





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి».
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినది ఏమిటంటే, ఎవరైతే ఇస్లాం ధర్మం యొక్క బహిరంగ ఆచారాలకు కట్టుబడి, మనలా నమాజు చేస్తాడో, మన ఖిబ్లా అయిన కఅబహ్ వైపునకు అభిముఖుడవుతాడో మరియు మనం జిబహ్ చేసిన దానిని ధర్మసమ్మతమైనదిగా భావించి తింటాడో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క రక్షణ మరియు వాగ్దానం ఉంది. కాబట్టి అతని విషయంలో అల్లాహ్ యొక్క రక్షణ మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించకండి.
ఉమ్మె సలమహ్, ఉమ్ముల్ మూ’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి), (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.” ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు వలస వెళ్ళిన ప్రాంతానికి మొట్టమొదట తన కుటుంబంతో సహా వలస వెళ్ళిన వారు అబూ సలమహ్; ఆయనకంటే ఉత్తములు ఎవరుంటారు?” అనుకుని ఈ దుఆ పఠించాను. ఆయన స్థానములో అల్లాహ్ నాకు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా), రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా విన్నాను అని అన్నారు: ఏదైనా ఆపద లేక కీడు వచ్చిపడిన ఎవరైనా ముస్లిం, అల్లాహ్ సిఫార్సు చేసిన విధంగా ఇలా అంటాడో: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156 - నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము); (అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ) ఓ అల్లాహ్! నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, నేను సహనం వహించినందుకు గాను; మరియు నాకు కలిగిన ఈ నష్టాన్ని (వ అఖ్’లిఫ్ లీ) పూరించు, (ఖైరమ్’మిన్హా) దాని స్థానములో దానికంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించడం ద్వారా. (ఎవరైతే ఇలా వేడుకుంటారో) అల్లాహ్ అతనికి దానికంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాడు తప్ప మరేమీ కాదు. ఆమె ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “అబూ సలమహ్ కంటే ఉత్తముడు ఎవరుంటారు; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వలస వెళ్ళిన దగ్గరికి, అబూ సలమహ్ తన కుటుంబముతో సహా వలస వెళ్ళినవాడు – అనుకున్నాను. కానీ అల్లాహ్ సహాయంతో నేను ఆ పలుకులు పలికినాను. అబూ సలమహ్ స్థానములో అల్లాహ్ నాకు అతనికంటే ఉత్తముడైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు సమయంలో బిలాల్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: “బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలలో అతడిని స్వర్గంలో ఉన్నట్లు చూశారు. అప్పుడు ఆయన బిలాల్ ఇబ్న్ రబాహ్ రదియల్లాహు అన్హును చూసి ఇలా అడిగారు: 'ఇస్లాంలో నీవు చేసిన అత్యంత ఆశాజనకమైన ఐచ్ఛిక (నఫిల్) ఆచరణ ఏమిటో నాకు చెప్పు. ఎందుకంటే, నేను స్వర్గంలో నీవు నడుస్తున్నప్పుడు నీ చెప్పుల యొక్క మెల్లని శబ్దాన్ని నేను విన్నాను. బిలాల్ ఇలా చెప్పారు: నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో ఏ గడియలోనైనా ఉదూ భంగమైన వెంటనే మరలా ఉదూ చేసుకుని, ఆ తర్వాత ఆ ఉదూతో నా ప్రభువు కొరకు, నా అదృష్టంలో వ్రాసి ఉన్నన్ని సాధారణ నఫిల్ నమాజులు ఆచరించాను.
అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒకవేళ నేను రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నుండి ఏమైనా ఉల్లేఖిస్తున్నట్లైతే, వారి గురించి అసత్యం పలకడం కన్నా ఆకాశం నుండి భూమిపై పడిపోవడాన్ని ఇష్ట పడతాను. కానీ మీకూ నాకూ మధ్య ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నట్లైతే, నిశ్చయంగా యుధ్ధమంటేనే తంత్రము మరి. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ప్రపంచపు చివరి కాలము లో, వయస్సులో చిన్నవారు మరియు బుద్ధిలో మూర్ఖులు అయిన ఒక ప్రజ పుట్టుకొస్తుంది. వారు (తమ వాదనలో) అందరికంటే ఉత్తమమైన ప్రసంగాన్ని (అంటే ఖురాన్) ఉపయోగిస్తారు; వేట జంతువు శరీరం నుండి బాణం దూసుకు పోయిన విధంగా వారు ఇస్లాం నుండి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, తీర్పు దినమున, వారిని చంపిన వారికి ప్రతిఫలం గా మారుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅమీరుల్ ము’మినీన్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: “నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమైనా ఉల్లేఖిస్తున్నట్లు మీరు విన్నట్లైతే, నేను భావగర్భితముగా అలంకారిక భాషను ఉపయోగించను, లేదా సూచనల రూపములో అస్పష్టమైన ప్రకటనలు చేయను; లేదా విషయాన్ని పరోక్షంగా చెప్పను. నిశ్చయంగా నేను స్పష్టంగా మాత్రమే మాట్లాడుతాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఉల్లేఖిస్తూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అసత్యాలు పలకడం కంటే నేను ఆకాశం నుండి భూమిపై పడిపోవడం నాకు సులభమైనది మరియు తేలికైనది. అయితే, నాకు మరియు ప్రజలకు మధ్య ఉన్న విషయాల గురించి నేను మాట్లాడితే, మరి యుద్ధమంటేనే తంత్రము; నేను అలంకారిక భాష, సూచనలు లేదా ద్వంద్వ అర్థ ప్రకటనలను ఉపయోగించవచ్చు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: కాలం చివరలో, ఒక యువత వస్తుంది, వారు వయస్సులో చిన్నవారై ఉంటారు మరియు తెలివితేటలలో బలహీనంగా ఉంటారు. వారు ఖురాన్ నుండి పదాలను ఉటంకిస్తూ ఉంటారు, ఖుర్’ఆన్ ను తరచుగా పఠిస్తారు, కానీ బాణం దాని లక్ష్యం గుండా దూసుకు వెళ్ళినట్లుగా వారు ఇస్లాంను విడిచిపెట్టి దాని హద్దులను అతిక్రమిస్తారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, పునరుత్థాన దినమున, చంపిన వానికి ప్రతిఫలంగా మారుతుంది.
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల నుండి మూడు లక్షణాలను ఇష్టపడతాడని మరియు వారిలో మూడు లక్షణాలను ఇష్టపడడు అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేశారు. వారు ఆయన ఏకత్వాన్ని ధృవీకరించుట మరియు ఆయనతో దేనినీ సమానులుగా చేయకుండా ఉండుట; వారు అల్లాహ్ యొక్క నిబంధనకు, ఖురాన్‌కు మరియు ఆయన ప్రవక్త (స) సున్నత్‌కు కట్టుబడి ఉండుట మరియు వారు ముస్లిం సమాజం నుండి విడిపోకుండా ఐకమత్యంగా ఉండుట. ఆయన వారి కొరకు ఇష్టపడని విషయాలు: వారికి సంబంధం లేని విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడటం; జరగని విషయాల గురించి ప్రశ్నించడం; ఇతరుల వద్ద ఉన్న దానిని గురించి, ఉదా: డబ్బును గురించి, లేదా అవసరం లేని వాటిని ప్రజల నుండి అడగడం; (అంటే అవసరం ఉన్నా లేకపోయినా అడుక్కొనుట, బిచ్చమెత్తుట); లేదా దేనిగురించైనా అతిగా ప్రశ్నించుట; డబ్బును వృధా చేయడం, దాని చట్టబద్ధమైన ఉపయోగాలకు భిన్నంగా ఖర్చు చేయడం మరియు సంపదను నష్టానికి గురి చేయడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్‌అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుముస్లిములను భయపెట్టడానికి లేదా వారిని దోచుకోవడానికి, వారికి నష్టం కలిగించడానికి ఎవరైతే ఆయుధాలను ఎత్తుతారో వారికి వ్యతిరేకంగా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిస్తున్నారు. అన్యాయంగా, అధర్మంగా ఎవరైతే అటువంటి పనికి పాల్బడుతారో అటువంటి వాడు ఘోరాతి ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. అటువంటి వాడు ఈ కఠినమైన హెచ్చరికకు పాత్రుడవుతాడు.
ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అతడు నల్ల రాయి (కాబాగృహపు ఒక మూలలో ఉన్న హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని ఇలా అన్నాడు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, మోమినుల నాయకుడు, కాబాగృహం ఒక మూలలో ఉన్న నల్ల రాయి (హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని, ఆ తర్వాత ఇలా అన్నారు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం చేకూర్చలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దుపెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అంత్యక్రియలు (గుసుల్) నిర్వహించి, మనుషులు జనాజాను భుజాలపై మోసినప్పుడు, అది ధర్మబద్ధంగా ఉంటే, ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి", కానీ అది ధర్మబద్ధంగా లేకపోతే, ఇలా అంటుంది: "ఎంత దుఃఖం! వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?" మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ దాని మాటలు వింటాయి మరియు ఒకవేళ మనిషి దానిని వినగలిగితే, అతడు స్పృహ తప్పి పడిపోతాడు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "మరణించిన వ్యక్తిని జనాజా మీద పెట్టి, ప్రజలు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు — ఒకవేళ ఆ వ్యక్తి సజ్జనుడైతే, తన ముందున్న ఆనందకరమైన దాన్ని చూడటం వలన, మృతదేహం ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి!" ఒకవేళ ఆ వ్యక్తి దుష్టుడైతే, ఎదురుగా ఉన్న శిక్షను చూసి, భయంకరమైన స్వరంతో ఇలా అరుస్తుంది: "అయ్యో! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు!" ప్రతి జీవి దాని స్వరాన్ని వింటుంది - మనిషి తప్ప. ఒకవేళ మానవుడు ఆ స్వరం వింటే, దాని తీవ్రత వలన అతను మూర్ఛపోతాడు.
రసూలల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని మిఖ్దాద్ బిన్ అస్వద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: ప్రళయ దినాన, సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు — కేవలం ఒక "మీల్" అంత దూరంలో మాత్రమే ఉంటాడు. సులైమ్ బిన్ ఆమిర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన 'మీల్' అంటే భూమిపై మైలు దూరమా లేక కాటుకను కంటికి పెట్టే చిన్న 'మీల్' అని అర్థమా నాకు తెలియదు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలను బట్టి చెమటలో మునిగి ఉంటారు. వారిలో కొందరికి చెమట కాలి చీలమండలము వరకూ, కొందరికి మోకాళ్ల వరకూ, కొందరికి నడుము వరకూ, మరి కొందరికి చెమట నోటిదాకా ఉంటుంది." అని పలుకుతూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో తన నోటివైపు చూపించారు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రళయ దినాన సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు. వారి తలలకు కేవలం ఒక మైలు (మీల్) దూరంలో మాత్రమే ఉంటాడు. తాబియీ తరానికి చెందిన సులైమ్ బిన్ ఆమిర్ ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్న 'మీల్' అంటే, ఆయన భూమిపై మైలు దూరాన్ని ఉద్దేశించారా, లేక కంటికి కాటుక (సుర్మా) పెట్టే చిన్న కడ్డీని ('మీల్') ఉద్దేశించారా అనేది నాకు అర్థం కాలేదు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రళయ దినాన ప్రజలు తమ తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి ఉంటారు. వారిలో కొందరికి చెమట కాలి చీలమండలముల వరకూ ఉంటుంది, కొందరికి మోకాళ్ల వరకూ, మరికొందరికి నడుము వరకూ, ఇంకొంతమందికి చెమట నోటిదాకా చేరి, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో తన నోటివైపు చూపించారు.