





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “ఓ రసూలల్లాహ్! మేము సముద్రంపై ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట పరిమితంగా మంచి నీళ్ళు తీసుకు వెళుతాము. మేము ఆ నీటితో ఉదూ గానీ, గుసుల్ గానీ చేసినట్లయితే (నీళ్ళు అయిపోయి) మేము దాహంతో బాధపడ వలసి వస్తుంది. మరి మేము సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయవచ్చునా?” దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: మేము సముద్రంపై నావలలో, పడవలలో వ్యాపారం నిమిత్తం, చేపలు పట్టే నిమిత్తం ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట త్రాగడానికి కొద్దిపాటి మంచి నీళ్ళు తీసుకువెళతాము. మేము ఈ మంచి నీళ్ళను ఉదూ చేయడానికి, లేదా గుసుల్ చేయడానికి ఉపయోగించినట్లయితే మా వద్ద త్రాగడానికి మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది; ఇంక మాకు ఏమీ లభించదు. సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయుటకు మాకు అనుమతి ఉన్నదా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సముద్రపు నీటిని గురించి ఇలా అన్నారు: “దాని నీరు పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధ పరుచునటువంటిది. దానితో ఉదూ మరియు గుసుల్ చేయుట అనుమతించబడినది; మరియు సముద్రం నుండి బయటకు తీసుకురాబడే (సముద్రంలో లభించే) దేనినైనా, ఉదాహరణకు చేపలు, వేల్ చేప వంటి జంతువులు మొదలైనవి, వాటిని పట్టుకొనడానికి ముందే అవి చనిపోయి సముద్రపు నీటిపై తేలియాడుతూ ఉన్నప్పటికీ, వాటిని తినుటకు అనుమతి ఉన్నది (హలాల్).
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను పశువులు మరియు వేటాడే జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటిని గురించి (వాటిని ఉపయోగించ వచ్చునా) అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జంతువులు మరియు క్రూర జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటి వనరులలోని నీటి పరిశుద్ధత గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒకవేళ ఆ నీరు “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి), అంటే దాదాపు 210 లీటర్లకు సమానంగా ఉంటే అది పెద్ద మొత్తంలో ఉన్న నీరుగా భావించబడుతుంది; అది మాలిన్యాన్ని గ్రహించదు, అశుద్ధత కారణంగా ఆ నీటి మూడు లక్షణాలైన రంగు, రుచి, వాసనలలో ఏ ఒక్క లక్షణమైనా మారనంత వరకు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హితబోధ చేస్తున్నారు: ఎవరైతే నిద్రలేస్తారో వారు ముక్కును నీటితో మూడుసార్లు శుభ్రపరుచుకోవాలి. ముక్కును నీటితో శుభ్రపరుచుకోవడం అంటే, ముక్కులోనికి నీరు ఎక్కించి తరువాత ఆ నీటిని చీది వేయడం. ఎందుకంటే షైతాను అతని ముక్కు పుటాల మీద రాత్రి గడుపుతాడు కనుక; అంటే పూర్తి ముక్కుపై.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నాకు ఈ విషయం తెలియజేసినారు: “ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే వుజూ ముగించి వచ్చిన ఒక వ్యక్తి ని చూసారు. అతడు తన పాదం పై ఒక గోరు అంత పరిమాణం గల భాగాన్ని కడగకుండా వదిలేసాడు. ఆ భాగానికి వుజూ నీరు చేరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతని నిర్లక్ష్యం కారణంగా (నీరు చేరకుండా) ఉండిపోయిన భాగం వైపునకు చూపుతూ అతనితో ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను ఉత్తమంగా ఆచరించి పూర్తి చేయి, ప్రతి భాగానికి దానికి చేరవలసిన నీరు చేరేలా చేయి.” కనుక అతడు తిరిగి వెళ్ళి, (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా) వుజూ పూర్తి చేసి, అప్పుడు నమాజు ఆచరించాడు.
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథు ద్వారా మనకు తెలుస్తున్న విషయం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్ గుస్ల్ స్నానము’ ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో పూర్తి చేసేవారు, అలాగే ఉదూను కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో పూర్తి చేసేవారు. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’ లకు సమానం. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరు ఎదిగిన వ్యక్తి యొక్క ఒక దోసిలి నిండా పట్టేటంత పరిమాణానికి సమానము.
ఉఖ్’బా ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మాకు ఒంటెలను మేపుకు వచ్చే పని ఇవ్వబడింది. నా వంతు వచ్చినపుడు నేను వాటిని ఆరుబయట బయళ్లలో మేపుకుని సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాటల నుండి నేను ఇది గ్రహించాను: “ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది).” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు రెండు గొప్ప ధార్మిక ఆచరణలను వివరించారు: మొదటిది: ఎవరైతే ఉదూను ఆచరిస్తాడో మరియు దానిని చక్కగా, పూర్తిగా, సంపూర్ణంగా మరియు నిర్దేశించిన పద్ధతిలో పరిపూర్ణం చేసి, ప్రతి అవయవానికి దానికి తగిన మొత్తంలో నీటిని అందజేసి, అప్పుడు ఇలా: “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువ బడుతాయి. ఏ ద్వారము ద్వారా కోరుకుంటే ఆ ద్వారము నుండి అతడు స్వర్గములోనికి ప్రవేశించవచ్చు.” రెండవది: ఎవరైతే ఉదూ చేయునపుడు ఉదూను పూర్తిగా, సంపూర్ణంగా ఆచరించి, తరువాత నిలబడి, రెండు రకాతులను, హృదయపూర్వకంగా మరియు వినయముతో వాటి వైపునకు తిరిగి, అతడి ముఖాన్ని మరియు శరీరంలోని అన్ని అవయవాలను అల్లాహ్ కే (ఆయన ఆరాధనకే) సమర్పించుకుని ఆచరిస్తాడో, స్వర్గం అతని కొరకు విధి (వాజిబ్) చేయబడుతుంది.
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
దారు ఖుత్నీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఉదూ చేసిన తరువాత ఒక ముస్లిం తన రెండు పాదాలకు “ఖుఫ్ఫైన్” తొడుగుకున్నట్లయితే; తరువాత ఒకవేళ ఉదూ భంగపడినట్లయితే, తిరిగి ఉదూ ఆచరించునపుడు అతనికి ఇష్టమైతే “ఖుఫ్ఫైన్” ను పాదాల నుంచి తొలగించకుండా వాటిపైన తడిచేతులతో మసహ్ చేసి (తడిచేతులతో తడిమి) వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించవచ్చు. ఈ విధంగా అతడు “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోను కానంత వరకు, ఒక నియమిత కాలం వరకు చేయవచ్చు. జనాబత్ స్థితికి లోనైతే మాత్రం ఖుఫ్ఫైన్’ను కాళ్ళ నుండి తొలగించి అతడు గుసుల్ చేయవలసి ఉంటుంది.
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఈద్ అల్ అద్’హా దినమునాడో లేదా ఈద్ అల్ ఫిత్ర్ దినమునాడో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (ఈద్) నమాజు ఆచరించుటకు నమాజు ఆచరించు ప్రదేశానికి బయలుదేరినారు. దారిలో వారు ఒక స్త్రీల గుంపును దాటుకుంటూ వెళ్ళినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా పలికినారు: “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”. దానికి వారు “మా ధర్మములో మరియు వివేకములో ఉన్న లోపం ఏమిటి?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగినారు: “(షరియత్’లో) ఒక స్త్రీ సాక్ష్యము, పురుషుని సగం సాక్ష్యానికి సమానం కాదా? (అంటే ఇద్దరు స్త్రీల సాక్ష్యము ఒక పురుషుని సాక్ష్యమునకు సమానము కాదా?”) దానికి వారు “అవును” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది వివేకములో ఆమె లోపము. అలాగే స్త్రీ బహిష్ఠు స్థితిలో ఉన్నపుడు ఆమె నమాజు ఆచరించదు, ఉపవాసము పాటించదు, అవును కదా?” అని ప్రశ్నించారు. దానికి వారు “అవును” అని సమాధానం ఇచ్చినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది ధర్మములో ఆమె కొరత” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకసారి ఈద్ దినమునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజు ఆచరించుటకు, నమాజు ఆచరించే ప్రదేశానికి బయలుదేరినారు. ఆ సందర్భముగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలకు ప్రత్యేక ప్రసంగం ఇస్తానని వాగ్దానం చేశారు మరియు ఆ రోజున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: “ఓ స్త్రీలారా! ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండండి, ఎక్కువగా క్షమాభిక్ష కొరకు అల్లాహ్’ను అర్థిస్తూ ఉండండి; పాపముల పరిహారం కొరకు ఉన్న సాధనాలలో అవి గొప్పసాధనాలు; ఎందుకంటే ఇస్రా ప్రయాణపు రాత్రి నరకవాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను.” అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించినది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “చాలా విషయాలలో మీరు తిట్లు తిడతారు, శాపనార్థాలు పెడతారు, దుర్భాషలాడతారు, అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతారు, మీ భర్తల హక్కులను మీరు నిరాకరిస్తారు”. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఇలా వర్ణించారు: తెలివితేటలు, హేతుబద్ధత, జ్ఞానం మరియు తన వ్యవహారాలపై నియంత్రణ ఉన్న వ్యక్తిని కూడా దారి తప్పించడంలో మీ కంటే ఎక్కువ తెలివితేటలు మరియు నైతికత లోపించిన వారిని నేను చూడలేదు. ఆమె ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మా వివేకములో మరియు ధర్మములో కొరత ఏమిటి?” అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వివేకములో కొరత విషయానికొస్తే, (షరియతులో) ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడి సాక్ష్యానికి సమానం; వివేకములో కొరత అంటే ఇదే. ధర్మములో కొరత అంటే వారి మంచి పనులు చేసే అవకాశాలు తగ్గడం, ఎందుకంటే ఒక స్త్రీ రుతుస్రావం కారణంగా ఆ కాలంలో రాత్రింబవళ్ళు నమాజు ఆచరించకుండా గడుపుతుంది; అలాగే రుతుస్రావం కారణంగా రమదాన్ మాసములో తక్కువ రోజులు ఉపవాసం ఉంటుంది; ధర్మములో కొరత అంటే ఇదే. అయితే, వారు దానికి నిందార్హులు గానీ లేదా జవాబుదారులు గానీ కాదు; ఎందుకంటే ఇది వారి సహజ స్వభావంలో భాగం, పురుషులు సంపద పట్ల సహజమైన ప్రేమ, వారి విషయాలలో తొందరపాటు, అజ్ఞానం మరియు ఇతర లక్షణాలతో సృష్టించబడినట్లే (స్త్రీలు కూడా సహజంగానే ఆ విధంగా సృష్టించబడినారు). అయితే, వారితో మోహంలో పడకుండా ఉండటానికి ఇక్కడ ఇది హెచ్చరికగా ప్రస్తావించబడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయతా ప్రమాణం చేసిన సాహబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”
అబూ దావూద్ పదాలతో మరియు అల్ బుఖారీ (తుహుర్ తరువాత) అనే పదం లేకుండా నమోదు చేసినారు:ఈ హదీసులో సహాబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, బహిష్ఠు స్థితి నుండి (గుసుల్ చేసి) పరిశుద్ధత పొందిన తరువాత కూడా స్త్రీ జననాంగము నుండి స్రవిస్తూ ఉండే, పసుపు రంగు లేదా నలుపు రంగు ద్రవాన్ని, బహిష్ఠుగా భాగంగా భావించే వారము కాదు. దాని కారణంగా మేము నమాజు ఆచరించుట లేదా ఉపవాసములు పాటించుట ఆపివేసే వారము కాదు. (దీనిని బట్టి బహిష్ఠు స్థితిలో స్త్రీ జననాంగము నుండి రక్తస్రావము ఆగిపోయిన వెంటనే గుసుల్ చేసి పరిశుద్ధత పొందాలని, ఆతరువాత కూడా ఒకవేళ పసుపు రంగులో కానీ లేక నలుపు రంగులో కానీ ద్రవ పదార్థము స్రవిస్తూ ఉన్నట్లయితే దానిని మలినంగా భావించరాదని, నమాజు, ఉపవాసము మొదలైనవి ఆపివేయరాదని తెలియుచున్నది).