





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
మహ్’మూద్ బిన్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిద్-ఎ-నబవీ ని, ఉన్న స్థితిలో కంటే ఉత్తమంగా పునర్నిర్మించాలని సంకల్పించినారు. దానికి ప్రజలు ఇష్టపడలేదు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో నిర్మించబడిన మస్జిదు అసలు నిర్మాణములో మార్పులు వస్తాయని. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో) మస్జిదు మట్టితో నిర్మించబడింది, దాని కప్పు సున్నపు రాయితో కట్టబడింది. అయితే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు రాతితో మరియు ప్లాస్టరుతో నిర్మించాలని తలపోసినారు. ప్రజల అయిష్టతను గమనించి, ఆయన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విన్నానని తెలియజేసినారు – “ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క కరుణ కొరకు, కపటత్వం గానీ లేక కీర్తి కండూతి గానీ లేకుండా, మస్జిదును నిర్మిస్తారో అల్లాహ్ వారు చేసిన పనిని పోలిన అత్యుత్తమమైన దానిని అతనికి ప్రసాదిస్తాడు; ఈ విషయానికి సంబంధించి ఆ అత్యుత్తమమైనది ఏమిటంటే అల్లాహ్ స్వర్గములో దానిని పోలిన అత్యుత్తమ ఇంటిని అతని కొరకు నిర్మిస్తాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మస్జిదులో నమాజు ఆచరించుట యొక్క ఘనతను తెలియజేస్తున్నారు; అది భూమిపై మరే ఇతర మస్జిదులలో ఆచరించే నమాజు కంటే పుణ్యఫలములో వెయ్యి రెట్లు ఉత్తమమైనది, కేవలం మక్కాలో ఉన్న మస్జిదె హరంలో ఆచరించే నమాజు మినహాయించి. మక్కాలోని మస్జిదె హరంలో ఆచరించే నమాజు ఆయన (స) మస్జిదులో ఆచరించే నమాజుకంటే పుణ్యఫలం (అజ్ర్)లో మరింత ఉత్తమమైనది.
అబీ ఖతాదా అస్’సలమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధిస్తున్నారు – ఎవరైనా ఏ సమయములోనైనా, ఎందుకొరకైనా మస్జిదుకు వచ్చి అందులోనికి ప్రవేశించినట్లయితే, అతడు మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు ఆచరించాలి - ఆ రెండు రకాతుల నమాజు ‘తహియ్యతుల్ మస్జిద్’ (మస్జిదునకు గౌరవ సూచకంగా చేయబడే నమాజు) అనబడుతుంది.
అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.
సాలిం బిన్ అబీ అల్ జ’అద్ ఉల్లేఖనం : “(మస్జిదులో) ఒక వ్యక్తి ఇలా అన్నాడు “బహుశా నేను నమాజు చదివితే విశ్రాంతి పొందేవాడిని”. అక్కడున్న వారు అతడు ఇలా అనడాన్ని వ్యతిరేకించారు. దానికి అతడు ఇలా అన్నాడు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”
అబూదావూద్ నమోదు చేసినారు:సహబాలలో నుండి ఒకరు “నేను నమాజు ఆచరిస్తే బాగుండు, నాకు మనశ్శాంతి కలుగుతుంది” అన్నారు. (అతడు ‘నమాజు అయిపోతే బాగుండు, విశ్రాంతి కలుగుతుంది’ అంటున్నాడేమో అనుకుని) అక్కడ ఉన్నవారు అతడు అలా అనడాన్ని వ్యతిరేకించారు. దానికి అతడు “ఓ బిలాల్! నమాజు ప్రారంభించుట కొరకు అఖామత్ పలుకు. అందరమూ అందులో మనశ్శాంతి పొందవచ్చు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకగా నేను విన్నాను” అని వారికి తెలియజేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఎందుకన్నారంటే నమాజులో దాసుడు తన ప్రభువుతో ఏకాంత సంభాషణ చేస్తూ ఉంటాడు. అది అతడి ఆత్మకు, హృదయానికీ సాంత్వన కలుగజేస్తుంది.
అబీ హాజిం ఇబ్న్ దీనార్ ఉల్లేఖనం : కొంతమంది మగవారు సహ్’ల్ బిన్ స’ఆద్ అస్’సఈదీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. వారు "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన వేదిక (మింబర్) దేనితో తయారు చేసి ఉంటారు" అనే విషయంలో వాదులాడుకోసాగినారు. వారు అతడిని దాని గురించి అడిగినారు. అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అది దేనితో తయారు చేయబడినదో నాకు తెలుసు, అది ఇక్కడికి తీసుకు రాబడి ఇక్కడ స్థాపించబడిన మొదటి రోజునే నేను దానిని చూసాను, (స్థాపించబడిన తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై మొదటిసారి కూర్చోవడం కూడా చూసాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఫలానా స్త్రీ ఇంటికి పంపారు. సహ్’ల్ ఆ స్త్రీ పేరును కూడా చెప్పారు. ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకుడిని "నేను (మస్జిదులో) ప్రజలను సంబోధించి ప్రసంగించ వలసి వచ్చినపుడు కూర్చోవడానికి గానూ ఎత్తైన ఒక వేదికను తయారు చేయమని" పురమాయించండి” అని చెప్పమని పంపినారు. ఆమె అతనిని (వడ్రంగి సేవకునికి) ఆ పని కొరకు పురమాయించింది. అతడు ఆ వేదికను, అల్-ఘాబా నుండి ‘తమరిస్క్’ వృక్షపు కలపను తెప్పించి దానిని తయారు చేసినాడు. ఆ మెంబర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపబడింది. వారు దానిని అదుగో ఇక్కడే స్థాపించమని అదేశించినారు. తరువాత (దాని మెట్లు ఎక్కి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైకి వెళ్ళడాన్ని, దానిపై ఆయన నమాజు ఆచరించడాన్ని చూసాను. దానిపై ఉండగా ఆయన (“అల్లాహు అక్బర్” అని) తక్బీర్ పలికి నమాజును ప్రారంభించి, దానిపై ఉండగానే రుకూ చేసినారు. తరువాత వారు అడుగులు వెనుకకు వేస్తూ వేదిక మెట్లుదిగి, మెట్ల ప్రక్కన సజ్దా చేసినారు. (రెండు సజ్దాలు చేసిన) తరువాత వారు తిరిగి మెట్లు ఎక్కి వేదికపైకి వెళ్ళినారు. (ఆ విధంగా) వారు నమాజును పూర్తిచేసి ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన మింబర్ (ప్రసంగవేదిక) దేనితో తయారు చేయబడింది అనే విషయంలో కొంతమంది తమలో తాము వాదులాడుకుని, సహాబాలలో ఒకరి దగ్గరికి వచ్చి "అది దేనితో తయారు చేయబడింది" అని ప్రశ్నించారు: అన్సారులలో ఒకరిని ఒక స్త్రీ వద్దకు ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకునితో, నేను (మస్జిదులో) ప్రజలనుద్దేశించి ప్రసంగించవలసి వచ్చినపుడు, కూర్చోవడానికి ఒక వేదికను (మింబర్) ను తయారు చేయమని ఆదేశించండి” అని చెప్పమని పంపించినారు. ఆ స్త్రీ తన సేవకునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆ వేదికను తయారు చేయమని ఆదేశించినది. ఆ వేదిక “తామరిస్క్” వృక్షపు కలపతో తయారు చేయబడింది. అది తయారైన తరువాత ఆ స్త్రీ దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపించింది. అపుడు ఆయన దానిని తీసుకుని మస్జిదులో అది ఇపుడు ఉన్న స్థానములో స్థాపింపజేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై నమాజును ఆచరించినారు. దానిపై ఉండగా “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికి, రుకూ కూడా దానిపైనే ఆచరించి, తరువాత వెనుకకు అడుగులు వేస్తూ మెట్లు దిగి వేదిక ప్రక్కన రెండు సజ్దాలు చేసి తిరిగి మెట్లు ఎక్కి మింబర్ పైకి ఎక్కి – ఆ విధంగా నమాజును పూర్తి చేసినారు. తరువాత వారు ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! మీరు నా నమాజు విధానాన్ని నేర్చుకుంటారని, ఆ విధంగా మీరు అనుసరిస్తారని మాత్రమే నేను ఇలా చేసినాను” అన్నారు.
హిత్తాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అర్’రఖాషీ ఉల్లేఖన: “నేను అబీ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) తో నమాజు ఆచరించాను. ఆయన తషహ్హుద్ లో ఉండగా, అక్కడున్న(నమాజు చదువుతున్న) వారిలో ఒకరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” (“నమాజు, ధర్మబధ్ధత మరియు జకాతులతో పాటు స్థాపించబడినది”) అన్నారు. అబీ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు సలాముతో నమాజును ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీలో ఎవరు అలా అన్నది?” అని ప్రశ్నించారు. ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. ఆయన మళ్ళీ ప్రశ్నించారు “మీలో ఎవరు అలా అన్నది?” అని. తిరిగి ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. అపుడు ఆయన “ఓ హిత్తాన్! బహుశా నీవే అలా అని ఉంటావు” అన్నారు. దానికి హిత్తాన్ “లేదు, నేను అనలేదు. మీరు కోపగిస్తారేమో అని నేను మౌనంగా ఉన్నాను” అన్నాడు. అపుడు ప్రజలలో నుండి ఒకరు “అలా అన్నది నేనే, అయితే నేను మంచి ఉద్దేశ్యముతోనే అలా అన్నాను” అన్నాడు. అపుడు అబీ మూసా ఇలా అన్నారు: “నమాజులో ఏమి పలకాలో తెలియదా నీకు? నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు, మరియు మాకు సున్నతును వివరించారు. మరియు నమాజులను ఆచరించమని బోధించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి. ఎపుడైతే అతడు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” (సూరహ్ అల్ ఫాతిహా: 7వ ఆయతు) అని పఠిస్తాడో, మీరు ‘ఆమీన్’ అనండి, అల్లాహ్ మీ ప్రార్థనకు స్పందిస్తాడు. ఇమాం తక్బీర్ పలికితేనే, మీరు కూడా తక్బీర్ పలుకండి, ఎందుకంటే అతడు మీ కంటే ముందుగా రుకూ చేస్తాడు, మరియు రుకూ నుండి మీ కంటే ముందుగా పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఇది దానికి సమానం అవుతుంది (మీరు అలా చేయడం ఇమాం చేసిన దానికి సమానం అవుతుంది). ఇమాం “సమి’అల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని వింటాడు (తనను కీర్తించిన వాని దుఆను వింటాడు) అని పలికితే, మీరు “అల్లాహుమ్మా, రబ్బనా లకల్ హంద్” (ఓ అల్లాహ్, మా ప్రభూ, పొగడ్తలు, కీర్తనలు అన్నీ నీ కొరకే) అని పలకండి – అల్లాహ్ మిమ్మల్ని (మీ దుఆలను) వింటాడు. ఎందుకంటే అల్లాహ్ తన సందేశహరుని నాలుక ద్వారా పలికించాడు – అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) వింటాడు అని. అతడు (ఇమాం) తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే మీరు కూడా తక్బీర్ పలికి సజ్దహ్ చేయండి. అతడు మీకంటే ముందే సజ్దహ్ చేస్తాడు మరియు మీ కంటే ముందే సజ్దహ్ నుండి పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(మీరు) అలా చేయడం, దానికి (అతడు చేసిన దానికి) సమానం అవుతుంది. అతడు ‘తషహ్హుద్’ కొరకు కూర్చొంటే, మీ అందరిలో ప్రతి ఒక్కరి నోట ముందుగా రావాల్సిన మాటలు ఇవే అయి ఉండాలి: “అత్తహియ్యాతు, అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్, అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”
ముస్లిం నమోదు చేసినారు:సహాబీ అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఒకసారి నమాజు ఆచరించారు. నమాజులో తషహ్హుద్ చదువుట కొరకు కూర్చుని ఉండగా, ఆయన వెనుక నమాజు చదువుతున్న వారిలో ఒకరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” (“నమాజు, ధర్మబధ్ధత మరియు జకాతులతో పాటు స్థాపించబడినది”) అన్నారు. అబూ మూసా రజియల్లాహు అన్హు నమాజు ముగించి తన వెనుక నమాజు చదువుతున్న వారివైపునకు తిరిగి “మీలో ఎవరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” అని అన్నది?” అని అడిగారు. ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఆయన మళ్ళీ ఆ ప్రశ్నను అడిగారు. అపుడు కూడా ఎవరూ జవాబివ్వలేదు. అపుడు హత్తాన్ ను చూసి “బహుషా నీవు అలా అని ఉంటావు” అన్నారు. ఎందుకంటే అతడు తనకు బాగా దగ్గరివాడు, ధైర్యవంతుడు, తనకు అతడికి మధ్య ఉన్న బాంధవ్యము అలాంటిది. ఒకవేళ అతడు అలా అనకున్నా అతడు చెడుగా ఏమీ అనుకోడు అని ఆయనకు తెలుసు. కానీ దాని కారణంగా అసలు ఆ మాట ఎవరు అన్నారో వారు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. హత్తాన్ ‘తాను కాదు’ అని తేల్చి చెప్పి “మీరు కోపగించుకుంటారేమో అనే భయంతో అలా ఉండిపోయాను” అన్నాడు. అపుడు అక్కడున్న ప్రజలలోనుండి ఒకరు “నేను అలా అన్నది. అయితే నేను మంచి ఉద్దేశ్యముతోనే అలా అన్నాను” అన్నాడు. అప్పుడు అబూ మూసా ఒక గురువులా అతనికి బోధించారు: “తషహ్హుద్ లో ఏమి పలకాలు తెలియదా నీకు?” అన్నారు. ఆయన అలా అనడం – అతడు పలికినది సరికాదని తన అసమ్మతిని తెలియజేయడం. తరువాత అబూ మూసా (అక్కడున్న వారందరికీ) తెలియజేసారు – ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ ఉద్దేశ్యించి ప్రసంగించినారని, వారికి సున్నతును బోధించినారని, తమ నమాజులను ఎలా ఆచరించాలో తెలియజేసినారని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు నమాజు ఆచరించుటకు ముందు మీ వరుసలను సరిచేసుకోండి. మీలో ఒకరు మిగతావారికి (ఇమాంగా) నమాజు చదివించాలి. ఇమాం నమాజు ప్రారంభించుటకు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితే, మీరు కూడా తక్బీర్ పలుకండి. అతడు సూరా ఫాతిహా పఠిస్తూ, చివరి ఆయతు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” పఠించినపుడు, మీరు “ఆమీన్” అని పలకండి. మీరు అలా చేస్తే అల్లాహ్ మీ దుఆలకు స్పందిస్తాడు. అతడు తక్బీర్ పలికి రుకూ చేసినపుడు, మీరు కూడా తక్బీర్ పలికి రుకూ చేయండి. ఇమాం మీకంటే ముందు రుకూ చేస్తాడు, మరియు మీ కంటే ముందు రుకూ నుండి పైకి లేస్తాడు. కనుక అతని కంటే ముందు ఆచరించకండి. అతడు మీ కంటే ముందు రుకూ లోనికి వెళతారు కనుక, అతడు రుకూ నుండి లేచిన తరువాత మీరు ఒకింత ఆలస్యంగా రుకూ నుండి లేస్తే మీరు రుకూలో ఉన్న సమయం, అతడు రుకూలో ఉన్న సమయంతో సమానమవుతుంది. ఇమాం “సమియల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆను) విన్నాడు) అని పలికితే, మీరు “రబ్బనా, లకల్ హంద్” (ఓ మా ప్రభూ! స్తుతులు, కీర్తనలు, పొగడ్తలు అన్నీ నీ కొరకే) అని పలకండి. భక్తుడు అలా పలికితే పరమ పవితృడైన అల్లాహ్ ఆ భక్తుని దుఆలు, అతని మాటలు వెంటాడు; ఎందుకంటే సర్వోన్నతుడైన అల్లాహ్ స్వయంగా తన సందేశహరుని నాలుక పై నుండి ఆ మాటలు పలికించాడు – “సమియల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) విన్నాడు) అని. ఇమాం “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే, ఆయన నాయకత్వంలో, ఆయన వెనుక ఎవరైతే నమాజు ఆచరిస్తున్నారో వారు కూడా “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేయాలి. ఇమాం వారి కంటే ముందు సజ్దాహ్ చేస్తాడు, మరియు వారి కంటే ముందు సజ్దాహ్ నుండి పైకి లేస్తాడు. వారు అతని తరువాత ఆచరిస్తారు కనుక, వారు సజ్దాహ్ లో గడిపిన కాలము అతడు సజ్దాహ్ లో గడిపిన కాలముతో సమానం అవుతుంది. తరువాత తషహ్హుద్ పలుకుట కొరకు కూర్చున్నపుడు, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి మొదటి మాట ఇది అయి ఉండాలి: “అత్’తహియ్యాతు అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి” (పొగడ్తలు, కీర్తనలు, స్తుతులు సర్వమూ అల్లాహ్ కొరకే) – అంటే, రాజ్యము ఆయన కొరకే, రక్షణ ఆయనదే మరియు ఘనత ఆయనదే, అదే విధంగా విధిగా ఆచరించవలసిన 5 పూటల నమాజు కూడా ఆయన కొరకే. తరువాత "అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్” (ఓ ప్రవక్తా! మీపై శాంతి మరియు అల్లాహ్ యొక్క కరుణ ఉండుగాక, అలాగే మాపై మరియు అల్లాహ్ యొక్క ధర్మబధ్ధులైన దాసులపై కూడా) అని పలికి దాసుడు అల్లాహ్ ను ప్రతి లోపము నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి వెలితి నుండి మరియు ప్రతి అవినీతి, లంచగొండితనము నుండి రక్షణ కోరుతాడు. ఆ విధంగా అభివాదములను మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ప్రత్యేకిస్తాము, అలాగే ధర్మబధ్ధులైన అల్లాహ్ యొక్క దాసుల కొరకు కూడా ప్రత్యెకిస్తాము. ఎందుకంటే వారు అల్లాహ్ ఆదేశాలను శిరసావధించారు, అల్లాహ్ యొక్క హక్కులను, అల్లాహ్ దాసుల యొక్క హక్కులను నెరవేర్చారు. రతువాత “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనల కొరకు వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు అని) సాక్ష్యము పలుకుతాము.”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రతి ఫర్జ్ నమాజులోనూ, ప్రతి సున్నత్ మరియు నఫీల్ నమాజులోనూ, రమజాన్ నెలలో అయినా, లేక ఇతర నెలలలో అయినా “అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆయన (నమాజు కొరకు) లేచి నిలబడినపుడు “అల్లాహు అక్బర్” అని పలికేవారు, రుకూ చేయునపుడు “అలాహు అక్బర్” అని పలికేవారు. రుకూ నుండి లేచునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, సజ్దాహ్ లోనికి వెళ్ళుటకు ముందు “రబ్బనా లకల్ హంద్” అని పలికేవారు. తరువాత సజ్దాహ్ చేయుట కొరకు వంగునపుడు “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తల పైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు. తిరిగి సజ్దాహ్ చేయునపుడు తక్బీర్ పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తలపైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు; తరువాత కూర్చుని ఉన్న స్థితి నుండి పైకి లేచునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) అని రెండు సందర్భాలలోనూ పలికేవారు. సలాహ్ (నమాజు) ముగించే వరకూ ప్రతి రకాతులోనూ ఆయన ఈ విధంగా ఆచరించేవారు. అపుడు (నమాజు ముగించిన తరువాత) వెళ్ళునపుడు ఆయన ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో ఆయన సాక్షిగా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు మీ అందరిలో నిశ్చయంగా నేను అత్యంత దగ్గరిగా ఉన్నాను. ఈ ప్రపంచం నుండి వెడలిపోయేటంత వరకు ఆయన నమాజు ఈ విధంగానే ఉండినది”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఇందులో అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో కొద్ది భాగాన్ని వివరిస్తూ, ఇలా అంటున్నారు: నమాజు కొరకు లేచి (నిలబడి) నపుడు “తక్బీరతుల్ ఇహ్రాం” (నమాజు ప్రారంభించుటకు మొదటి సారి “అల్లాహు అక్బర్” అని) పలుకుతారు, తరువాత రుకూ కొరకు వంగునపుడు, సజ్దా చేయునపుడు, సజ్దాహ్ నుండి తల పైకి ఎత్తునపుడు, రెండవ సారి సజ్దాహ్ చేయునపుడు, మరియు దాని నుండి తల పైకి లేపునపుడు, మరియు మూడు రకాతుల లేక నాలుగు రకాతుల నమాజులో, రెండవ రకాతులో మొదటి తషహ్హుద్ తరువాత పైకి లేచునపుడు “అల్లాహు అక్బర్” అని పలుకుతారు; ఇలా ఆయన సలాహ్ (నమాజు) ముగించే వరకూ ఇలాగే ఆచరిస్తారు. రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, రుకూ నుండి పూర్తిగా పైకి లేచి నిలబడినపుడు “రబ్బనా లకల్ హంద్” అని పలుకుతారు. నమాజు ముగించిన తరువాత అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – ఒకవేళ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచం నుండి వెడలి పోయేటంత వరకు, వారి నమాజు విధానం అయితే, సారూప్యతలో మీ అందరిలో ఆయన నమాజు విధానానికి నేను అతి చేరువగా ఉన్నాను”.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”.
ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – దొంగతనం చేసేవారిలో అత్యంత హీనమైన వాడు ఎవరంటే, ఎవరైతే తన నమాజులో (సల్లాహ్ ను) దొంగతనం చేస్తాడో. ఎందుకంటే ఇతరుల ధనాన్ని దొంగిలిస్తే, దాని ద్వారా అతడు ఈ ప్రపంచములో ఏ కొద్దిగానైనా ఉపయోగం పొందగల అవకాశం ఉన్నది. ఇటువంటి దొంగ మాదిరి కాకుండా, ఇలాంటి దొంగ, తన పుణ్యఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు, సలాహ్ యొక్క ప్రతిఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు. అక్కడున్న వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా ప్రశ్నించారు – ఎవరైనా తన సలాహ్ లో ఎలా దొంగతనం చేయగలడు? అని దానికి వారు ఇలా అన్నారు “అతడు తన రుకూను పూర్తిగా ఆచరించడు, అలాగే తన సజ్దాహ్ లను పూర్తిగా ఆచరించడు”, ఆ విధంగా అతడు రుకూ నూ, సజ్దాహ్ లను (నిదానంగా, ప్రశాంతంగా కాకుండా) తొందర తొందరగా పూర్తిచేస్తాడు, వాటిని సంపూర్ణంగా ఆచరించడు.