడు “దాని సంకేతాలైనా తెలియజేయి నాకు” అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “బానిస యువతి తన యజమానురాలికి జన్మనిస్తుంది, వొంటిపై బట్టలు, కాళ్ళకు చెప్పులు కూడా లేని నిరుపేద పశువుల కాపర్లు ఆకాశ హర్మ్యాలను నిర్మించడం’లో ఒకరితో నొకరు పోటీ పడుటను చూస్తావు నీవు” అన్నారు. తరువాత ఆ మనిషి వెళ్ళిపోయినాడు. నేను కొద్దిసేపు అలాగే ఉండిపోయాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో “ఓ ఉమర్! ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు?” అన్నారు. నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుని కి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. దానికి ఆయన “అతడు జిబ్రీల్ అలైహిస్సలాం, మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చినాడు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారని, ఆయన తల వెంట్రుకలు నిగనిగలాడుతూ అతి నల్లగా ఉన్నాయని, సుదూర ప్రయాణికుడు అనడానికి అతనిలో అలసట, వొంటిపై దుమ్ము, చెదిరిన వెంట్రుకలు, బట్టలపై ధూళి వంటి చాయలేవీ లేవు అని అతడి రూపురేఖలను గురించి వివరించినారు. తామందరూ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నామని, తమలో ఎవరూ అతడిని ఎరుగరు అని అన్నారు. అతడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటి నుంచో ఎరిగిన వానిలా, ఆయన ముందు కూర్చుని ఇస్లాం ను గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’, సలాహ్ ను స్థాపించుట, జకాతు చెల్లించుట, రమజాన్ నెల ఉపవాసములు మరియు స్థోమత కలిగి ఉంటే హజ్ చేయుట మొదలైన వాటితో కూడిన ఇస్లాం మూల స్తంభములను గురించి చెప్పినారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి “నీవు సత్యము చెప్పినావు” అన్నాడు. సహబాలందరూ ఆశ్చర్య పోయినారు – పైకి ఏమీ ఎరుగని వాడిలా ప్రశ్నిస్తాడు, తరువాత దానిని ధృవీకరిస్తాడు – అని. తరువాత అతడు ఈమాన్ గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ యొక్క ఆరు మూల స్తంభములను గురించి వివరించినారు. అందులో అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించుట, ఆయన గుణగణములను విశ్వసించుట, ఆయన కార్యములలో ఆయన ఏకైకుడని (ఆయనకు సాటి, సహాయకులు ఎవరూ లేరని) విశ్వసించుట, ఉదాహరణకు సృష్టి; ఆరాధనలు అన్నింటికీ ఆయన మాత్రమే ఏకైక అర్హుడని విశ్వసించుట. మరియు దైవదూతలను అల్లాహ్ కాంతితో సృష్టించినాడని, వారు అల్లాహ్ యొక్క గౌరవనీయులైన దాసులని, ఎప్పుడూ అల్లాహ్ పట్ల అవిధేయులు కారు అని, అల్లాహ్ యొక్క ఆఙ్ఞలకు అనుగుణంగా ఆచరిస్తారని విశ్వసించుట, అల్లాహ్ తరఫు నుండి ఆయన సందేశహరులపై అవతరింప జేయబడిన గ్రంథములను విశ్వసించుట, ఉదాహరణకు ఖుర్’ఆన్, తౌరాత్ మరియు ఇంజీలు మొదలైనవి, మరియు ఆయన సందేశహరులను విశ్వసించుట, ఎవరైతే అల్లాహ్ తరఫున ఆయన ధర్మాన్ని వ్యాపింప జేసినారో; వారిలో నూహ్, మూసా మరియు ఈసా అలైహిముస్సలాం మొదలైన మిగతా సందేశహరులు, ప్రవక్తలు ఉన్నారని, వారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లహ్ యొక్క చిట్టచివరి సందేశహరుడు అని విశ్వసించుట మరియు అంతిమ దినము నందు విశ్వసించుట – ఇందులో మరణానంతరం సమాధి నుండి మొదలుకుని ‘అల్ బర్జఖ్’ యొక్క జీవితం వరకు (మరణానికీ తీర్పు దినమునకు మధ్య ఉండే సంధి కాలపు జీవితం), మరియు మనిషి మరణానంతరం తిరిగి లేప బడతాడు అని, అతడి ఆచరణల లెక్క తీసుకో బడుతుంది అని, చివరికి అతడి అంతిమ నివాస స్థానము స్వర్గము గానీ లేక నరకము గానీ అవుతుంది అని విశ్వసించుట, తన అనంతమైన ఙ్ఞానము, వివేకముల ఆధారంగా అల్లాహ్ (ప్రళయ దినము వరకు) జరుగబోయే ప్రతి విషయాన్ని గురించి ముందుగానే రాసి ఉంచినాడని, జరిగే ప్రతి విషయమూ, అది ఎందుకొరకు సృష్టించబడినదో ఆ లక్ష్యము కొరకు జరుగుతుందని మరియు ఆయన ముందుగానే రాసి ఉంచిన దాని ప్రకారమే జరుగుతుందని విశ్వసించుట. తరువాత ఆవ్యక్తి ‘అల్ ఇహ్’సాన్’ ని గురించి తెలుపమని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – అల్ ఇహ్’సాన్ అంటే అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తూ ఉన్నట్లుగా ఆయనను ఆరాధించుట. ఆరాధనలో ఆ స్థాయిని చేరుకోలేక పోయినట్లయితే, అల్లాహ్ తనను చూస్తున్నాడని గ్రహించుట. వీటిలో మొదటిది (అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించుట) అత్యుత్తమ స్థాయి, రెండవ స్థాయి అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే , స్పృహ కలిగి ఉండుట. తరువాత అతడు ‘ప్రళయ ఘడియ ఎపుడు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రళయ ఘడియకు చెందిన ఙ్ఞానమును అల్లాహ్ తన ఙ్ఞానములో భద్రపరిచి ఉంచాడు. కనుక సృష్టితాలలో ఎవరూ దానిని గురించి ఎరుగరు, చివరికి ప్రశ్నించ బడుతున్నవాడు మరియు ప్రశ్నించే వాడు కూడా” అని వివరించారు. తరువాత అతడు ‘కనీసం ప్రళయ ఘడియ సంకేతాలైనా చెప్పమని’ అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఉంపుడు గత్తెలు విపరీతంగా పెరిగి పోవడం, ఆ కారణంగా వారి సంతానం పెరిగి పోవడం, లేదా తల్లుల పట్ల సంతానం యొక్క అవిధేయత విపరీతంగా పెరిగిపోవడం, వారు తమ సేవకులు, బానిసలు అన్నట్లుగా వ్యవహరించడం, అలాగే యుగాంతము సమీపిస్తున్న కాలములో పశువుల కాపరులకు, నిరుపేదలకు సైతము ఈ ప్రపంచ సుఖాలను సాధించుట తేలికై పోతుంది, వారు పెద్దపెద్ద భవనాలను నిర్మించడంలో ఆర్భాటము, అట్టహాసము ప్రదర్శిస్తుంటారు – అని వీటిని ‘ప్రళయ ఘడియ’ సమీపిస్తున్నది అనడానికి కొన్ని సంకేతాలుగా వివరించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నలు అడిగిన ఆ వ్యక్తి జిబ్రయీల్ అలైహిస్సలాం అని, సహబాలకు ఈ ‘దీన్ అల్ హనీఫా’ (స్వచ్ఛమైన ధర్మము) ను గురించి తెలియజేయడానికి వచ్చినారు అని తెలియ జేసినారు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది.” ముత్తఫఖున్ అలైహి. మరియు సహీహ్ ముస్లింలో ఇలా ఉంది: “ఎవరైనా మన ఈ విషయానికి (ఇస్లాం కు, షరియత్’కు) అనుగుణంగా లేని పనిని చేసినట్లయితే అది తిరస్కరించబడుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.
అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి, ఓ నా దాసులారా! ఎవరికైతే నేను మార్గదర్శకత్వం చేసినానో, వారు తప్ప మిగిలిన వారందరూ మార్గభ్రష్ఠులైన వారే. కనుక నా నుంచి మార్గదర్శకత్వం కోరుకొండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను తినిపించినానో, వారు తప్ప మిగిలిన వారందరూ ఆకలితో అలమటించే వారే. కనుక నా నుండి పోషణ కోరుకొండి, నేను మీకు పోషణనిస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను వస్త్రాలను తొడిగించానో, వారు తప్ప మిగిలిన వారందరూ వివస్త్రులే, కనుక నా నుండి వస్త్రాలను కోరండి, నేను మీకు వస్త్రాలనిస్తాను. ఓ నా దాసులారా! నిశ్చయంగా మీరు రాత్రుల యందు, పగటియందు పాపకార్యాలకు పాల్బడతారు మరియు నేను మీ పాపాలనన్నింటినీ క్షమిస్తాను. కనుక పాపక్షమాపణ కొరకు నన్ను అర్థించండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా! ఒకవేళ మీరు నాకు ఏదైనా హాని కలిగించ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ హాని కలిగించలేరు. అలాగే ఒకవేళ మీరు నాకు ఏదైనా మంచిని కలుగజేయ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ మంచిని కలుగజేయలేరు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత దైవభీతి గల హృదయం మాదిరి – అత్యంత దైవ భీతి గలవారిగా, అత్యంత పవిత్రులుగా మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ జోడించదు, ఏమీ ఉన్నతం చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత హీనమైన, నీచమైన, పాపిష్ఠి హృదయం మాదిరి – అత్యంత పాపిష్ఠులుగా, నీచులుగా, మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ నష్టము, హాని కలిగించదు, ఏమీ తక్కువ చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులు – ఒకవేళ అందరూ కలిసి ఒక మైదానంలో నిలబడి, నన్ను అర్థిస్తే, నేను అందరికీ వారు కోరుకున్నదంతా ప్రసాదించినా, అది నా ఖజానా నుంచి, సముద్రంలో ముంచిన సూది మొన సముద్రం నుండి ఎంత నీటిని తగ్గిస్తుందో, అంత కూడా తగ్గించదు. ఓ నా దాసులారా! నిశ్చయంగా, అవి మీ కర్మలు మాత్రమే, వాటి కొరకు మీరు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు. అపుడు నేను మీకు దాని పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాను. కనుక ఎవరైనా మంచిని, శుభాన్ని సాధించినట్లయితే అందుకు అల్లాహ్ ను ప్రస్తుతించాలి మరియు ఎవరైనా చెడుకు పాల్బడితే అందుకు మరెవ్వరినో కాకుండా తనను తాను నిందించుకోవాలి.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) తనపై నిషేధించుకున్నాడు, అలాగే ‘జుల్మ్’ ను తన సృష్ఠిరాశులలో కూడా నిషేధించినాడు. కనుక ఏ ఒక్కరూ కూడా మరొకరిపై దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొదలైన వాటికి పాల్బడరాదు – అని తెలియజేస్తున్నారు. ఇంకా, కేవలం ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం గావించినాడో, వారు తప్ప సృష్ఠి మొత్తం కూడా సత్యమార్గం నుండి మార్గభ్రష్ఠులైన వారేనని, మరియు ఎవరైతే అల్లాహ్ ను సత్యమార్గం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగ జేయమని అర్థిస్తారో, అల్లాహ్ వారికి సత్యమారం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగజేస్తాడు అని తెలియ జేసినారు. అల్లాహ్ సమక్షంలో అందరూ పేదవారే, వారి ఏ ఒక్క అవసరం కొరకైనా అల్లాహ్ పై ఆధారపడి ఉన్న స్థితిలో ఉన్న వారే. ఎవరైతే తమ అవసరాల కొరకు అల్లాహ్ ను అర్థించినారో, అల్లాహ్ వారి అవసరాలను తీర్చినాడు మరియు అల్లాహ్ వారి అవసరాలు తీర్చేందుకు వారి కొరకు సరిపోతాడు. మానవులు రాత్రులయందు, పగటియందు కూడా పాపపు పనులకు పాల్బడతారు. మరియు ఎపుడైతే దాసుడు పాపక్షమాపణ కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ను వేడుకుంటాడో, అల్లాహ్ అతడి పాపాలను కప్పివేస్తాడు, చూసీ చూడనట్లు వదిలివేస్తాడు మరియు క్షమిస్తాడు. మానవులు అల్లాహ్’కు ఏమీ ప్రయోజనం కలిగించలేరు. అలాగే ఎలాంచి హాని గానీ, నష్టము గానీ కలిగించలేరు. ఒక మానవుని అత్యంత దైవభీతి కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దైవభీతి గలవారిగా అయిపోయినా వారి దైవభీతి ఆయన ప్రభుతలో ఏమాత్రమూ వృధ్ధి చేయజాలదు. ఒక మానవుని అత్యంత దుష్ఠత్వము కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దుష్ఠులుగా అయిపోయినా వారి దుష్ఠత్వము ఆయన ప్రభుతలో ఏమాత్రమూ లోపము కలుగ చేయజాలదు మరియు నష్టపరుచజాలదు. ఎందుకంటే, వారంతా అల్లాహ్ సమక్షములో ఆశ్రితులు, నిరుపేదలు. వారు ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రతి చిన్న అవసరం కోసం ఆయనపై ఆధారపడవలసి ఉన్న స్థితిలో ఉన్నవారు. కేవలం ఆయన మాత్రమే సంపన్నుడు, అన్నిరకాల సంపదలకూ ప్రభువు. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి. మానవులూ మరియు జిన్నులూ, వారిలోని మొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు అందరూ ఒక మైదానం లో నిలబడి , తమ కోరికలు తీర్చమని అల్లాహ్ ను వేడుకున్నట్లయితే మరియు అల్లాహ్ వారందరూ కోరుకున్న ప్రతిదీ ప్రసాదించినట్లయితే, అది అల్లాహ్ వద్ద నున్న దానిని (సంపదను) ఏ మాత్రమూ తగ్గించదు, ఏవిధంగానైతే ఒక సూది మొనను సముద్రంలో ముంచి పైకి తీస్తే, అది సముద్రము నుండి ఏమీ తగ్గించలేదో ఆ విధంగా. ఇది అల్లాహ్ సుసంపన్నత యొక్క సంపూర్ణత్వము. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి అని తెలుపుతున్నది. పరమ పవిత్రుడైన అల్లాహ్ తన దాసుల ఆచరణలను సురక్షితంగా ఉంచుతాడు మరియు వారి నుండి ఆ ఆచరణల లెక్క తీసుకుంటాడు. తీర్పు దినము నాడు వారికి వారి ఆచరణల ప్రతిఫలం అందజేస్తాడు. ఎవరైతే తన మంచి ఆచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని పొందుతాడో, అల్లాహ్ యొక్క విధేయతలో ఆ సత్కార్యాలను ఆచరించే భాగ్యాన్ని కలుగ జేసినందుకు అతడు అల్లాహ్ ను స్తుతించాలి. మరియు ఎవరైతే తన చెడు ఆచరణలకు మంచి ప్రతిఫలం గాక మరింకేదైనా పొందితే, అందుకు ఎవరినో కాకుండా అతడు తనను తానే నిందించుకోవాలి, ఎందుకంటే అందుకు కారణం అతడే కనుక.
"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీసులో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు: 'తన బాల్యంలో, ఒక సవారీ పై తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, తనతో ఇలా అన్నారు "నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనాన్ని కలుగజేస్తాడు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా పలికినారు, "ఆయన ఆదేశించిన విషయాలను ఆచరించుటలో మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుటలో అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు - తద్వారా నీవు ఆయన పట్ల అవిధేయునిగా కాకుండా, విధేయుడైన దాసునిగా ఉంటావు. నీవు గానీ అలా చేస్తే, అల్లాహ్ నిన్ను ఈ ప్రపంచపు ఉపద్రవాలనుండి, పరలోకపు ఉపద్రవాలనుండి కాపాడుతాడు. (ధర్మము, న్యాయము కొరకు) నీవు చేసే కార్యాలలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు సహాయపడతాడు." ఒకవేళ నీవు ఏమైనా కావాలని వేడుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ వేడుకోకు. ఎందుకంటే, కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కోరికలు కోరుకునే వారి అభ్యర్థనలకు స్పందిస్తాడు. మరియు నీవు ఏమైనా సహాయం కావాలని కోరుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరి ఇంకెవ్వరినీ సహాయం కొరకు వేడుకోకు. వాస్తవాన్ని బాగా గ్రహించు - ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా ప్రయోజనం కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ ప్రయోజనం కలిగించలేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించిన ప్రయోజనం తప్ప. అలాగే ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా హాని కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ హాని కలిగించ లేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించినది తప్ప. అల్లాహ్, తనకున్న అపార జ్ఞానము, వివేకములను అనుసరించి, ఈ విషయాలు 'ఇలాగే జరుగుతాయి' ('ఇలాగే జరగాలి' అని కాదు) అని ముందుగానే పూర్వనిర్దేశము చేసి ఉంచినాడు. అల్లాహ్ పూర్వనిర్దేశము చేసిన దానిలో మార్పు ఏమీ ఉండదు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ యొక్క ప్రతి వ్యక్తి స్వర్గములోనికి ప్రవేశిస్తాడని, కేవలం ఎవరైతే దూరంగా ఉండిపోతాడో అతడు తప్ప అని తెలియజేసారు. అక్కడ ఉన్న సహాబాలు రజియల్లాహు అన్హుమ్ “ఎవరు దూరంగా ఉండిపోతారు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరునికి విధేయత చూపుతాడో, అతడి ఆదేశ పాలన చేస్తాడో మరియు అతడిని అనుసరిస్తాడో, అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే ఆయనకు అవిధేయత చూపుతాడో, షరియత్ ను అనుసరించడో, అతడి అవిధేయత, దుష్కర్మల కారణంగా స్వర్గం లోనికి ప్రవేశించడానికి నిరాకరించబడతాడు.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఇలా పలికినారు "ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".
అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఏదైనా ఒక జాతివారిని అనుకరించే వారి గురించి వివరిస్తున్నారు. ఉదాహరణకు అవిశ్వాసుల సమూహాన్ని లేదా క్రైస్తవుల సమూహాన్ని (జాతిని) అనుకరించేవారు లేదా ధార్మికులైన ప్రజల సమూహాన్ని అనుకరించేవారు - ఇలా ఏదైనా ఒక జాతిని, సమూహాన్ని వారి లక్షణాలలో, వారి స్వభావం లో, వారి గుణాణాలలో లేక వారి విశ్వాసాలలో, వారి ఆరాధనా పధ్ధతులలో లేక వారి ఆచార వ్యవహారాలలో వారిని అనుకరించినట్లయితే - అలా అనుకరించిన వారు, అనుకరించబడిన జాతి లేక సమూహములోని వారు అవుతారు. ఎందుకంటే వారిని బాహ్యంగా అనుకరించడం, అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి దారితీస్తుంది. ఎవరినైనా ఏదైనా విషయం లో అనుకరించడం అనేది ఆ విషయం పట్ల మనలోని ప్రశంసాత్మక వైఖరి, హర్షాతిరేకము మొదలైన వాటి కారణంగా మొదలవుతుంది. అది ఆ విషయాలను ప్రేమించేందుకు, వాటి పట్ల భక్తి శ్రద్ధలకు, వాటిపై ఆధారపడుటకు దారి తీయవచ్చు. ఇంకా అది మన అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి, ఆరాధించడానికి దారి తీయవచ్చు. అల్లాహ్ క్షమించుగాక.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఘోరమైన పాపములను గురించి ప్రశ్నించడం జరిగింది, దానికి ఆయన ఇలా అన్నారు: వాటిలో అన్నింటికన్నా ఘోరమైనది “అష్’షిర్క్ అల్ అక్బర్” (పెద్ద షిర్క్); అంటే అల్లాహ్ యొక్క “ఉలూహియత్’లో” (కేవలం ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విషయములో); అల్లాహ్ యొక్క “రుబూబియత్”లో (కేవలం అల్లాహ్ మాత్రమే ఈ విశ్వం మొత్తానికీ ప్రభువు అనే విషయములో); మరియు అల్లాహ్ యొక్క “శుభ నామములలో”, మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన గుణగణాలలో - ఆయనకు సమానమైన వాడిగా, లేక ఆయనను పోలిన వానిగా, ఆయనకు సాటిగా మరొకరిని తీసుకు రావడం – ఇది అన్నింటికన్నా ఘోరమైన పాపము. ఈ పాపాన్ని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడు – దీనికి పాల్బడినవాడు పశ్చాత్తాపము చెందితే తప్ప. ఒకవేళ అతడు ప్రశ్చాత్తపము చెందకుండా, దానిపైనే చనిపోతే అటువంటి వాడు శాశ్వతముగా నరకములో పడి ఉంటాడు. తరువాత – తనతో పాటు తింటాడు అనే భయంతో ఒక వ్యక్తి తన బిడ్డను తానే చంపడం. ఎవరినైనా ధర్మవిరుద్ధంగా చంపడం హరాం (నిషేధము). కానీ దాని తీవ్రత ఇంకా అధికమవుతుంది ఒకవేళ హతుడు, హంతకుడి బంధువు అయినట్లయితే; దాని తీవ్రత మరింత అధికమవుతుంది అల్లాహ్ ప్రాసాదించిన ఉపాధిలో అతడు కూడా భాగస్వామి అవుతాడు అనే ఉద్దేశ్యముతో హత్య చేసినట్లయితే. తరువాత – తన పొరుగువాని భార్యను మాయమాటలు చెప్పి, చివరికి మోసపూరితంగా లోబడిపోయేలా చేసుకుని ఆమెతో వ్యభిచరించడం. (ఇస్లాం లో) వ్యభిచారం హరాం (నిషేధము). ఆ పాపము యొక్క తీవ్రత మరింతగా ఎక్కువ అవుతుంది, అది తన పొరుగువాని భార్యతో అయినట్లయితే – ఎందుకంటే షరియత్ పొరుగువాని పట్ల దయతో, అతనితో మంచినడవడితో, ఒక మంచి పొరుగువానిగా ఉండమని ఆదేశిస్తున్నది.