





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను మీకొక హదీసును చెబుతాను, దానిని నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నాను. ఈ హదీథును నేను గాక ఇంకెవరూ మీకు చెప్పరు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ స్థాపించబడుటకు సమీప కాలములో ప్రస్ఫుటమయ్యే సూచనలను తెలియ జేస్తున్నారు – అందులో ఒకటి (ఈ భూమి నుండి) షరియత్ యొక్క ఙ్ఞానము లేపుకోబడుతుంది. అది ఙ్ఞానవంతుల, పండితుల, విద్వాంసుల మరణం వలన సంభవిస్తుంది. దాని పరిణామముగా అఙ్ఞానము విపరీతముగా పెరుగుతుంది, అంతటా వ్యాపిస్తుంది. వ్యభిచారము, అశ్లీలత విపరీతంగా వ్యాపిస్తాయి. సారా త్రాగడం సర్వ సాధారణమైపోతుంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఎంతగా అంటే, యాభై మంది స్త్రీలకు వారి వ్యవహారాలు, మంచిచెడులు చూడడానికి ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: "ఏదైనా ఒక సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి, ఆ సమాధిని చూస్తూ అతడి స్థానములో తానుంటే ఎంత బాగుండును అని అనుకునేటంత వరకూ అంతిమ ఘడియ స్థాపించబడదు". ఆ వ్యక్తి అలా ఎందుకు అనుకుంటాడూ అంటే ప్రపంచములో అసత్యము మరియు దాని జనులు బాగా ప్రబలిపోవడం, ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ, అరాచకత్వమూ బాగా ప్రబలిపోయి, తన(లో) ధర్మము ఎక్కడ బలహీనపడిపోతుందో అనే భయంతో అతడు అలా అనుకుంటాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు యూదులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. తన వెనుక దాగి ఉన్న యూదుని గురించి ఒక శిల “ఓ ముస్లిమా! ఓ యూదుడు నా వెనుక దాగి ఉన్నాడు. వాడిని సంహరించు” అని పలికేటంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిములు మరియు యూదులు ఒకరితోనొకరు యుద్ధానికి పాల్బడనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు అని తెలియజేస్తున్నారు. (ఆ యుద్ధంలో) ఒకవేళ యూదుడు ఒక శిల వెనుక దాక్కోవడానికి పారిపోయినా, అల్లాహ్ (తన అనుఙ్ఞతో) ఆ శిల మాట్లాడేలా చేస్తాడు. దానితో అది ముస్లిమును కేకవేసి తన వెనుక యూదుడు దాక్కుని ఉన్నాడని అంటుంది. అతడు వచ్చి యూదుడిని సంహరించే వరకు అలా అంటూనే ఉంటుంది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యత్తులో త్వరిత గతిన ఈసా అలైహిస్సలాం భువి నుండి దిగి రావడాన్ని గురించి (అల్లాహ్ పై) ఒట్టు వేసి మరీ ఇలా చెబుతున్నారు – ఆయన (ఈసా అలైహిస్సలాం) ప్రజల మధ్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ ప్రకారం న్యాయం చేస్తారు. ఆయన (ఈసా అలైహిస్సలాం) క్రైస్తవులు భక్తిభావనతో గౌరవించే శిలువను విరిచివేస్తారు. మరియు ఈసా (అలైహిస్సలాం) పందిని చంపుతారు. ఆయన అలైహిస్సలాం జిజియాను ఎత్తివేస్తారు, మరియు ప్రజలందరినీ ఇస్లాంలోనికి ప్రవేశించేలా చేస్తారు. మరియు సంపద ప్రవాహం లాగా ఉంటుంది, ఎవరూ దానిని స్వీకరించరు; అలా ఎందుకంటే దాని పుష్కలత కారణంగా. ప్రతి వ్యక్తీ తన చేతులలో ఉన్న దానితో పూర్తి సంతృప్తితో నిండి ఉంటాడు. శుభాలు, ఆశీర్వాదాలు, మేళ్ళు నిరంతరం అవతారిస్తూనే ఉంటాయి.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. అప్పుడు ఒక సంవత్సర కాలం ఒక నెల లాగా ఉంటుంది; ఒక నెల ఒక వారం మాదిరిగా ఉంటుంది; ఒక వారం ఒక రోజులాగా ఉంటుంది; ఒక రోజు ఒక గంట మాదిరిగా ఉంటుంది; ఒక గంట ఒక ఖర్జూరపు ఆకు కాలిపోయినంత తక్కువగా ఉంటుంది.”
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో (క్రమంగా) సమయం కుంచించుకు పొవడాన్ని ప్రళయ ఘడియ స్థాపించబడే చిహ్నాలలో ఒకటిగా పేర్కొన్నారు. అపుడు ఒక సంవత్సరం ఒక నెల లాగా (అంత వేగంగా) గడిచిపోతుంది. నెల రోజుల కాలం ఒక వారం లాగా గడిచిపోతుంది. వారం రోజుల కాలం ఒక రోజు లాగా గడిచిపోతుంది. ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోతుంది. ఒక గంట ఎంత త్వరగా గడిచి పోతుందంటే, ఒక ఖర్జూరపు ఆకు కాలిపోయినంత త్వరగా.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను: “అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రళయదినము నాడు సర్వోన్నతుడైన అల్లాహ్ భూమినంతటినీ ఒడిసి పట్టుకుని ఒక చోటికి చేర్చి, ఆకాశాన్నంతటినీ చుట్టచుట్టి, వాటిని ఒకదానిపై ఒకటిగా పేర్చి తన కుడి చేతిలో పట్టుకుని వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తాడు – అప్పుడు ఇలా అంటాడు: నేనే రారాజును ఏరీ ఆ భూమిపై రాజులు, ఎక్కడున్నారు?
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది; దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల వంటివి; దాని నుండి నీటిని త్రాగిన వారెవరూ మరింకెన్నడూ దాహానికి లోను కారు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినమున తనకు ఒక తొట్టి ప్రసాదించబడుతుందని, దాని పొడవు, వెడల్పుల రెండు అంచుల మధ్య దూరము ఒక నెల ప్రయాణమంత ఉంటుందని తెలియ జేస్తున్నారు. మరియు దాని నీరు పాలకన్నా తెల్లగా ఉంటాయి. దాని సువాసన యొక్క మాధుర్యం కస్తూరీ గంధపు సువాసన కన్నా మధురంగా ఉంటుంది. దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల మాదిరి అసంఖ్యాకంగా ఉంటాయి. ఆ కప్పులతో అందులోని నీటిని త్రాగిన వారెవరూ ఇంకెన్నడూ దాహానికి లోను కారు.
అస్మా బింత్ అబీ బక్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు” అని వేడుకుంటాను. దానికి “నీకు తెలుసా, నీ తరువాత వీరు ఏమేం చేసినారో?” అని సమాధానం ఇవ్వబడుతుంది. అల్లాహ్ సాక్షిగా వాళ్ళు వేగంగా తమ మడమలపై వెనుదిరిగి పోతారు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - తీర్పు దినమునాడు, తన ఉమ్మత్ నుండి ఎవరెవరు నీటి తొట్టి వద్దకు వస్తారో చూడడానికి, తాను ఆ నీటి తొట్టి వద్దనే ఉంటాను అని తెలియ జేస్తున్నారు. కొంతమంది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దనుండి దూరంగా తీసుకు వెళ్ళబడతారు. అపుడు ఆయన “ఓ నా ప్రభూ! వారు నావాళ్ళు, నా ఉమ్మత్ వాళ్ళు” అని వేడుకుంటారు. అపుడు “నీ నుండి దూరమైన తరువాత (నీ తరువాత) వారు ఏమి చేసినారో తెలుసా నీకు? వారు తమ ధర్మాన్ని (ఇస్లాంను) వదిలి తమ పూర్వపు ధర్మానికి తిరిగి వెళ్ళినారు. వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ ఉమ్మత్ వాళ్ళూ కాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు చెప్పబడుతుంది.
అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను “మరి (నీటి హౌజు లోని ఆ నీటిని త్రాగే) కప్పుల మాటేమిటి?” దానికి ఆయన ఇలా అన్నారు: “ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి. అవి స్వర్గపు పాత్రలు. ఎవరైతే దాని నుండి (ఆ నీటి హౌజు నుండి) నీటిని త్రాగుతాడో, అతడు ఇంకెన్నడూ దాహానికి లోను కాడు. అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని నుండి నీటిని త్రాగిన వారెవ్వరికీ తిరిగి దాహం వెయ్యదు. ఆ నీటి తొట్టి వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది; అమ్మాన్ మరియు ఆయిలహ్’ల మధ్య దూరమంత. దాని నీరు పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా మధురంగా ఉంటాయి”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్లాహ్ సాక్షిగా’ అని అల్లాహ్ పై ప్రమాణం చేసి నీటి హౌజు నుండి నీటిని త్రాగడానికి ఉపయోగించే గిన్నెలు ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే ఇందులో ‘నల్లని రాత్రి’ అన్నారు. అంటే అందులో చంద్రుడు ఉండడు. చంద్రుని కాంతితో నిండి ఉన్న ఆకాశం లో నక్షత్రాలు స్పష్టంగా కనిపించవు. చంద్రుడి కాంతి వెనుక అవి కప్పబడి ఉంటాయి. అలాగే ‘మబ్బులు లేని ఆకాశంలో’ అన్నారు. ఎందుకంటే మబ్బులు నక్షత్రాలను సరిగా కనిపించనీయవు. ఇంకా ‘స్వర్గపు పాత్రల’ (కప్పుల) ప్రస్తావన ఉంది. ఎవరైతే అందులో (స్వర్గములో ఆ పాత్రల నుపయోగించి) దేనినైతే త్రాగుతారో వారికి దాని దాహము ఇంకెన్నటికీ వెయ్యదు. ఆ విషయపు దాహానికి సంబంధించి అది ఆఖరిది అవుతుంది. (దాహార్తి అంతగా సంతుష్ఠుడు అవుతాడు అని అర్థము). అలాగే ఈ హదీసులో ఆ నీటి హౌజు గురించి, అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయని, దాని వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది అని తెలియ జేయబడింది. అలాగే ఆ నీటి హౌజు యొక్క అంచులు సమానంగా ఉంటాయని, దాని పొడవు షామ్ దేశంలోని ‘బఖా’ లో ఒక నగరమైన అమ్మాన్ నుండి, షామ్ దేశపు సరిహద్దులలో ఉన్న, ఒక ప్రఖ్యాత నగరమైన ‘అయ్’లహ్’ కి మధ్య దూరమంత ఉంటుందని (ఉపమానంగా) తెలుపబడింది. అలాగే ఆ నీటి హౌజులోని నీరు పాలకన్నా తెల్లగా ఉంటుందని, దాని రుచి తేనె కన్నా మధురంగా ఉంటుందని తెలియ జేయబడింది.