





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అమ్ర్ ఇబ్న్ షుఐబ్ రజియల్లాహు అన్హు తన తండ్రి నుండి, ఆయన తన తండ్రి (అమ్ర్ ఇబ్న్ షుఐబ్ తాత) నుండి ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”
అబూదావూద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరిస్తున్నారు: “తన సంతానం – ఆడపిల్లలు మరియు మగ పిల్లలు – ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు, సలాహ్ ఆచరించమని ఆదేశించడం, మరియు వారు సలాహ్ ఆచరించడానికి కావలసిన ఙ్ఞానాన్ని వారికి పొందుపరచడం (ప్రతి) తండ్రి యొక్క విధి. మరియు వారు (సంతానం) పది సంవత్సరాల వయసుకు చేరుకుంటే ఈ విషయం మరింత గంభీరమవుతుంది. అపుడు వారు సలాహ్ ఆచరించుటలో అలసత్వం, సోమరితనం వహిస్తే వారిని దండించాలి; అలాగే ఆడపిల్లల మరియు మగపిల్లల పడకలు వేరు చేయాలి.
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబూ లైలా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను క’అబ్ ఇబ్న్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ను కలవడం జరిగింది. ఆయన “నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అన్నాడు. “ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు(సలాహ్ లో) “అత్తహియ్యాతు లిల్లాహి” పఠించే క్రమంలో “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని పఠించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సలాం ఏ విధంగా చేయాలో నేర్చుకున్న తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహబా – వారిపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించుటకు ఏమని పలకాలి అని వారిని ప్రశ్నించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించు విధానాన్ని, మరియు పలకాలో, దాని అర్థంతో సహా వారికి తెలియజేసారు. “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతిని కురిపించు, మరియు ఆయన కుటుంబము పై శాంతిని కురిపించు) అంటే దాని అర్థము: ఆయనను ఉత్తమమైన ప్రశంసలతో ఉత్తముల సమావేశాలలో (దైవదూతల సమావేశాలలో) ప్రస్తావించుట మరియు ఆయన ధర్మాన్ని అనుసరించిన వారిని గురించి, మరియు వారి దగ్గరి బంధువులలో విశ్వాసులైన వారి గురించి కూడా. “కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ” (ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం (అలైహిస్సలాం) పై మరియు ఆయ కుటుంబీకులపై శాంతిని కురిపించినావో) అంటే – ఏవిధంగానైతే నీవు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబానికి నీవు నీ అనుగ్రహాన్ని అందించినావో – అంటే ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్’హాఖ్, మరియు వారి వారసులు, మరియు వారి నమ్మకమైన అనుచరులు (విశ్వాసులు), కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మీ దయను, అనుగ్రహాన్ని ప్రసరింపజేయి. “ఇన్నక హమీదుమ్మజీద్” (నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు) అంటే దాని అర్థము: (ఓ అల్లాహ్!) నీవు స్వయంగా నీ ఉనికిలో, నీ గుణాలలో మరియు నీ చర్యలలో ప్రశంసించదగినవాడవు, మరియు నీ గొప్పతనం, అధికారం మరియు దాతృత్వంలో సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తి చెందినవాడవు. “అల్లాహుమ్మ, బారిక్ అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , వ అలా ఆలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కమా బారక్త, అలా ఇబ్రామీమ్ వ ఆలి ఇబ్రాహీమ్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో) అంటే దాని అర్థము: ఆయనకు శుభాలలో ప్రతి శుభాన్ని ప్రసాదించు, మహోన్నతమైన గౌరవాన్ని ప్రసాదించు, దానిని మరింతగా వృధ్ది గావించు, మరియు దానిని స్థిరపరుచు.
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేస్తున్నారు: సూరతుల్ ఫాతిహా పఠించబడని సలాహ్ (నమాజు) సరియైనది కాదు; ఎందుకంటే ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించుట సలాహ్ యొక్క అర్కాన్’లలో ఒక రుక్న్ (మూలస్థంభాలలో ఒక మూలస్థంభము).
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారము నాడు ‘శుక్రవారపు నమాజు’ కొరకు తొందరగా వెళ్ళుట ఎంత ఘనత కలిగిన విషయమో తెలియజేస్తున్నారు. ‘శుక్రవారపు నమాజు’ కొరకు మస్జిదునకు త్వరగా వెళ్ళుట అనేది సూర్యుడు పూర్తిగా ఉదయించిన వెంటనే ప్రారంభమై, ఇమాం మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు ఉంటుంది. ఈ సమయం మొత్తం ఐదు ఘడియలుగా ఉంటుంది. సూర్యుడు ఉదయించిన దగ్గరి నుండి ఇమాం మస్జిదులోనికి ప్రవేశించి ప్రసంగము ఇవ్వడానికి ‘మెంబరు’ (ప్రసంగ స్థలము) పై ఆశీనుడు అయ్యే వరకు మధ్యలో ఉన్న సమయం ఐదు భాగాలుగా విభజింపబడుతుంది. మొదటిది: ఎవరైతే ‘జనాబత్ గుస్ల్’ మాదిరిగా సంపూర్ణంగా ‘గుస్ల్’ చేసి (తలస్నానం చేసి), శుక్రవారపు నమాజు కొరకు ప్రత్యేకించబడిన మస్జిదునకు మొదటి ఘడియలో వెళతాడో, అతడు ఒక ఒంటెను (అల్లాహ్ ప్రసన్నత కొరకు) దానం చేసిన వానితో సమానం. రెండవది: ఎవరైతే రెండవ ఘడియలో వెళతాడో, అతడు ఒక ఆవును దానం చేసిన వానితో సమానం. మూడవది: ఎవరైతే మూడవ ఘడియలో వెళతాడో, అతడు కొమ్ములు కలిగిన ఒక మగ పొట్టేలును దానం చేసిన వానితో సమానం. నాలుగవది: ఎవరైతే నాలుగవ ఘడియలో వెళతాడో, అతడు ఒక కోడిని దానం చేసిన వానితో సమానం. ఐదవది: ఎవరైతే ఐదవ ఘడియలో వెళతాడో, అతడు ఒక గుడ్డును దానం చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం ‘ఖుత్బాహ్’ (శుక్రవారపు ప్రసంగం) ఇవ్వడానికి మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, మస్జిదు ద్వారముల వద్ద కూర్చుని ఉన్న దైవదూతలు – ఒక్కొక్కరుగా మస్జిదులోనికి ప్రవేశిస్తున్న వారి పేర్లను రాయడం ఆపి – అల్లాహ్ యొక్క స్మరణను, మరియు ప్రసంగాన్ని వినడానికి మస్జిదులోనికి వెళ్ళిపోతారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారపు నమాజుకు రావాలనుకునే వారు ‘జనాబత్ గుస్ల్’ చేసిన మాదిరిగా గుస్ల్ చేయాలని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘జనాబత్ గుస్ల్’ అంటే సంభోగానంతరం చేయు తలస్నానం.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే శుక్రవారమునాడు పరిపూర్ణంగా ఉదూ చేసుకుని, శుక్రవారపు నమాజుకు వెళ్ళి, ఇమాం యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) మౌనంగా ఉంటాడో, ఆ శుక్రవారానికీ మరియు రాబోయే శుక్రవారానికీ మధ్య అతని వలన జరిగే చిన్న చిన్న పాపాలన్నీ క్షమించివేయబడతాయి; అంతేకాకుండా దానికి మరో మూడు దినములు అదనంగా కలుపబడతాయి. కాని (ప్రసంగం మధ్యలో) అతడు ఒక చిన్న గులకరాయిని తాకినా, అతడు వ్యర్థమైన పనిలో పాల్గొన్న వానిగా లెక్కించబడతాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఉదూ యొక్క మూల స్తంభాలను (అర్కాన్ అల్ ఉదూ) పూర్తిగా ఆచరిస్తూ, దాని యొక్క సున్నత్ ఆచరణలను (సునన్ అల్ ఉదూ) మరియు విధివిధానాలను పూర్తిగా పాటిస్తూ, సంపూర్ణంగా ఉదూ చేసి శుక్రవారం నమాజునకు హాజరవుతాడో, మరియు ఇమాం యొక్క ‘ఖుత్బాహ్’ను శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) పనికిరాని వ్యర్థ సంభాషణ నుండి దూరంగా ఉంటాడో – అల్లాహ్ అతని పది రోజుల చిన్నచిన్న పాపాలను క్షమిస్తాడు; శుక్రవారం నమాజు నుండి మరో శుక్రవారం వరకు, మరియు అదనంగా మూడు రోజులు; ఎందుకంటే ఒక మంచి పనికి పది రెట్ల ప్రతిఫలం ప్రసాదించబడుతుంది గనుక. తరువాత ఇమాం ‘ఖుత్బాహ్’లో (ప్రసంగం లో) చెప్పే విషయాల పట్ల హృదయాన్ని లగ్నం చేయకుండా ఉండడాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు; అలాగే ప్రసంగం జరుగుతూ ఉండగా మస్జిదులో నేలపై గులకరాళ్ళను తాకడం, వాటిని ఏరడం మొదలైన వృధా కాలక్షేపం వంటి పనులకు పాల్బడడం పట్ల కూడా హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తారో (ఖుత్బాహ్ జరుగుతుండగా) వారు వ్యర్థమైన విషయాలలో పడిపోయిన వారుగా పరిగణించబడతారు, ఎవరైతే వ్యర్థమైన విషయాలలో పడిపోతారో వారికి శుక్రవారం యొక్క సంపూర్ణ పుణ్యఫలం లభించదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఆరాధన కొరకు గానీ, లేక ఙ్ఞానము సంపాదించుకొనుట కొరకు గానీ, లేక ఏవైనా ఇతర మంచి ప్రయోజనాల కొరకు గానీ, దినములో ఏ సమయములోనైనా – అంటే ఉషోదయం సమయాన గానీ, లేక సాయంత్రం సమయాన గానీ మస్జిదును సందర్శించే వాని కొరకు అల్లాహ్ స్వర్గములో ఒక నివాసాన్ని సిధ్ధం చేస్తాడు; ఈ ఘనత పగటిపూట గానీ, లేక రాతి వేళ గాని మస్జిదును సందర్శించిన వారికీ వర్తిస్తుంది. ఈ శుభవార్తను ఈ హదీథు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇస్తున్నారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ సలాం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి తరలి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూడడానికి తండోపతండాలుగా వెళ్ళారు. ప్రజలు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు” అని మూడు సార్లు అన్నారు. నేను వారితో కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడడానికి వచ్చాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడటానికి ప్రజలతో వచ్చాను; ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: “ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయనను చూడడానికి ఆయన వైపునకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన వైపు వెళ్ళిన వారిలో యూదపండితుడైన అబ్దుల్లా ఇబ్న్ సలామ్ (రదియల్లాహు అన్హు) ఒకరు (అప్పటికి ఆయన ఇస్లాం స్వీకరించలేదు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూసిన వెంటనే ఆయనలో కనిపించిన తేజస్సు, సౌందర్యం మరియు నిజమైన గాంభీర్యం కారణంగా ఆయన ముఖం అబద్ధాలు పలికేవాని ముఖం కాదని, అతనికి తెలిసిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి అతను విన్న మొదటి విషయం ఏమిటంటే, స్వర్గంలోనికి చేర్చే పనులు చేయమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను కోరినారు, వీటిలో: మొదటిది: ‘సలాం’ను (శాంతి శుభాకాంక్షలను) బహిరంగంగా వ్యాప్తి చేయుట; తరుచుగా సలాం చేయుట, తెలిసిన వారికైనా మరియు తెలియని వారికైనా. రెండవది: ఒక సదఖాగా (దాతృత్వరూపేణా), విందు రూపంలో; మరియు ఆతిథ్యం ద్వారా ప్రజలకు అన్నం తినిపించుట. మూడవది: మీ తండ్రి వైపు నుండి లేదా తల్లి వైపు నుండి మీకు రక్త సంబంధాలు లేదా బంధుత్వం ఉన్నవారితో బంధుత్వాలను, కుటుంబ సంబంధాలను కొనసాగించడం. నాలుగవది: ఐచ్ఛిక (స్వచ్చంద) ఆరాధన అయిన రాత్రి నమాజును (ఖియాముల్లైల్ నమాజును) ప్రజలు నిద్రిస్తున్న సమయాన ఆచరించుట.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు: సమాజంలో ప్రతి ముస్లింకు అతను శ్రద్ధ వహించాల్సిన మరియు విధిగా భరించాల్సిన బాధ్యత ఉంది. నాయకుడు లేదా పాలకుడు అల్లాహ్ తన బాధ్యతలో ఉంచిన వారిపై సంరక్షకుడు; వారి (ధార్మిక) చట్టాలను పరిరక్షించడం, వారికి ఎవరు అన్యాయం చేసినా వారి నుండి రక్షించడం, వారి శత్రువులతో పోరాడడం మరియు వారి హక్కులను వృధా చేయకపోవడం వంటి బాధ్యతలను కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తీ అతని కుటుంబంలోని వ్యక్తులందరి పట్లా బాధ్యత కలిగి ఉంటాడు; వారిని పోషించడం, వారి పట్ల దయతో వ్యవహరించడం, వారికి బోధించడం మరియు వారికి క్రమశిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలను కలిగి ఉంటాడు. ప్రతి స్త్రీ తన భర్త ఇంటిలో – అతని ఇంటిని చక్కగా నిర్వహించుకోవటం, ఉత్తమ రీతిలో అతని పిల్లల పెంపకం నిర్వహించడం వంటివి భార్యకు బాధ్యతగా ఉంటాయి. ఈ విషయంలో ఆమె జవాబుదారీగా ఉంటుంది. సేవకుడు (దాసుడు, బానిస), మరియు ఉద్యోగి తమ యజమానుల సంపదకు బాధ్యత వహిస్తారు, వారి ఆధీనంలో ఉన్న వాటిని భద్రపరచడం మరియు వారికి సేవ చేయడం మొదలైనవి వారి బాధ్యతగా ఉంటాయి. వారు దానికి జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తన ఆధీనంలో ఉంచబడిన వాటిపై సంరక్షకులుగా ఉంటారు మరియు ప్రతి ఒక్కరూ తన సంరక్షణలో ఉన్న వ్యక్తులకు బాధ్యత వహిస్తారు.