





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చున్నాము — మాతో అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు — అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లేచి నిలబడి నడిచిపోతూ మా మధ్య నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతసేపైనా ఆయన తిరిగి రాకపోవడంతో మేము ఆందోళనకు లోనయ్యాము. ఆయనకు ఏదైనా జరిగిందేమో అని భయపడ్డాము. మేము భయపడుతూ లేచి నిలిచాము. నేనే మొదట భయంతో స్పందించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతుకుతూ బయలుదేరాను. దారిలో బనూ నజ్జార్ తెగకు చెందిన ఒక అన్సారీ సాహాబీ తోట వద్దకు చేరుకున్నాను. ఆ తోట చుట్టూ తిరిగి, లోనికి ప్రవేశించడానికి ఏదైనా ద్వారం ఉందేమో అని చూశాను — కానీ ఏమి కనిపించలేదు. తోటకు బయట ఉన్న ఒక బావి నుండి తోట లోనికి నీళ్ళు ప్రవేశిస్తూ ఉన్న ఒక ప్రదేశం కనిపించింది. నేను బాగా క్రిందకు ఒదిగిపోయి ఆ ప్రదేశం గుండా లోనికి ప్రవేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అబూ హురైరహ్” అన్నారు; దానికి నేను “అవును ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం” అని జవాబు పలికాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. నేను “మీరు మాతో ఉన్నారు, ఆ తరువాత లేచి వెళ్లిపోయారు, ఎంత సేపైనా తిరిగి రాకపోయేసరికి మేము భయపడిపోయాం, మీకు ఏదైనా జరిగిందేమో అని. భయంతో అందరికంటే ముందు నేను మిమ్మల్ని వెదుకుతూ ఈ తోటకు వచ్చాను. అటు ప్రక్కనుంచి నక్క ప్రవేశించినట్లు నేను తోటలోనికి ప్రవేశించినాను. మిగతా వాళ్ళు నా వెనుక వస్తున్నారు” అన్నాను. ఆయన ﷺ, “ఓ అబూ హురైరా”, అని అన్నారు మరియు తన రెండు పాదరక్షలను నాకు అందజేసి, “ఈ రెండు పాదరక్షలతో వెళ్ళు. ఈ తోట చుట్టూ ఉన్న గోడ వెనుక నీవు ఎవరిని కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని తన హృదయంలో పూర్తి నిశ్చయతతో సాక్ష్యమిచ్చి నట్లైతే, అతనికి స్వర్గ ప్రవేశాన్ని గురించిన శుభవార్తనివ్వు” అన్నారు. నేను మొదటగా కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన అడిగారు “నీ చేతిలో ఆ రెండు పాదరక్షలు ఏమిటి ఓ అబూ హురైరహ్?” నేను సమాధానమిచ్చాను: “ఇవి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి పాదరక్షలు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంనన్ను వీటితో పంపారు. నేను కలిసిన ఎవరికైనా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) నా ఛాతీపై బలంగా మోదినారు. నేను వెల్లకిలా పడిపోయాను. ఆయన “వెనుకకు తిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు తిరిగివచ్చాను. నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను. నా వెనుకనే ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అడిగారు: “అబూ హురైరా! నీకు ఏమైంది?” “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చెప్పాను: “నేను ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిశాను. మీరు నాకు అప్పగించిన సందేశాన్ని ఆయనకు చెప్పాను. ఆయన నా ఛాతీపై బలంగా కొట్టారు, నేలపై పడిపోయాను. ఆయన: “ఓ అబూ హురైరహ్, తిరిగి వెళ్ళు” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ప్రశ్నించారు: “ఓ ఉమర్, నీవు ఇలా ఎందుకు చేశావు?” ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు: “ఓ రసూలుల్లాహ్! (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా తండ్రి మరియు తల్లి మీ కొరకు త్యాగం (ఖుర్బాన్) చేయబడుదురు గాక. మీరు నిజంగా అబూ హురైరాని మీ పాదరక్షలతో పంపినారా? ఎవరు కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” చెప్పినారా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అన్నారు. అపుడు ఉమర్ రజియల్లాహు అన్హు “అలా చేయవద్దు, (మంచి పనులు చేయడం వదిలివేసి) ప్రజలు ఆ ఒక్క వాక్యం పైనే భారం వేసి ఉండిపోతారేమోనని నాకు భయంగా ఉన్నది. వారిని మంచి పనులు చేయడం కొనసాగించనివ్వండి” అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అలాగే కానివ్వండి” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబాలతో కూర్చుని ఉన్నారు, వారిలో అబూబకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు. అంతలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి అక్కడినుండి బయలుదేరినారు. చాలా సేపటి వరకూ తిరిగి రాకపోయేసరికి శత్రువులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను పట్టుకుని ఉంటారా, లేక ఏమైనా చేసి ఉంటారా అని సహాబాలు భయపడినారు. ఈ ఆలోచనతో సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) భయంతో లేచి నిలబడినారు. అలా భయపడిన వారిలో మొదటి వాడు అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు). ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వెదుకుతూ బనూ నజ్జార్ తెగకు చెందిన ఒన్ అన్సారీ సాహబీ తోట వద్దకు చేరుకున్నాడు. అందులోనికి ప్రవేశించడానికి ఏదైనా దారి ఉందా అని ఆ తోట చుట్టూ తిరిగినాడు. కానీ అతనికి ఏ దారీ కనిపించలేదు. అయితే తోట చుట్టూ ఉన్న గోడలో ఒక చోట చిన్న దారి గుండా నీళ్ళు లోనికి ప్రవేశిస్తూ ఉండడం గమనించినాడు. ఆయన బాగా ఒదిగి ఆ దారి గుండా తోట లోనికి ప్రవేశించి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను చూచినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిదీ, అబూ హురైరాహ్ నువ్వేనా?” అని ప్రశ్నించినారు. ఆయన “అవును” అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. దానికి అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరు మా మధ్యన ఉండినారు. లేచి నిలబడి బయలుదేరి వెళ్ళినారు. ఎంతసేపైనా మీరు తిరిగి రాలేదు. మీతో సంబంధం తెగిపోతుందేమో అని భయపడినాము. అలా భయపడిన వారిలో నేను మొదటి వాడిని. అలా మిమ్మల్ని వెదుకుతూ ఈ తోట గోడ వద్దకు చేరుకున్నాను, బాగా ఒదిగి పోయి నక్క మాదిరిగా ఇందులోనికి ప్రవేశించినాను. మిగతా వారు నావెనుక వస్తున్నారు.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్యవంతుడని సంకేతంగా, గుర్తుగా ఆయనకు తన పాదరక్షలు ఇచ్చినారు – (అక్కడి నుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ ఇతరులకు చెప్పబోయేదంతా నిజమే అనడానికి తన గుర్తుగా, సూచనగా). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో ఇలా అన్నారు: “ఈ నా పాదరక్షలతో తిరిగి వెళ్ళండి, ఈ గోడ అవతల – “అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా, అతనిలో ఈ గుణవిశేషణాలు ఉంటే, అతడు స్వర్గ నివాసులలో ఒకడు అనే శుభవార్తను అతనికి వినిపించు.” అక్కడినుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ మొట్టమొదట కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన “ఈ పాదరక్షలు ఏమిటి, ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. దానికి ఆయన “ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాదరక్షలు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని నాకిచ్చి పంపించినారు - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని” అని జవాబిచ్చినాడు. అది విని ఉమర్ (రదియల్లాహు అన్హు), అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఛాతీ పై బలంగా మోదినారు, దానితొ ఆయన వెల్లకిలా పడిపోయినారు. ఉమర్ రదియల్లాహు అన్హు “వెనుదిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అబూ హురైరహ్ ఇలా అన్నారు “నేను వెనుదిరిగి భయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వద్దకు వెళ్ళినాను. నేను ఏడుస్తూ ఉన్నాను. ఉమర్ (రదియల్లాహు అన్హు) నా వెనుకనే నడుచుకుంటూ వచ్చినారు.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమైంది నీకు ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. నేను “నేను మొదటగా ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిసినాను. మీరు ఏమి చెప్పమన్నారో అది ఆయనకు చెప్పినాను. ఆయన నా ఛాతీ పై బలంగా మోదినారు, నేను వెల్లకిలా పడిపోయినాను. ఆయన “వెనుదిరిగి వెళ్ళు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎందుకు అలా చేసారు ఓ ఉమర్?” అని ప్రశ్నించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “నా తల్లిదండ్రులు మీకొరకు త్యాగం చేయబడుదురుగాక ఓ ప్రవక్తా! మీరు అబూ హురైరహ్ కు మీ పాదరక్షలనిచ్చి పంపించినారా - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని?” అని అడిగినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును” అన్నారు. అపుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) “అలా చేయకండి, ప్రజలు ఈ మాటలపైనే భారం వేసి, ఆచరణలను ఆచరించడం వదిలివేస్తారేమో అని భయంగా ఉంది నాకు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే వారిని అలాగే వదిలివేయండి” అన్నారు.
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస్తున్నారు. అతను వారిని అవమానించడు, తిట్టడు లేదా వెన్నుపోటు పొడవడు మరియు తన నాలుకతో వారిని బాధించడు. అలాగే సహచర ముస్లిములు అతని చేతి నుండి కూడా సురక్షితంగా ఉంటారు – అంటే అతడు వారిపై దాడి చేయడు, వారి సంపదలను అన్యాయంగా, అధర్మంగా కబళించడు; లేక ఆవిధమైన ఏ పనీ చేయడు. అలాగే ‘ముహాజిరు’ అంటే అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదలివేసే వాడు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే ముఅజ్జిన్ అదాన్ పలుకుట పూర్తి అయిన తరువాత ఈ క్రింద తెలుపబడిన విధంగా పలుకుతాడో: (అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతి) - ఓ అల్లాహ్! ఈ పిలుపునకు ప్రభువా! అంటే ఇవి అల్లాహ్ను ఆరాధించడానికి మరియు నమాజు చేయడానికి ప్రజలను పిలవడానికి ఉపయోగించే అదాన్ పదాలు. వాటి ద్వారానే నమాజు కొరకు పిలుపు ఇవ్వబడుతుంది. (అత్’త్తామ్మతి) – అత్యంత పరిపూర్ణమైన (పిలుపు); అత్యంత పరిపూర్ణమైనది అంటే, తౌహీద్ (ఏకదైవత్వం) యొక్క పిలుపు మరియు దైవిక సందేశం; (వస్సలాతిల్ ఖాఇమహ్) మరియు స్థాపించబడబోయే ఈ నమాజు, అంటే, ఆ ఆరాధన నిరంతరం ఆచరించబడునటువంటిది, మరియు ప్రస్తుతం ప్రారంభించబడబోతున్నటువంటిది; (ఆతి) ఓ అల్లాహ్! ప్రసాదించు; (ముహమ్మదన్ అల్ వసీలత) అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానాన్ని ప్రసాదించు; (అల్ ఫజీలత) అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఔన్నత్యాన్ని ప్రసాదించు, అంటే తీర్పు దినమున సృష్టిరాశులలో వాటన్నింటి స్థాయిల కంటే అత్యంత ఉన్నతమైన స్థాయిని ప్రసాదించు; (వబ్’అథ్’హు) ఆయనకు ప్రసాదించు, (మఖామన్ మహ్’మూదన్) శ్రేష్ఠమైన, ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నతమైన స్థానము, అక్కడ నిలబడిన వాడు ప్రశంసించబడతాడు, అంటే అది పునరుత్థాన దినమున సిఫారసు చేసే అన్నింటి కంటే గొప్ప అవకాశం, (అల్లదీ వఅద్’తహు) నీవు దేనినైతే ఆయనకు ప్రసాదించుటకు వాగ్దానం చేసినావో; దివ్య ఖుర్’ఆన్’లో, ఓ అల్లాహ్ నీవు పలికిన మాటల ప్రకారం { عَسَىٰٓ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًۭا مَّحْمُودًۭا } (…నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామమ్ మ'హ్మూద్) నొసంగవచ్చు!) – ఆ ప్రశంసనీయమైన స్థానమును ఆయనకు ప్రసాదించు.” ఈ దుఆను ఎవరైతే పఠిస్తారో వారు పునరుత్థాన దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సిఫార్సుకు అర్హులు అవుతారు.
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను అవమానించడాన్ని - ముఖ్యంగా ముహాజిర్ మరియు అన్సార్ సహాబాలలో ‘సాబిఖూనల్ అవ్వలీన్’ సహాబాలను అవమానించడాన్ని- వారి పట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు: ప్రజలలో ఎవరైనా ఉహుద్ పర్వతానికి సమానమైన మొత్తంలో బంగారాన్ని ఖర్చు చేసినా, అతని ప్రతిఫలం తన సహాబాలలో ఒకరు ఖర్చు చేసిన ఒక “ముద్” లేదా కనీసం దానిలో సగం ఖర్చు చేసిన దాని ప్రతిఫలానికి కూడా చేరదు. ఇలా ఎందుకంటే, ఇస్లాం పట్ల సహాబాల యొక్క చిత్తశుధ్ధి, వారి సంకల్పాలలో నిజాయితీ, మక్కా విజయాని ముందు ఇస్లాం కు అత్యంత అవసరమైన సమయాలలో ఇస్లాం కొరకు వారు చేసిన ఖర్చు, వారి త్యాగాలు, ఇస్లాం కొరకు వారు చేసిన యుద్ధాలు. ఇవన్నీ ‘సాబిఖూనల్ అవ్వలీన్’ సహాబాలను, తరువాత తరువాత ఇస్లాం లోకి ప్రవేశించిన వారి కంటే ఉన్నత స్థానాలలో నిలబెడతాయి. ఒక “ముద్” అంటే ఓ మోస్తరుగా ఎదిన వ్యక్తి యొక్క దోసిట నిండుగా పట్టేటంత మొత్తము. సాబిఖూనల్ అవ్వలీన్: ఇస్లాం తొలి దినాలలో ఇస్లాం పట్ల తీవ్ర వ్యతిరేకత, ఇస్లాం స్వీకరించి ముస్లిములుగా మారుతున్న వారి పట్ల పీడన, దౌర్జన్యం, వారిని అమానవీయ శిక్షలకు గురిచేయబడుతున్న అటువంటి అత్యంత క్లిష్ట సమయం లోనూ ముందడుగు వేసి ఇస్లాం స్వీకరించి, ఇస్లాంకు దన్నుగా నిలిచిన సహాబాలు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”
అహ్మద్ నమోదు చేసినారు మరియు దీని మూలం సహీహ్ ముస్లింలో ఉందిఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: హిజ్రీ రెండవ సంవత్సరంలో జరిగిన బదర్ యుద్ధంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి పోరాడిన లేదా హిజ్రీ ఆరవ సంవత్సరంలో రిద్వాన్ ప్రతిజ్ఞతో కూడిన హుదైబియా ఒప్పందంలో పాల్గొన్న ఎవరైనా నరకంలో ప్రవేశించరని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ యొక్క ప్రవక్తలూ మరియు సందేశహరుల తరువాత అబూబక్ర్ అస్సిద్దీఖ్ మరియు ఉమర్ అల్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ ప్రజలు అందరిలోకెల్లా ఉత్తములు, అలాగే స్వర్గములోనికి ప్రవేశించే వారందరిలోకెల్లా కూడా ఉత్తములు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో అలీ బిన్ అబీ తాలిబ్ మరియు తన కుమార్తె ఫాతిమా (రదియల్లాహు అన్హుమ్)ల సంతానమైన అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా)లు, ఎవరైతే ఈ ప్రపంచములో యవ్వనంలో చనిపోయి అల్లాహ్ అనుగ్రహముతో స్వర్గములో ప్రవేశిస్తారో వారందరికీ నాయకులుగా ఉంటారు అని అన్నారు. లేక దీని అర్థము వారిద్దరూ స్వర్గములో యువకులందరికీ నాయకులుగా ఉంటారు అని కూడా కావచ్చు; అయితే ప్రవక్తలు, సందేశహరులు మరియు ఖులఫా అర్’రాషిదీన్ లకు తప్ప.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "నిశ్చయంగా, మీలో ఒకరు మరణించినప్పుడు, అతనికి ఉదయం మరియు సాయంత్రం అతని స్థానం చూపబడుతుంది. అతను స్వర్గవాసులలో ఉంటే, అతనికి స్వర్గంలో అతని స్థానం చూపబడుతుంది, మరియు అతను నరకవాసులలో ఉంటే, అతనికి నరకంలో అతని స్థానం చూపబడుతుంది. అతనితో ఇలా అనబడుతుంది: అల్లాహ్ తీర్పు రోజున మిమ్మల్ని పునరుత్థానం చేసే వరకు ఇది మీ స్థానం."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక దాసుడు మరణించినప్పుడు, రోజు ప్రారంభంలో మరియు చివరిలో అతని నివాస స్థలం మరియు స్వర్గం లేదా నరకంలో అతని నిర్దిష్ట స్థానం అతనికి చూపబడుతుంది - అతను స్వర్గవాసులలో ఉంటే స్వర్గంలో అతని స్థానం, మరియు అతను నరకవాసులలో ఉంటే నరకంలో అతని స్థానం. మరియు అతనికి ఇలా చెప్పబడుతుంది: పునరుత్థాన దినాన మీరు తిరిగి లేపబడే మీ స్థానం ఇదే. ఇది విశ్వాసికి సంత్వనము, సౌఖ్యము నిస్తుంది మరియు అవిశ్వాసికి శిక్షగా ఉంటుంది.
తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను: “రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు; తద్వారా గౌరవనీయులకు గౌరవాన్ని ప్రసాదిస్తూ, అవమానకరమైన వారిని అవమానం పాలు చేస్తూ; ఇక్కడ గౌరవం అంటే ఇస్లాం ద్వారా కలుగజేయబడే గౌరవం; మరియు అవమానం అంటే అవిశ్వాసం ద్వారా కలుగజేయబడే అవమానం.” తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: “వాస్తవంలో నా కుటుంబ సభ్యులలోనే ఇలా జరగడం నాకు తెలుసు. వారిలో ఇస్లాం స్వీకరించిన వారికి వాస్తవంగా శుభాలు, గౌరవం మరియు కీర్తి లభించాయి; మరియు వారిలో ఎవరైతే సత్యతిరస్కారులై, అవిశ్వాసులుగా ఉండిపోయారో, వాస్తవములో వారు అధోగతి పాలై, అవమానం పాలై, ‘జిజియా’ చెల్లించే స్థితిలో ఉండిపోయారు.”
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేస్తున్నారు: భూమి యొక్క అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం వ్యాపిస్తుంది, రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో, ఈ ధర్మం అక్కడి వరకు చేరుకుంటుంది అని. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టకుండా ఏ ఇంటినీ వదిలి పెట్టడు, పట్టణాలలో, గ్రామాలలో, ఎడారిలో లేదా అరణ్యంలో ఎక్కడైనా సరే. ఎవరైతే ఈ ధర్మాన్ని అంగీకరించి, స్వీకరిస్తారో, దానిని విశ్వసిస్తారో వారు (అల్లాహ్) ఇస్లాంకు ప్రసాదించే గౌరవంతో గౌరవించబడతారు, మరియు ఎవరైతే దానిని తిరస్కరిస్తారో, మరియు ఆ ధర్మాన్ని విశ్వసించరో, అలాంటి వారు అవమానానికి, పరాభవానికి గురిచేయబడతారు. ఈ హదీసు ఉల్లేఖించిన సహాబీ తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన నిజమవడాన్ని తాను చూశానని, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో - ఎవరైతే ఇస్లాం స్వీకరించినాడో, అతడు మంచితనం, గౌరవం మరియు కీర్తిని పొందాడు, మరియు ఎవరైతే అవిశ్వాసిగానే మిగిలి పోయాడో, అతడు ముస్లింలకు జీజియాగా డబ్బు చెల్లించవలసి రావడంతో పాటు, అవమానానికి మరియు పరాభవానికి గురయ్యాడు.